కీర్తనలు
సంగీత నిర్దేశకునికి సూచన. దావీదు కీర్తన.
14 “యెహోవా లేడు” అని
మూర్ఖులు* తమ హృదయంలో అనుకుంటారు.+
వాళ్ల పనులు చెడ్డవి, వాళ్ల వ్యవహారాలు అసహ్యమైనవి;
మంచి చేసేవాళ్లు ఎవ్వరూ లేరు.+
2 అయితే, లోతైన అవగాహన ఉన్నవాళ్లు, యెహోవాను వెతుకుతున్నవాళ్లు ఎవరైనా ఉన్నారేమోనని
యెహోవా పరలోకం నుండి మనుషుల్ని చూస్తున్నాడు.+
3 వాళ్లంతా దారితప్పారు;+
అందరూ చెడిపోయారు.
మంచి చేసేవాళ్లు ఎవ్వరూ లేరు,
కనీసం ఒక్కడు కూడా లేడు.
4 తప్పుచేసే వాళ్లెవ్వరికీ అర్థం కావడం లేదా?
రొట్టెలు తింటున్నట్టు వాళ్లు నా ప్రజల్ని మింగేస్తున్నారు.
వాళ్లు యెహోవాకు ప్రార్థన చేయరు.
5 కానీ వాళ్లు తీవ్రంగా భయపడతారు,+
ఎందుకంటే, నీతిమంతుల తరానికి యెహోవా తోడుగా ఉన్నాడు.
6 తప్పుచేసేవాళ్లారా, మీరు దీనుల ప్రణాళికల్ని పాడుచేయడానికి ప్రయత్నిస్తారు,
అయితే యెహోవా వాళ్లకు ఆశ్రయంగా ఉన్నాడు.+
7 సీయోను నుండి ఇశ్రాయేలుకు రక్షణ రావాలి!+
బందీలుగా ఉన్న తన ప్రజల్ని యెహోవా మళ్లీ సమకూర్చినప్పుడు,
యాకోబు సంతోషించాలి, ఇశ్రాయేలు ఉల్లసించాలి.