ఆదికాండం
7 తర్వాత యెహోవా నోవహుతో ఇలా చెప్పాడు: “నువ్వూ, నీ ఇంటివాళ్లందరూ ఓడలోకి వెళ్లండి. ఎందుకంటే ఈ తరంవాళ్లలో నువ్వు మాత్రమే నాకు నీతిమంతునిగా కనిపించావు.+ 2 అన్నిరకాల పవిత్ర జంతువుల్లో ఏడేడు* చొప్పున మగవాటిని, ఆడవాటిని నీతోపాటు ఓడలోకి తీసుకెళ్లాలి;+ అన్నిరకాల అపవిత్ర జంతువుల్లో రెండిటిని మాత్రమే అంటే ఒక మగదాన్ని, ఒక ఆడదాన్ని తీసుకెళ్లాలి; 3 అలాగే, ఆకాశంలో ఎగిరే ప్రాణుల సంతతి భూమంతటా సజీవంగా ఉండేలా వాటిని కూడా ఏడేడు* చొప్పున మగవాటిని, ఆడవాటిని ఓడలోకి తీసుకెళ్లాలి.+ 4 ఎందుకంటే, కేవలం ఏడురోజుల్లో నేను భూమ్మీద 40 పగళ్లు, 40 రాత్రులు వర్షం కురిపిస్తాను.+ నేను చేసిన ప్రతీ ప్రాణిని నేలమీద నుండి తుడిచేస్తాను.”+ 5 యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రతీది నోవహు చేశాడు.
6 భూమ్మీదికి జలప్రళయం వచ్చినప్పుడు నోవహు వయసు 600 ఏళ్లు.+ 7 జలప్రళయం రాకముందే నోవహు తన కుమారులతో, భార్యతో, కోడళ్లతో కలిసి ఓడలోకి వెళ్లాడు.+ 8 అన్నిరకాల పవిత్ర జంతువుల్లో నుండి, అన్నిరకాల అపవిత్ర జంతువుల్లో నుండి, ఎగిరే ప్రాణుల్లో నుండి, నేలమీద కదిలే ప్రతీదానిలో నుండి+ 9 రెండేసి చొప్పున మగవి, ఆడవి ఓడలో ఉన్న నోవహు దగ్గరికి వెళ్లాయి. అంతా దేవుడు నోవహుకు ఆజ్ఞాపించినట్టే జరిగింది. 10 ఏడురోజుల తర్వాత భూమ్మీదికి జలప్రళయం వచ్చింది.
11 నోవహు జీవితంలోని 600వ సంవత్సరం, రెండో నెల, 17వ రోజున, సరిగ్గా అదే రోజున పెద్దపెద్ద అగాధ జలాల ఊటలన్నీ పెల్లుబికాయి, ఆకాశ తూములు* తెరవబడ్డాయి.+ 12 అప్పుడు భూమ్మీద 40 పగళ్లు, 40 రాత్రులు కుండపోతగా వర్షం కురిసింది. 13 సరిగ్గా అదే రోజున నోవహు తన కుమారులు షేము, హాము, యాపెతులతో,+ తన భార్యతో, తన ముగ్గురు కోడళ్లతో కలిసి ఓడలోకి వెళ్లాడు.+ 14 దానిదాని జాతి ప్రకారం ప్రతీ అడవి జంతువును, దానిదాని జాతి ప్రకారం ప్రతీ సాధు జంతువును, దానిదాని జాతి ప్రకారం భూమ్మీద పాకే ప్రతీ జంతువును, దానిదాని జాతి ప్రకారం ఎగిరే ప్రతీ ప్రాణిని, అంటే ప్రతీ పక్షిని, రెక్కలున్న ప్రతీ జీవిని తీసుకొని వాళ్లు ఓడలోకి వెళ్లారు. 15 ఊపిరి తీసుకునే* ప్రతీ రకమైన ప్రాణులు రెండేసి చొప్పున ఓడలో ఉన్న నోవహు దగ్గరికి వెళ్తూ ఉన్నాయి. 16 దేవుడు నోవహుకు ఆజ్ఞాపించినట్టే ప్రతీ రకమైన ప్రాణుల్లో మగవి, ఆడవి లోపలికి వెళ్లాయి. ఆ తర్వాత యెహోవా ఓడ తలుపును మూసేశాడు.
17 భూమ్మీద 40 రోజుల పాటు వర్షం కురుస్తూనే ఉంది, దానివల్ల నీటిమట్టం అంతకంతకూ పెరిగి ఆ ఓడను పైకెత్తింది, ఓడ చాలా ఎత్తులో నీళ్ల మీద తేలుతూ ఉంది. 18 నీటి ఉధృతి పెరిగి భూమ్మీద నీళ్లు చాలాచాలా ఎక్కువౌతూ ఉన్నాయి, కానీ ఓడ నీళ్ల మీద తేలుతూ ఉంది. 19 నీటి ప్రవాహం భూమ్మీద ఎంత ఎక్కువైందంటే, ఆకాశమంతటి కింద ఉన్న ఎత్తైన పర్వతాలన్నీ మునిగిపోయాయి.+ 20 నీటిమట్టం పర్వత శిఖరాల నుండి 15 మూరల* ఎత్తుకు చేరింది.
21 దాంతో ఎగిరే ప్రాణులు, సాధు జంతువులు, అడవి జంతువులు, గుంపులుగుంపులుగా తిరిగే చిన్నచిన్న ప్రాణులు, మనుషులందరూ, అంటే భూమ్మీద కదిలే ప్రాణులన్నీ నాశనమయ్యాయి.+ 22 ఆరిన నేల మీద, జీవశక్తి ఉండి ఊపిరి తీసుకునే* ప్రతీది చనిపోయింది.+ 23 అలా మనుషులు, జంతువులు, పాకే జీవులు, ఆకాశంలో ఎగిరే ప్రాణులతో సహా భూమ్మీదున్న ప్రాణులన్నిటినీ ఆయన తుడిచేశాడు. అవన్నీ భూమ్మీద లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి;+ కేవలం నోవహు కుటుంబం, వాళ్లతో పాటు ఓడలో ఉన్న ప్రాణులు మాత్రమే తప్పించుకున్నాయి.+ 24 భూమ్మీద నీటి ఉధృతి 150 రోజుల పాటు అలాగే కొనసాగింది.+