లూకా సువార్త
4 తర్వాత యేసు పవిత్రశక్తితో నిండిపోయి యొర్దాను నది దగ్గర నుండి వెళ్లిపోయాడు. పవిత్రశక్తి ఆయన్ని ఎడారిలోకి నడిపించింది.+ 2 ఆయన ఎడారిలో 40 రోజులు ఉన్నాడు. అక్కడ అపవాది ఆయన్ని ప్రలోభపెట్టడానికి ప్రయత్నించాడు.+ ఆ రోజుల్లో ఆయన ఏమీ తినలేదు కాబట్టి ఆ 40 రోజులు ముగిశాక ఆయనకు బాగా ఆకలేసింది. 3 అప్పుడు అపవాది ఆయనతో, “నువ్వు దేవుని కుమారుడివైతే, ఈ రాయిని రొట్టెగా మారమని ఆజ్ఞాపించు” అన్నాడు. 4 అయితే యేసు అపవాదితో, “ ‘మనిషి రొట్టె వల్ల మాత్రమే జీవించకూడదు’ అని రాయబడివుంది” అన్నాడు.+
5 అపవాది ఆయన్ని ఒక ఎత్తైన చోటికి తీసుకెళ్లి, భూలోక రాజ్యాలన్నిటినీ ఒక్క క్షణంలో ఆయనకు చూపించి+ 6 ఆయనతో ఇలా అన్నాడు: “ఈ అధికారం అంతటినీ, వాటి మహిమను నేను నీకు ఇచ్చేస్తాను. ఎందుకంటే, అది నాకు అప్పగించబడింది.+ నేను దాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్లకు ఇస్తాను. 7 కాబట్టి నువ్వు ఒక్కసారి నన్ను పూజిస్తే, ఇక ఇవన్నీ నీవే.” 8 దానికి యేసు అపవాదితో, “ ‘నీ దేవుడైన యెహోవానే* నువ్వు ఆరాధించాలి. ఆయనకు మాత్రమే పవిత్రసేవ చేయాలి’ అని రాయబడివుంది” అన్నాడు.+
9 తర్వాత అపవాది ఆయన్ని యెరూషలేముకు తీసుకెళ్లి, ఆలయం గోడ* మీద నిలబెట్టి ఆయనతో ఇలా అన్నాడు: “నువ్వు దేవుని కుమారుడివైతే, ఇక్కడి నుండి కిందికి దూకు.+ 10 ఎందుకంటే, ‘నిన్ను కాపాడమని ఆయన నీ గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు’ అని రాయబడివుంది. 11 అంతేకాదు, ‘నీ పాదానికి రాయి తగలకుండా వాళ్లు తమ చేతులమీద నిన్ను మోస్తారు.’ ”+ 12 దానికి యేసు అపవాదితో, “ ‘నువ్వు నీ దేవుడైన యెహోవాను* పరీక్షించకూడదు’ అని చెప్పబడింది” అన్నాడు.+ 13 ఆయన్ని ప్రలోభపెట్టడానికి ప్రయత్నించడం పూర్తయ్యాక అపవాది ఇంకో మంచి అవకాశం దొరికే వరకు ఆయన్ని విడిచి వెళ్లిపోయాడు.+
14 అప్పుడు యేసు పవిత్రశక్తి బలంతో గలిలయకు తిరిగెళ్లాడు.+ ఆయన గురించిన మంచి నివేదికలు అక్కడున్న గ్రామాలన్నిటిలో వ్యాపించాయి. 15 అంతేకాదు, ఆయన వాళ్ల సమాజమందిరాల్లో బోధించడం మొదలుపెట్టాడు, అందరూ ఆయన గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉన్నారు.
16 తర్వాత ఆయన తాను పెరిగి పెద్దయిన నజరేతుకు వచ్చి,+ తన అలవాటు ప్రకారం విశ్రాంతి రోజున* సమాజమందిరానికి వెళ్లి+ లేఖనాలు చదవడానికి నిలబడ్డాడు. 17 అప్పుడు ఆయనకు యెషయా ప్రవక్త గ్రంథపు చుట్ట ఇవ్వబడింది. ఆయన దాన్ని తెరిచి, ఈ మాటలు రాయబడివున్న చోటును కనుగొన్నాడు: 18 “యెహోవా* పవిత్రశక్తి నా మీద ఉంది. ఎందుకంటే, పేదవాళ్లకు మంచివార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. బందీలకు విడుదల కలుగుతుందని, గుడ్డివాళ్లకు చూపు వస్తుందని ప్రకటించడానికి; అణచివేయబడిన వాళ్లను విడిపించడానికి ఆయన నన్ను పంపించాడు.+ 19 అంతేకాదు, యెహోవా* అనుగ్రహ సంవత్సరం గురించి ప్రకటించడానికి కూడా ఆయన నన్ను పంపించాడు.”+ 20 తర్వాత ఆయన ఆ గ్రంథపు చుట్టను చుట్టేసి, దాన్ని అక్కడున్న సేవకుడికి తిరిగిచ్చి కూర్చున్నాడు. ఆ సమాజమందిరంలో ఉన్నవాళ్లందరూ రెప్పవాల్చకుండా ఆయన వైపే చూస్తూ ఉన్నారు. 21 అప్పుడు ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “ఇప్పుడు మీరు విన్న లేఖనం ఈ రోజు నెరవేరింది.”+
22 దాంతో వాళ్లంతా ఆయన గురించి మంచిగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. వాళ్లు ఆయన నోటి నుండి వస్తున్న దయగల మాటలకు+ ఆశ్చర్యపోతూ, “ఈయన యోసేపు కుమారుడే కదా?” అని చెప్పుకున్నారు.+ 23 అప్పుడాయన వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు, ‘వైద్యుడా, నిన్ను నువ్వు బాగుచేసుకో’ అనే సామెత చెప్పి, దాన్ని తప్పకుండా నాకు అన్వయిస్తారు. ‘కపెర్నహూములో+ ఏమేం జరిగాయని మేము విన్నామో వాటిని ఇక్కడ నీ సొంత ఊరిలో కూడా చేయి’ అని నాతో అంటారు.” 24 తర్వాత ఆయన ఇలా అన్నాడు: “నేను నిజంగా మీతో చెప్తున్నాను, ఏ ప్రవక్తకూ సొంత ఊరిలో గౌరవం ఉండదు.+ 25 నేను చెప్పేది నమ్మండి: ఏలీయా రోజుల్లో మూడు సంవత్సరాల ఆరు నెలలపాటు వర్షాలు లేక దేశమంతటా గొప్ప కరువు వచ్చినప్పుడు+ ఇశ్రాయేలులో చాలామంది విధవరాళ్లు ఉన్నారు. 26 అయినా ఏలీయా వాళ్లలో ఏ ఒక్కరి దగ్గరికీ పంపించబడలేదు, కానీ సీదోను దేశంలోని సారెపతులో ఉన్న ఒక విధవరాలి దగ్గరికే పంపించబడ్డాడు.+ 27 అంతేకాదు, ఎలీషా ప్రవక్త రోజుల్లో ఇశ్రాయేలులో చాలామంది కుష్ఠురోగులు ఉన్నారు. అయినా వాళ్లలో ఏ ఒక్కరూ శుద్ధులుగా చేయబడలేదు,* సిరియా దేశస్థుడైన నయమాను మాత్రమే శుద్ధుడిగా చేయబడ్డాడు.”+ 28 సమాజమందిరంలో ఈ విషయాలు వింటున్న వాళ్లందరూ కోపంతో ఊగిపోయారు.+ 29 కాబట్టి వాళ్లు లేచి ఆయన్ని నగరం బయటికి తరిమి, తమ నగరం ఏ కొండ మీదైతే కట్టబడిందో ఆ కొండ శిఖరానికి ఆయన్ని తీసుకుపోయారు. అక్కడి నుండి ఆయన్ని తలకిందులుగా కిందికి తోసేద్దామని అనుకున్నారు. 30 కానీ ఆయన వాళ్ల మధ్య నుండి తప్పించుకొని తన దారిన వెళ్లిపోయాడు.+
31 తర్వాత ఆయన గలిలయలో ఉన్న కపెర్నహూము నగరానికి వెళ్లి, విశ్రాంతి రోజున వాళ్లకు బోధిస్తున్నాడు.+ 32 ఆయన బోధించే తీరు చూసి వాళ్లు ఎంతో ఆశ్చర్యపోయారు,+ ఎందుకంటే ఆయన అధికారంతో మాట్లాడాడు. 33 ఆ సమయంలో, అపవిత్ర దూత* పట్టిన ఒకతను ఆ సమాజమందిరంలో ఉన్నాడు. అతను ఇలా అరిచాడు:+ 34 “నజరేయుడివైన యేసూ,+ మాతో నీకేం పని? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా? నువ్వు ఎవరో నాకు బాగా తెలుసు, నువ్వు దేవుని పవిత్రుడివి!”+ 35 అయితే యేసు ఆ అపవిత్ర దూతను గద్దిస్తూ, “మాట్లాడకుండా అతనిలో నుండి బయటికి రా!” అన్నాడు. దాంతో ఆ అపవిత్ర దూత అతన్ని వాళ్ల మధ్య కింద పడేసి, అతనికి ఏ హానీ చేయకుండా అతనిలో నుండి బయటికి వచ్చేశాడు. 36 దాంతో వాళ్లంతా ఆశ్చర్యపోయి, “ఈయన మాటలు చూడండి! ఈయన అధికారంతో, శక్తితో అపవిత్ర దూతల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. వాళ్లు బయటికి వచ్చేస్తున్నారు!” అని చెప్పుకోవడం మొదలుపెట్టారు. 37 కాబట్టి ఆయన గురించిన వార్త ఆ చుట్టుపక్కల గ్రామాల్లో నలుమూలలా వ్యాపిస్తూ ఉంది.
38 సమాజమందిరం నుండి వచ్చేశాక ఆయన సీమోను ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో, సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో బాధపడుతోంది. దాంతో వాళ్లు, ఆమెకు సహాయం చేయమని ఆయన్ని అడిగారు.+ 39 కాబట్టి ఆయన ఆమె దగ్గర నిలబడి, వంగి ఆ జ్వరాన్ని గద్దించాడు; వెంటనే ఆ జ్వరం పోయింది. ఆ క్షణమే ఆమె లేచి వాళ్లకు సేవలు చేయడం మొదలుపెట్టింది.
40 అయితే సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు, ప్రజలందరూ తమ ఇళ్లలో రకరకాల రోగాలతో బాధపడుతున్న వాళ్లను ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన వాళ్లలో ఒక్కొక్కరి మీద చేతులు ఉంచి వాళ్లను బాగుచేశాడు.+ 41 అంతేకాదు, చాలామందిలో నుండి చెడ్డదూతలు* బయటికి వచ్చారు. వాళ్లు, “నువ్వు దేవుని కుమారుడివి” అంటూ బయటికి వచ్చారు.+ కానీ ఆయన ఆ చెడ్డదూతల్ని గద్దించి మాట్లాడనివ్వలేదు.+ ఎందుకంటే, ఆయనే క్రీస్తు అని ఆ చెడ్డదూతలకు తెలుసు.+
42 అయితే తెల్లవారినప్పుడు ఆయన అక్కడి నుండి బయల్దేరి, ఎవరూలేని చోటికి వెళ్లాడు.+ అయితే ప్రజలు గుంపులుగుంపులుగా ఆయన కోసం వెతుక్కుంటూ ఆయన ఉన్న చోటికి వచ్చారు. వాళ్లు ఆయన్ని తమ దగ్గర నుండి వెళ్లిపోకుండా ఆపడానికి ప్రయత్నించారు. 43 కానీ ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “నేను మిగతా నగరాల్లో కూడా దేవుని రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించాలి. ఇందుకోసమే దేవుడు నన్ను పంపించాడు.”+ 44 కాబట్టి ఆయన యూదయలో ఉన్న సమాజమందిరాల్లో ప్రకటిస్తూ వెళ్లాడు.