నెహెమ్యా
1 ఇవి హకల్యా కుమారుడైన నెహెమ్యా*+ మాటలు: 20వ సంవత్సరం, కిస్లేవు* నెలలో నేను షూషను*+ కోటలో* ఉన్నాను. 2 అప్పుడు నా సహోదరుల్లో ఒకడైన హనానీ+ కొంతమంది మనుషులతో కలిసి యూదా నుండి వచ్చాడు. నేను వాళ్లను చెర నుండి తిరిగొచ్చిన మిగతా యూదుల+ గురించి, యెరూషలేము గురించి అడిగాను. 3 అందుకు వాళ్లు ఇలా చెప్పారు: “చెర నుండి తిరిగొచ్చిన మిగిలినవాళ్లు యూదా సంస్థానంలో ఘోరమైన పరిస్థితుల మధ్య, అవమానాల మధ్య బ్రతుకుతున్నారు.+ యెరూషలేము ప్రాకారాలు పడిపోయాయి,+ దాని ద్వారాలు అగ్నితో కాల్చేయబడ్డాయి.”+
4 ఆ మాటలు వినగానే నేను కూర్చుని కొన్నిరోజుల పాటు ఏడుస్తూ, దుఃఖిస్తూ, ఉపవాసం ఉంటూ+ పరలోక దేవుని ముందు ప్రార్థిస్తూ ఉన్నాను. 5 నేను ఇలా ప్రార్థించాను: “పరలోక దేవా, యెహోవా, సంభ్రమాశ్చర్యాలు పుట్టించే గొప్ప దేవా, నిన్ను ప్రేమించి, నీ ఆజ్ఞల్ని పాటించేవాళ్ల విషయంలో నువ్వు నీ ఒప్పందాన్ని* నిలబెట్టుకుంటావు, వాళ్లమీద విశ్వసనీయ ప్రేమ చూపిస్తావు.+ 6 దయచేసి నువ్వు చెవిపెట్టి, నా మీద దృష్టి ఉంచి నీ సేవకుడినైన నేను ఈ రోజు నీకు చేస్తున్న ప్రార్థనను ఆలకించు. నీ సేవకులైన ఇశ్రాయేలీయుల గురించి నేను రాత్రింబగళ్లు నీకు ప్రార్థిస్తున్నాను.+ ఇశ్రాయేలీయులు నీకు వ్యతిరేకంగా చేసిన పాపాల్ని కూడా ఒప్పుకుంటున్నాను. నేనూ, నా తండ్రి ఇంటివాళ్లూ పాపం చేశాం.+ 7 నీ సేవకుడైన మోషేకు నువ్వు ఇచ్చిన ఆజ్ఞల్ని, నియమాల్ని, న్యాయనిర్ణయాల్ని పాటించకుండా+ మేము నిజంగా నీ ముందు చాలా చెడ్డగా ప్రవర్తించాం.+
8 “నీ సేవకుడైన మోషేకు నువ్వు ఆజ్ఞాపించిన ఈ మాటను* దయచేసి గుర్తుచేసుకో: ‘ఒకవేళ మీరు నమ్మకద్రోహుల్లా ప్రవర్తిస్తే నేను మిమ్మల్ని జనాల మధ్యకు చెదరగొడతాను.+ 9 కానీ మీరు నా దగ్గరికి తిరిగొచ్చి, నా ఆజ్ఞల్ని పాటించి, వాటికి విధేయత చూపిస్తే, మీరు భూమి అంచుల వరకు చెదిరిపోయినా సరే అక్కడి నుండి మిమ్మల్ని సమకూరుస్తాను,+ నా పేరును ఉంచడానికి నేను ఎంచుకున్న చోటుకు+ మిమ్మల్ని తీసుకొస్తాను.’ 10 వాళ్లు నీ సేవకులు, నీ ప్రజలు. నువ్వే నీ గొప్ప శక్తితో, బలమైన చేతితో వాళ్లను విడిపించావు.+ 11 యెహోవా, దయచేసి నీ సేవకుని ప్రార్థనను, నీ పేరుకు సంతోషంగా భయపడే నీ సేవకుల ప్రార్థనను చెవిపెట్టి విను; దయచేసి నేడు నీ సేవకుని పని సఫలమయ్యేలా చేయి, రాజుకు నా మీద కనికరం కలిగేలా చూడు.”+
ఆ రోజుల్లో నేను రాజుకు గిన్నె అందించేవాణ్ణి.