మార్కు సువార్త
7 యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు, కొందరు శాస్త్రులు యేసు చుట్టూ చేరారు.+ 2 ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో, అంటే చేతులు కడుక్కోకుండా* భోజనం చేయడం వాళ్లు చూశారు. 3 (పరిసయ్యులతో సహా యూదులందరూ తమ పూర్వీకుల ఆచారాన్ని పాటిస్తూ మోచేతుల వరకు చేతులు కడుక్కున్నాకే భోజనం చేస్తారు. 4 సంత నుండి వచ్చినప్పుడైతే తమను తాము శుభ్రపర్చుకోకుండా భోజనం చేయరు. అంతేకాదు పారంపర్యంగా వచ్చిన ఎన్నో ఇతర ఆచారాల్ని, అంటే గిన్నెల్ని, కూజాల్ని, రాగి పాత్రల్ని నీళ్లలో ముంచడం వంటివాటిని వాళ్లు నిష్ఠగా పాటిస్తారు.)+ 5 అందుకే ఆ పరిసయ్యులు, శాస్త్రులు యేసును, “నీ శిష్యులు పూర్వీకుల ఆచారాన్ని పాటించకుండా అపవిత్రమైన చేతులతో భోజనం చేస్తున్నారేంటి?” అని అడిగారు.+ 6 దానికి ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “వేషధారులారా, మీ గురించి యెషయా సరిగ్గానే చెప్పాడు. అతను ఇలా రాశాడు: ‘ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుస్తారు కానీ వీళ్ల హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి.+ 7 వీళ్లు మనుషుల ఆజ్ఞల్ని దేవుని బోధలన్నట్టు బోధిస్తారు కాబట్టి వీళ్లు నన్ను ఆరాధిస్తూ ఉండడం వృథా.’+ 8 మీరు దేవుని ఆజ్ఞల్ని వదిలేసి మనుషుల ఆచారాల్ని పట్టుకువేలాడతారు.”+
9 ఆయన వాళ్లతో ఇంకా ఇలా అన్నాడు: “మీరు మీ ఆచారాల్ని కాపాడుకోవడానికి దేవుని ఆజ్ఞల్ని నేర్పుగా పక్కన పెట్టేస్తారు.+ 10 ఉదాహరణకు మోషే, ‘మీ అమ్మానాన్నల్ని గౌరవించు’+ అని, ‘అమ్మనైనా, నాన్ననైనా తిట్టేవాడికి* మరణశిక్ష విధించాలి’+ అని చెప్పాడు. 11 కానీ మీరేమో, ‘ఒక వ్యక్తి వాళ్ల అమ్మతో గానీ, నాన్నతో గానీ “నా వల్ల మీరు పొందగలిగే సహాయం ఏదైనా అది కొర్బాను (లేదా, దేవునికి సమర్పించిన కానుక)” అని అంటే’ 12 అతన్ని వాళ్ల అమ్మానాన్నల కోసం ఇంకేమీ చేయనివ్వరు.+ 13 అలా మీరు, తరతరాలుగా వస్తున్న మీ ఆచారంతో దేవుని వాక్యాన్ని నీరుగారుస్తున్నారు.+ ఇలాంటివి మీరు చాలా చేస్తారు.”+ 14 యేసు మళ్లీ ప్రజల్ని తన దగ్గరికి పిలిచి ఇలా అన్నాడు: “నేను చెప్పేది మీరంతా వినండి, అర్థంచేసుకోండి.+ 15 మనిషి లోపలికి వెళ్లేదేదీ అతన్ని అపవిత్రం చేయదు కానీ, మనిషి లోపలి నుండి వచ్చేవే అతన్ని అపవిత్రం చేస్తాయి.”+ 16 *——
17 యేసు ప్రజల్ని విడిచి ఒక ఇంట్లోకి వెళ్లినప్పుడు, శిష్యులు ఆ ఉదాహరణ* గురించి ఆయన్ని ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు.+ 18 అప్పుడు ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “వాళ్లలాగే మీకూ అర్థం కాలేదా? మనిషి లోపలికి వెళ్లేదేదీ మనిషిని అపవిత్రం చేయలేదని మీకు తెలీదా? 19 ఎందుకంటే అది హృదయంలోకి కాదు కడుపులోకి వెళ్తుంది, తర్వాత బయటికి వచ్చేస్తుంది.” అలా ఆయన అన్ని ఆహారపదార్థాలు పవిత్రమైనవని అన్నాడు. 20 ఆయన ఇంకా ఇలా అన్నాడు: “మనిషి లోపలి నుండి వచ్చేదే అతన్ని అపవిత్రం చేస్తుంది.+ 21 ఎందుకంటే హానికరమైన ఆలోచనలు లోపలి నుండి, అంటే హృదయంలో నుండి వస్తాయి.+ అవి ఏంటంటే: లైంగిక పాపాలు,* దొంగతనాలు, హత్యలు, 22 అక్రమ సంబంధాలు, అత్యాశ, దుర్మార్గపు పనులు, మోసం, లెక్కలేనితనం,* ఈర్ష్య,* దైవదూషణ, అహంకారం, మూర్ఖత్వం. 23 ఈ చెడ్డవన్నీ లోపలి నుండే వస్తాయి, ఇవే మనిషిని అపవిత్రం చేస్తాయి.”
24 ఆయన అక్కడి నుండి బయల్దేరి తూరు, సీదోనుల ప్రాంతానికి వెళ్లాడు.+ అక్కడ ఆయన ఒక ఇంట్లోకి వెళ్లాడు, ఆ విషయం ఎవ్వరికీ తెలియకూడదని అనుకున్నాడు, కానీ తెలిసిపోయింది. 25 ఆయన గురించి విన్న ఒకామె వెంటనే వచ్చి ఆయన కాళ్ల మీద పడింది, ఎందుకంటే వాళ్ల పాపకు అపవిత్ర దూత* పట్టాడు.+ 26 ఆమె గ్రీకు స్త్రీ, సిరియాలోని ఫేనీకే వాసురాలు;* ఆమె తన కూతురికి పట్టిన అపవిత్ర దూతను వెళ్లగొట్టమని ఆయన్ని ఎంతో వేడుకుంది. 27 కానీ ఆయన ఆమెతో, “ముందు పిల్లల్ని తృప్తిగా తిననివ్వాలి, పిల్లల రొట్టెలు తీసి కుక్కపిల్లలకు వేయడం సరికాదు” అన్నాడు.+ 28 అందుకు ఆమె, “నిజమే ప్రభువా, కానీ బల్ల కింద ఉన్న కుక్కపిల్లలు కూడా పిల్లలు పడేసే రొట్టె ముక్కల్ని తింటాయి కదా” అని అంది. 29 అప్పుడు ఆయన ఆమెతో, “నువ్వు ఈ మాట అన్నావు కాబట్టి వెళ్లు, అపవిత్ర దూత నీ కూతుర్ని వదిలి వెళ్లిపోయాడు” అన్నాడు.+ 30 ఆమె ఇంటికి వెళ్లి చూసినప్పుడు, వాళ్లమ్మాయి మంచం మీద పడుకొని ఉంది, అపవిత్ర దూత ఆ అమ్మాయిని వదిలివెళ్లాడు.+
31 యేసు తూరు నుండి బయల్దేరి సీదోను గుండా, దెకపొలి ప్రాంతం* గుండా గలిలయ సముద్రం దగ్గరికి వచ్చాడు.+ 32 అక్కడ ప్రజలు నత్తి ఉన్న ఒక చెవిటివాణ్ణి+ ఆయన దగ్గరికి తీసుకొచ్చి, అతని మీద చేతులుంచమని ఆయన్ని వేడుకున్నారు. 33 ఆయన అతన్ని జనానికి దూరంగా పక్కకు తీసుకెళ్లాడు. తర్వాత అతని చెవుల్లో వేళ్లు పెట్టి, ఉమ్మివేసి, అతని నాలుకను ముట్టుకున్నాడు.+ 34 ఆ తర్వాత ఆయన ఆకాశం వైపు చూసి, గట్టిగా నిట్టూర్చి అతనితో “ఎప్ఫతా” అన్నాడు, ఆ మాటకు “తెరుచుకో” అని అర్థం. 35 దాంతో అతని చెవులు తెరుచుకున్నాయి,+ నత్తి పోయి అతను మామూలుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. 36 దాని గురించి ఎవ్వరికీ చెప్పొద్దని ఆయన వాళ్లకు ఆజ్ఞాపించాడు.+ కానీ, ఆయన అలా చెప్పిన కొద్దీ, ప్రజలు ఇంకా ఎక్కువగా దాని గురించి ప్రచారం చేశారు.+ 37 నిజానికి, వాళ్లు ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరై,+ “ఆయన చేసేవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆయన చివరికి చెవిటివాళ్లు కూడా వినేలా చేస్తున్నాడు, మూగవాళ్లు కూడా మాట్లాడేలా చేస్తున్నాడు” అన్నారు.+