13 తెలివిగలవాడు తన తండ్రి క్రమశిక్షణను స్వీకరిస్తాడు,+
ఎగతాళి చేసేవాడు గద్దింపును పట్టించుకోడు.+
2 తన నోటి మాటల వల్ల ఒక వ్యక్తి మంచివాటిని అనుభవిస్తాడు,+
అయితే మోసగాళ్లు దౌర్జన్యం చేయాలని ఎంతో కోరుకుంటారు.
3 నోటిని కాచుకునేవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు,+
నోటిని అదుపులో పెట్టుకోనివాడు నాశనమౌతాడు.+
4 బద్దకస్తునికి చాలా కోరికలు ఉంటాయి, కానీ ఏమీ దొరకదు,+
కష్టపడి పనిచేసేవాడు పూర్తిగా తృప్తి పొందుతాడు.+
5 నీతిమంతునికి అబద్ధాలంటే అసహ్యం,+
దుష్టుల పనులు సిగ్గును, అవమానాన్ని తీసుకొస్తాయి.
6 నీతి నిర్దోషంగా నడుచుకునేవాళ్లను కాపాడుతుంది,+
దుష్టత్వం పాపుల్ని నాశనం చేస్తుంది.
7 ఏమీ లేకపోయినా ధనవంతుల్లా నటించేవాళ్లు ఉన్నారు,+
ఎంతో ఆస్తి ఉన్నా పేదవాళ్లలా నటించేవాళ్లు కూడా ఉన్నారు.
8 ధనవంతుడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తన ఆస్తిని ఇస్తాడు,+
పేదవాడికి అసలు అలాంటి పరిస్థితే రాదు.+
9 నీతిమంతుని వెలుగు తేజోవంతంగా ప్రకాశిస్తుంది,+
దుష్టుల దీపం ఆరిపోతుంది.+
10 అహంకారం వల్ల గొడవలే వస్తాయి,+
సలహా కోసం వెదికేవాళ్ల దగ్గర తెలివి ఉంటుంది.+
11 త్వరగా సంపాదించిన ఆస్తి తరిగిపోతుంది,+
కొద్దికొద్దిగా సమకూర్చుకున్న ఆస్తి పెరుగుతుంది.
12 ఎదురుచూసింది ఆలస్యమైనప్పుడు బాధ కలుగుతుంది,+
నెరవేరిన కోరిక జీవవృక్షం.+
13 ఉపదేశాన్ని చిన్నచూపు చూసేవాళ్లు తగిన మూల్యం చెల్లిస్తారు,+
ఆజ్ఞను గౌరవించేవాళ్లు ప్రతిఫలం పొందుతారు.+
14 తెలివిగలవాళ్ల ఉపదేశం జీవపు ఊట,+
అది మరణపు ఉరుల నుండి కాపాడుతుంది.
15 లోతైన అవగాహన వల్ల దయ లభిస్తుంది,
కానీ మోసగాళ్ల మార్గం కఠినంగా ఉంటుంది.
16 వివేకం గలవాడు జ్ఞానంతో నడుచుకుంటాడు,+
తెలివితక్కువవాడు తన తెలివితక్కువతనాన్ని బయటపెట్టుకుంటాడు.+
17 చెడ్డ సందేశకుడు కష్టాల్లో పడతాడు,+
నమ్మకమైన రాయబారి మేలు చేస్తాడు.+
18 క్రమశిక్షణను నిర్లక్ష్యం చేసేవాడికి పేదరికం, అవమానం వస్తాయి;
దిద్దుబాటును స్వీకరించేవాడు ఘనత పొందుతాడు.+
19 కోరిక నెరవేరినప్పుడు ప్రాణానికి హాయిగా ఉంటుంది,+
చెడును విడిచిపెట్టడం మూర్ఖులకు అస్సలు నచ్చదు.+
20 తెలివిగలవాళ్లతో తిరిగేవాడు తెలివిగలవాడు అవుతాడు,+
మూర్ఖులతో సహవాసం చేసేవాడు చెడిపోతాడు.+
21 విపత్తు పాపుల్ని వెంటాడుతుంది,+
నీతిమంతులు మంచిని ప్రతిఫలంగా పొందుతారు.+
22 మంచివాడు తన పిల్లల పిల్లలకు ఆస్తిని వదిలివెళ్తాడు,
పాపుల ఆస్తి నీతిమంతుల కోసం దాచబడుతుంది.+
23 పేదవాళ్ల భూమి సమృద్ధిగా పండుతుంది,
అయితే అన్యాయం వల్ల అది తుడిచిపెట్టుకుపోవచ్చు.
24 బెత్తం వాడని తండ్రి తన కుమారుణ్ణి ద్వేషిస్తున్నాడు,+
కుమారుణ్ణి ప్రేమించే వ్యక్తి అతనికి శ్రద్ధగా క్రమశిక్షణ ఇస్తాడు.+
25 నీతిమంతుడు కడుపునిండా భోజనం చేస్తాడు,+
కానీ దుష్టుని కడుపు ఖాళీగా ఉంటుంది.+