మొదటి తిమోతి
5 వృద్ధుడితో కఠినంగా మాట్లాడకు.+ బదులుగా అతన్ని తండ్రిగా భావించి దయతో ఉపదేశమివ్వు. అలాగే యౌవనుల్ని అన్నదమ్ములుగా, 2 వృద్ధ స్త్రీలను తల్లులుగా, యౌవన స్త్రీలను స్వచ్ఛమైన మనసుతో అక్కచెల్లెళ్లుగా భావించి దయతో ఉపదేశమివ్వు.
3 ఏ ఆధారంలేని విధవరాళ్ల మీద శ్రద్ధ చూపించు.*+ 4 అయితే ఏ విధవరాలికైనా పిల్లలు గానీ, మనవళ్లు-మనవరాళ్లు గానీ ఉంటే, వాళ్లు ముందుగా తమ ఇంట్లో దైవభక్తిని చూపించడం నేర్చుకోవాలి; తమ అమ్మానాన్నల, తాతామామ్మల రుణం తీర్చుకోవాలి;+ ఇది దేవుని దృష్టికి అంగీకారమైనది.+ 5 ఏ ఆధారంలేని, ఎవరూ లేని విధవరాలు దేవుని మీద నిరీక్షణ ఉంచి,+ రాత్రింబగళ్లు అభ్యర్థనలు, ప్రార్థనలు చేస్తూ ఉంటుంది.+ 6 కానీ శరీర కోరికలు తీర్చుకోవడంలో మునిగిపోయే విధవరాలు బ్రతికున్నా చనిపోయినట్టే. 7 కాబట్టి, వాళ్లు ఏ నిందా లేకుండా జీవించేలా ఈ నిర్దేశాల్ని* ఇస్తూ ఉండు. 8 ఎవరైనా తన వాళ్లకు, ముఖ్యంగా తన ఇంటివాళ్లకు అవసరమైనవి సమకూర్చకపోతే, అతను విశ్వాసాన్ని విడిచిపెట్టినట్టే; అతను అవిశ్వాసి కన్నా చెడ్డవాడు.+
9 ఒక విధవరాలిని విధవరాళ్ల జాబితాలో చేర్చాలంటే, ఆమెకు 60 ఏళ్ల కన్నా ఎక్కువ వయసు ఉండాలి; ఆమె ఒకే పురుషునికి భార్యగా ఉండివుండాలి; 10 ఆమెకు మంచిపనులు చేసే స్త్రీ అనే పేరు+ ఉండాలి; ఆమె పిల్లల్ని పెంచినదై ఉండాలి; ఆతిథ్యమిచ్చే అలవాటు ఉన్నదై+ ఉండాలి; పవిత్రుల పాదాలు కడిగినదై+ ఉండాలి; కష్టాల్లో ఉన్నవాళ్లను ఆదుకున్నదై+ ఉండాలి; ప్రతీ మంచిపనికి తనను తాను అంకితం చేసుకున్నదై ఉండాలి.
11 అయితే, యౌవన విధవరాళ్లను ఆ జాబితాలో చేర్చకు. ఎందుకంటే, తమ లైంగిక కోరికలు క్రీస్తు సేవకు అడ్డు వచ్చినప్పుడు, వాళ్లు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. 12 వాళ్లు తాము మొదట చేసిన ప్రమాణాన్ని* వదిలేశారు కాబట్టి వాళ్లకు తీర్పు ఉంటుంది. 13 వాళ్లు పనీపాటా లేకుండా ఆ ఇంటికీ ఈ ఇంటికీ తిరగడం నేర్చుకుంటారు; పనీపాటా లేకుండా ఉండడమే కాదు, ఊసుపోని కబుర్లు చెప్పడం, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం,+ తాము మాట్లాడకూడని విషయాల గురించి మాట్లాడడం నేర్చుకుంటారు. 14 కాబట్టి యౌవన విధవరాళ్లు పెళ్లి చేసుకుని,+ పిల్లల్ని కని,+ ఇంటిని చూసుకోవాలని, విమర్శించే అవకాశం వ్యతిరేకికి ఇవ్వకూడదని నా కోరిక. 15 నిజానికి, కొందరు విధవరాళ్లు ఇప్పటికే దారితప్పి సాతానును అనుసరించారు. 16 విశ్వాసియైన ఏ స్త్రీకైనా తన బంధువుల్లో విధవరాళ్లు ఉంటే, ఆమె వాళ్లకు సహాయం చేయాలి, అప్పుడు సంఘం మీద భారం పడకుండా ఉంటుంది. దానివల్ల సంఘం ఏ ఆధారంలేని విధవరాళ్లకు సహాయం చేయగలుగుతుంది.+
17 చక్కగా నాయకత్వం వహించే పెద్దలు,+ ముఖ్యంగా దేవుని వాక్యం గురించి మాట్లాడే విషయంలో, బోధించే విషయంలో కష్టపడి పనిచేసే పెద్దలు+ రెట్టింపు గౌరవానికి అర్హులు.+ 18 ఎందుకంటే లేఖనాల్లో ఇలా ఉంది: “నూర్చే ఎద్దు మూతికి చిక్కం వేయకూడదు,”+ “పనివాడు తన జీతానికి అర్హుడు.”+ 19 ఇద్దరుముగ్గురు సాక్షులు ఉంటే తప్ప,+ సంఘ పెద్ద* మీద వేసిన నిందను అంగీకరించొద్దు. 20 అలవాటుగా పాపం చేసేవాళ్లను+ అందరి* ముందు గద్దించు,+ అది మిగతావాళ్లకు హెచ్చరికగా ఉంటుంది.* 21 ముందే ఒక నిర్ణయానికి రాకుండా, పక్షపాతం చూపించకుండా ఈ నిర్దేశాల్ని పాటించమని+ దేవుని ముందు, క్రీస్తుయేసు ముందు, దేవుడు ఎంపిక చేసుకున్న దేవదూతల ముందు నీకు ఆజ్ఞాపిస్తున్నాను.
22 తొందరపడి ఎప్పుడూ ఏ పురుషుని మీదా చేతులు ఉంచకు;*+ ఇతరుల పాపాల్లో పాలుపంచుకోకు; నిన్ను నువ్వు పవిత్రంగా ఉంచుకో.
23 ఇకమీదట నీళ్లు తాగకు,* బదులుగా నీ కడుపు కోసం, తరచూ నీకు వచ్చే జబ్బు కోసం కొంచెం ద్రాక్షారసం తాగు.
24 కొందరి పాపాలు అందరికీ తెలుస్తాయి, అవి నేరుగా తీర్పుకు నడిపిస్తాయి. కానీ ఇంకొందరి పాపాలు తర్వాత బయటపడతాయి.+ 25 మంచిపనుల విషయంలో కూడా అంతే. కొన్ని అందరికీ తెలుస్తాయి,+ తెలియనివాటిని దాచివుంచడం కుదరదు.+