నిర్గమకాండం
2 దాదాపు ఆ సమయంలోనే, లేవి వంశస్థుడైన ఒకతను లేవి గోత్రానికి చెందిన ఒకామెను పెళ్లి చేసుకున్నాడు.+ 2 ఆమె గర్భవతి అయ్యి ఒక కుమారుణ్ణి కన్నది. ఆ బిడ్డ చాలా అందంగా ఉండడం చూసి, ఆమె అతన్ని మూడు నెలలపాటు దాచివుంచింది.+ 3 తర్వాత ఇక ఆ బిడ్డను దాచివుంచడం వీలుకాక,+ ఒక జమ్ము పెట్టె* తీసుకొని దానికి తారు, కీలు పూసి బిడ్డను అందులో పెట్టింది; తర్వాత ఆ పెట్టెను నైలు నది ఒడ్డున ఉన్న జమ్ముగడ్డి మధ్యలో ఉంచింది. 4 ఆ పిల్లవాడి అక్క,+ అతనికి ఏం జరుగుతుందో చూద్దామని కాస్త దూరంలో నిలబడింది.
5 కాసేపటికి ఫరో కూతురు నైలు నదిలో స్నానం చేయడానికి వచ్చింది, ఆమె చెలికత్తెలు నైలు నది ఒడ్డున నడుస్తున్నారు. అప్పుడు ఆమెకు జమ్ముగడ్డి మధ్యలో ఒక పెట్టె కనిపించింది. వెంటనే ఆమె తన దాసురాలిని పంపి ఆ పెట్టెను తెప్పించింది.+ 6 ఆమె ఆ పెట్టెను తెరిచి ఆ బిడ్డను చూసింది, వాడు ఏడుస్తున్నాడు. అప్పుడు ఆమెకు ఆ బిడ్డ మీద కనికరం కలిగింది. ఆమె, “ఇతను హెబ్రీయుల పిల్లల్లో ఒకడు” అంది. 7 తర్వాత, ఆ పిల్లవాడి అక్క ఫరో కూతురును ఇలా అడిగింది: “నీ కోసం ఆ పిల్లవాడికి పాలిచ్చి పెంచడానికి నేను వెళ్లి ఒక హెబ్రీ స్త్రీని తీసుకురానా?” 8 అప్పుడు ఫరో కూతురు, “వెళ్లు!” అంది. వెంటనే ఆ అమ్మాయి వెళ్లి, ఆ పిల్లవాడి తల్లిని+ తీసుకొచ్చింది. 9 ఫరో కూతురు ఆ స్త్రీతో, “ఈ బిడ్డను నీతోపాటు తీసుకెళ్లి నా కోసం వాడికి పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తాను” అంది. కాబట్టి ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకెళ్లి, పాలిచ్చి పెంచింది. 10 ఆ పిల్లవాడు కాస్త పెద్దయ్యాక, ఆ స్త్రీ అతన్ని ఫరో కూతురు దగ్గరికి తీసుకొచ్చింది, అతను ఆమె కుమారుడు అయ్యాడు.+ ఆమె అతనికి మోషే* అని పేరు పెట్టింది. “ఎందుకంటే ఇతన్ని నేను నీళ్లలో నుండి బయటికి తీశాను”+ అని ఆమె అంది.
11 మోషే పెద్దవాడైన తర్వాత* ఒకరోజు అతను తన సహోదరులైన హెబ్రీయులు మోస్తున్న భారాల్ని చూడడానికి బయటికి వెళ్లాడు.+ అప్పుడొక ఐగుప్తీయుడు ఒక హెబ్రీయుణ్ణి కొడుతుండడం అతను చూశాడు. 12 కాబట్టి అతను అటూఇటూ చూసి, ఎవరూ లేకపోవడంతో ఆ ఐగుప్తీయుణ్ణి చంపి ఇసుకలో కప్పిపెట్టేశాడు.+
13 అయితే తర్వాతి రోజు అతను మళ్లీ బయటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇద్దరు హెబ్రీయులు పోట్లాడుకుంటున్నారు. అప్పుడతను తప్పు చేసిన వ్యక్తిని, “నీ సహోదరుణ్ణి ఎందుకు కొడుతున్నావు?” అని అడిగాడు.+ 14 దానికి ఆ వ్యక్తి, “నిన్ను మా మీద అధికారిగా, న్యాయమూర్తిగా ఎవరు నియమించారు? ఆ ఐగుప్తీయుణ్ణి చంపినట్టే నన్ను కూడా చంపుదామని అనుకుంటున్నావా?” అన్నాడు.+ దాంతో మోషేకు భయమేసి, “సందేహం లేదు, ఈ విషయం అందరికీ తెలిసిపోయింది!” అనుకున్నాడు.
15 తర్వాత ఫరోకు ఆ విషయం గురించి తెలిసింది, దాంతో అతను మోషేను చంపడానికి ప్రయత్నించాడు. అయితే మోషే ఫరో దగ్గర నుండి పారిపోయి, మిద్యాను దేశంలో+ నివసించడానికి వెళ్లాడు; అక్కడికి వెళ్లాక, ఒక బావి పక్కన కూర్చున్నాడు. 16 మిద్యానులో ఉన్న ఒక పూజారికి+ ఏడుగురు కూతుళ్లు ఉన్నారు. వాళ్లు నీళ్లు చేది, తొట్లను నింపి, తమ తండ్రి మందకు నీళ్లు పెట్టడానికి అక్కడికి వచ్చారు. 17 అయితే ఎప్పటిలాగే గొర్రెల కాపరులు వచ్చి వాళ్లను అక్కడి నుండి వెళ్లగొట్టారు. దాంతో మోషే లేచి, ఆ స్త్రీలకు సహాయం చేసి,* వాళ్ల మందకు నీళ్లు పెట్టాడు. 18 వాళ్లు ఇంట్లో ఉన్న తమ తండ్రి రగూయేలు*+ దగ్గరికి వచ్చినప్పుడు, అతను ఆశ్చర్యంతో “ఈ రోజు ఇంత త్వరగా ఎలా వచ్చారు?” అని అడిగాడు. 19 దానికి వాళ్లు, “ఒక ఐగుప్తీయుడు+ గొర్రెల కాపరుల నుండి మమ్మల్ని కాపాడాడు. అంతేకాదు, అతను మా కోసం నీళ్లు చేది, మందకు నీళ్లు పెట్టాడు” అని చెప్పారు. 20 అప్పుడతను తన కూతుళ్లతో ఇలా అన్నాడు: “ఇంతకీ అతను ఎక్కడున్నాడు? ఎందుకు అతన్ని అక్కడే వదిలేసి వచ్చారు? అతన్ని పిలవండి, అతను కూడా మనతో కలిసి భోంచేస్తాడు.” 21 తర్వాత మోషే అతని దగ్గర ఉండడానికి ఒప్పుకున్నాడు, అతను తన కూతురు సిప్పోరాను+ మోషేకు ఇచ్చి పెళ్లిచేశాడు. 22 తర్వాత ఆమె ఒక కుమారుణ్ణి కన్నది. అప్పుడు మోషే, “నేను వేరే దేశంలో పరదేశిని అయ్యాను”+ అంటూ ఆ పిల్లవాడికి గెర్షోము*+ అని పేరు పెట్టాడు.
23 చాలాకాలం* తర్వాత, ఆ ఐగుప్తు రాజు చనిపోయాడు.+ అయితే ఇశ్రాయేలీయులు ఇంకా బానిసలుగానే ఉన్నారు. వాళ్లు మూల్గుతూ, ఆర్తనాదాలు పెడుతూ ఉన్నారు. బానిసత్వం కారణంగా సహాయం కోసం వాళ్లు పెడుతున్న మొర సత్యదేవుని దగ్గరికి చేరుతూ ఉంది.+ 24 దేవుడు వాళ్ల మూల్గుల్ని విని,+ తాను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ఒప్పందాన్ని* గుర్తుచేసుకున్నాడు.+ 25 దేవుడు ఇశ్రాయేలీయుల్ని చూశాడు; వాళ్ల మీద దృష్టి పెట్టాడు.