లూకా సువార్త
19 తర్వాత ఆయన యెరికోలో ప్రవేశించి, దాని గుండా ప్రయాణిస్తున్నాడు. 2 అక్కడ జక్కయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను పన్ను వసూలుచేసే ముఖ్య అధికారి, ధనవంతుడు. 3 అతను యేసు ఎవరో చూడాలనుకున్నాడు. కానీ అతను పొట్టిగా ఉండడం వల్ల, యేసు చుట్టూ ప్రజలు ఉండడం వల్ల చూడలేకపోయాడు. 4 అయితే కాసేపట్లో యేసు అటువైపు నుండి వెళ్లబోతున్నాడని తెలిసి, అతను యేసును చూడడానికి ముందుకు పరుగెత్తి ఒక మేడి చెట్టు ఎక్కాడు. 5 యేసు అక్కడికి వచ్చినప్పుడు పైకి చూసి, “జక్కయ్యా, త్వరగా కిందికి దిగు. ఇవాళ నేను నీ ఇంట్లో ఉండాలి” అని అతనితో అన్నాడు. 6 అతను వెంటనే కిందికి దిగి, యేసును సంతోషంగా తన ఇంట్లోకి ఆహ్వానించాడు. 7 అది చూసినప్పుడు అందరూ, “ఈయన ఒక పాపి ఇంట్లో ఉండడానికి వెళ్లాడేంటి?” అని గొణుక్కున్నారు.+ 8 కానీ జక్కయ్య నిలబడి ప్రభువుతో ఇలా అన్నాడు: “ప్రభువా, ఇదిగో! నాకున్న వాటిలో సగం పేదవాళ్లకు ఇస్తాను. అంతేకాదు, ఎవరి దగ్గరైనా ఏమైనా అన్యాయంగా లాక్కొని ఉంటే, దానికి నాలుగు రెట్లు తిరిగిస్తాను.”+ 9 అప్పుడు యేసు అతనితో ఇలా అన్నాడు: “ఈ రోజు ఈ ఇంటికి రక్షణ వచ్చింది, ఎందుకంటే ఇతను కూడా అబ్రాహాము కుమారుడే. 10 తప్పిపోయిన దాన్ని వెతకడానికి, దాన్ని రక్షించడానికే మానవ కుమారుడు వచ్చాడు.”+
11 వాళ్లు ఈ మాటలు వింటుండగా యేసు వాళ్లకు ఇంకో ఉదాహరణ* చెప్పాడు. ఎందుకంటే, ఆయన యెరూషలేముకు దగ్గర్లో ఉన్నాడు; పైగా శిష్యులేమో దేవుని రాజ్యం వెంటనే కనిపిస్తుందని అనుకుంటున్నారు.+ 12 కాబట్టి ఆయన ఇలా చెప్పాడు: “గొప్ప ఇంట్లో పుట్టిన ఒకతను రాజ్యాధికారం సంపాదించుకుని తిరిగి వద్దామని దూర దేశానికి ప్రయాణమయ్యాడు.+ 13 వెళ్లేముందు అతను తన పదిమంది దాసుల్ని పిలిచి, వాళ్లకు పది మినాలు* ఇచ్చి, ‘నేను వచ్చే వరకు వీటితో వ్యాపారం చేయండి’ అని చెప్పాడు.+ 14 కానీ అతని పౌరులకు అతనంటే ఇష్టం లేదు. కాబట్టి వాళ్లు అతని వెనక కొంతమంది రాయబారుల్ని పంపించి, ‘ఇతను మాకు రాజవ్వడం మాకు ఇష్టంలేదు’ అని వాళ్లతో చెప్పించారు.
15 “కొంతకాలం తర్వాత అతను రాజ్యాధికారం* సంపాదించుకొని తిరిగొచ్చాడు. అప్పుడు అతను తాను ఎవరికైతే డబ్బులు* ఇచ్చాడో ఆ దాసుల్ని పిలిపించి, వాళ్లు వ్యాపారం చేసి ఎంత సంపాదించారో తెలుసుకోవాలని అనుకున్నాడు.+ 16 కాబట్టి మొదటి దాసుడు ముందుకొచ్చి, ‘ప్రభూ, నువ్విచ్చిన మినాతో నేను పది మినాలు సంపాదించాను’ అని చెప్పాడు.+ 17 అప్పుడు ఆ యజమాని అతనితో, ‘శభాష్, మంచి దాసుడా! నువ్వు చాలా చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి పది నగరాల మీద నీకు అధికారం ఇస్తున్నాను’ అన్నాడు.+ 18 అప్పుడు రెండో దాసుడు వచ్చి, ‘ప్రభూ, నీ మినాతో నేను ఐదు మినాలు సంపాదించాను’ అన్నాడు.+ 19 యజమాని అతనితో, ‘నీకు కూడా ఐదు నగరాల మీద అధికారం ఇస్తున్నాను’ అని చెప్పాడు. 20 అయితే ఇంకో దాసుడు వచ్చి ఇలా అన్నాడు: ‘ప్రభూ, ఇదిగో నీ మినా. దీన్ని నేను ఒక వస్త్రంలో చుట్టి దాచిపెట్టాను. 21 నువ్వంటే నాకు భయం. ఎందుకంటే నువ్వు కఠినుడివి. నువ్వు జమ చేయనిదాన్ని తీసుకుంటావు, విత్తనిదాన్ని కోస్తావు.’+ 22 అప్పుడు యజమాని అతనితో ఇలా అన్నాడు: ‘చెడ్డ దాసుడా, నీ మాటల్ని బట్టే నేను నీకు తీర్పుతీరుస్తాను. నేను కఠినుడినని, జమ చేయనిదాన్ని తీసుకుంటానని, విత్తనిదాన్ని కోస్తానని నీకు తెలుసు కదా?+ 23 అలాంటప్పుడు నువ్వు నా డబ్బును* షావుకారు దగ్గర ఎందుకు జమ చేయలేదు? అలా చేసివుంటే, నేను వచ్చినప్పుడు వడ్డీతో సహా దాన్ని తీసుకునేవాడిని కదా?’
24 “తర్వాత ఆ యజమాని, దగ్గర్లో నిలబడివున్న వాళ్లతో ఇలా అన్నాడు: ‘ఇతని దగ్గర నుండి ఆ మినా తీసుకొని పది మినాలు ఉన్న అతనికి ఇవ్వండి.’+ 25 అయితే వాళ్లు యజమానితో, ‘ప్రభూ, అతని దగ్గర పది మినాలు ఉన్నాయి కదా!’ అన్నారు. 26 దానికి యజమాని ఇలా అన్నాడు: ‘ఎవరి దగ్గరైతే ఉందో, వాళ్లకు ఇంకా ఎక్కువ ఇవ్వబడుతుంది; కానీ ఎవరి దగ్గరైతే లేదో, వాళ్ల దగ్గర ఉన్నది కూడా తీసేయబడుతుంది+ అని నేను మీతో చెప్తున్నాను. 27 అలాగే, నేను రాజుగా ఉండడం ఇష్టంలేని నా శత్రువుల్ని ఇక్కడికి తీసుకొచ్చి, నా ముందు చంపేయండి.’ ”
28 ఈ మాటలు చెప్పాక, ఆయన యెరూషలేము వైపుకు ప్రయాణం కొనసాగించాడు. 29 ఆయన ఒలీవల కొండ దగ్గరున్న బేత్పగే, బేతనియ ప్రాంతాల దగ్గరికి చేరుకున్నప్పుడు,+ ఇద్దరు శిష్యుల్ని పంపిస్తూ+ 30 ఇలా చెప్పాడు: “కనిపించే ఆ గ్రామానికి వెళ్లండి. మీరు అక్కడికి వెళ్లగానే, కట్టేసివున్న ఒక చిన్న గాడిద మీకు కనిపిస్తుంది. ఇప్పటివరకు దానిమీద ఎవరూ కూర్చోలేదు. దాన్ని విప్పి ఇక్కడికి తీసుకురండి. 31 ఎవరైనా, ‘మీరు దాన్ని ఎందుకు విప్పుతున్నారు?’ అని అడిగితే, ‘ఇది ప్రభువుకు కావాలి’ అని చెప్పండి.” 32 యేసు పంపించినవాళ్లు వెళ్లి, ఆయన చెప్పినట్టే అక్కడ చిన్న గాడిద కట్టేసి ఉండడం చూశారు.+ 33 కానీ శిష్యులు ఆ చిన్న గాడిదను విప్పుతున్నప్పుడు దాని యజమానులు, “మీరు ఎందుకు గాడిదను విప్పుతున్నారు?” అని అడిగారు. 34 శిష్యులు, “ఇది ప్రభువుకు కావాలి” అని చెప్పారు. 35 వాళ్లు దాన్ని యేసు దగ్గరికి తోలుకొచ్చి, తమ పైవస్త్రాలు దానిమీద వేసి, యేసును దానిమీద కూర్చోబెట్టారు.+
36 ఆయన అలా వెళ్తుండగా ప్రజలు దారి పొడవునా తమ పైవస్త్రాలు పరుస్తూ ఉన్నారు.+ 37 ఆయన ఒలీవల కొండ నుండి కిందికి వెళ్లే దారి దగ్గరికి రాగానే, శిష్యుల గుంపంతా తాము చూసిన శక్తివంతమైన పనుల్ని బట్టి సంతోషిస్తూ దేవుణ్ణి బిగ్గరగా స్తుతించడం మొదలుపెట్టారు. 38 వాళ్లు, “యెహోవా* పేరున రాజుగా వస్తున్న ఈయన దీవించబడాలి! పరలోకంలో శాంతి కలగాలి! అత్యున్నత స్థలాల్లో మహిమ కలగాలి!” అని స్తుతించారు.+ 39 అయితే అక్కడున్న పరిసయ్యులు కొంతమంది, “బోధకుడా, నీ శిష్యుల్ని గద్దించు” అని యేసుకు చెప్పారు.+ 40 కానీ యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను మీతో చెప్తున్నాను, వీళ్లు నిశ్శబ్దంగా ఉంటే ఈ రాళ్లు కేకలు వేస్తాయి.”
41 ఆయన యెరూషలేము దగ్గరికి వచ్చినప్పుడు, ఆ నగరాన్ని చూసి, దాని గురించి ఏడుస్తూ+ 42 ఇలా అన్నాడు: “నువ్వే గనుక నీకు శాంతిని తెచ్చే విషయాల్ని అర్థం చేసుకొని ఉంటే ఎంత బావుండేది! కానీ ఇప్పుడవి నీ కళ్లకు కనబడకుండా దాచబడ్డాయి.+ 43 ఎందుకంటే, నీ శత్రువులు పదునైన కర్రలతో నీ చుట్టూ ముట్టడిగోడ కట్టి, అన్నివైపుల నిన్ను చుట్టుముట్టి, నిన్ను ఆక్రమించుకునే* రోజులు రాబోతున్నాయి.+ 44 వాళ్లు నిన్నూ నీ పిల్లల్నీ నేలకేసి కొడతారు;+ నీలో రాయి మీద రాయి అనేదే లేకుండా చేస్తారు.+ ఎందుకంటే, నిన్ను తనిఖీ చేసే సమయాన్ని నువ్వు గుర్తించలేదు.”
45 తర్వాత ఆయన ఆలయంలోకి ప్రవేశించి, అమ్మేవాళ్లను బయటికి వెళ్లగొడుతూ+ 46 ఇలా అన్నాడు: “ ‘నా మందిరం ప్రార్థన మందిరంగా ఉంటుంది’ అని రాయబడి ఉంది.+ కానీ మీరు దాన్ని దోపిడీదొంగల గుహగా మార్చేశారు.”+
47 ఆయన రోజూ ఆలయంలో బోధిస్తూ ఉన్నాడు. అయితే ముఖ్య యాజకులు, శాస్త్రులు, ప్రముఖులు ఆయన్ని చంపాలని చూస్తూ ఉన్నారు.+ 48 కానీ ఎలా చంపాలో వాళ్లకు అర్థంకాలేదు. ఎందుకంటే ప్రజలందరూ ఆయన మాటలు ఎంతో శ్రద్ధగా వింటూ ఉండేవాళ్లు.+