నిర్గమకాండం
1 యాకోబు ఐగుప్తుకు* వచ్చినప్పుడు, అతని కుమారులు కూడా తమ కుటుంబాల్ని తీసుకొని అతనితోపాటు వచ్చారు. ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఇవి:+ 2 రూబేను, షిమ్యోను, లేవి, యూదా;+ 3 ఇశ్శాఖారు, జెబూలూను, బెన్యామీను; 4 దాను, నఫ్తాలి; గాదు, ఆషేరు.+ 5 యాకోబుకు పుట్టినవాళ్లు మొత్తం 70 మంది, అయితే యోసేపు అప్పటికే ఐగుప్తులో ఉన్నాడు.+ 6 కొంతకాలానికి యోసేపు, అతని సహోదరులందరూ, అలాగే ఆ తరం వాళ్లందరూ చనిపోయారు.+ 7 ఇశ్రాయేలీయులు* పిల్లల్ని కని చాలామంది అయ్యారు. వాళ్ల సంఖ్య అసాధారణ రీతిలో పెరుగుతూ పోయింది, వాళ్లు చాలా బలంగా తయారౌతూ వచ్చారు. దాంతో ఆ ప్రాంతమంతా వాళ్లతో నిండిపోయింది.+
8 కొంతకాలానికి, యోసేపు గురించి తెలియని ఒక కొత్త రాజు ఐగుప్తును పరిపాలించడం మొదలుపెట్టాడు. 9 అతను తన ప్రజలతో ఇలా అన్నాడు: “ఇదిగో! ఇశ్రాయేలు ప్రజలు మనకన్నా ఎక్కువమంది అయ్యారు, మనకన్నా బలంగా తయారయ్యారు.+ 10 మనం వాళ్ల విషయంలో తెలివిగా* ప్రవర్తించాలి. లేకపోతే వాళ్ల సంఖ్య ఇలాగే పెరుగుతూ పోతుంది. ఒకవేళ యుద్ధం వస్తే, వాళ్లు మన శత్రువులతో చెయ్యి కలిపి మనతో పోరాడి, ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతారు.”
11 కాబట్టి వాళ్లు ఇశ్రాయేలీయులతో వెట్టిచాకిరి చేయించడానికి, వాళ్లను అణచివేసి వాళ్లతో కష్టమైన పనులు చేయించడానికి+ వాళ్లమీద ప్రధానుల్ని నియమించారు; ఇశ్రాయేలీయుల్ని ఉపయోగించుకొని ఫరో కోసం ధాన్యాన్ని, ఇతర వస్తువుల్ని నిల్వచేయడానికి పీతోము, రామెసేసు+ అనే నగరాల్ని కట్టించారు. 12 కానీ అలా అణచివేసే కొద్దీ, ఇశ్రాయేలీయుల సంఖ్య పెరుగుతూ పోయింది, వాళ్లు ఇంకా ఎక్కువగా విస్తరిస్తూ వచ్చారు. దాంతో ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులంటే భయపడిపోయారు, వాళ్లను అసహ్యించుకున్నారు.+ 13 కాబట్టి ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల్ని బానిసలుగా చేసుకొని వాళ్లతో వెట్టిచాకిరి చేయించారు.+ 14 వాళ్లతో వెట్టిచాకిరి చేయిస్తూ వాళ్ల జీవితాల్ని దుర్భరం చేశారు; వాళ్లతో బంకమట్టి పని, ఇటుకల పని, అన్నిరకాల పొలం పనులు చేయించారు. వాళ్లతో కఠినంగా వ్యవహరిస్తూ, బానిసలతో చేయించే అన్నిరకాల కష్టమైన పనుల్ని వాళ్లతో చేయించారు.+
15 తర్వాత ఐగుప్తు రాజు షిఫ్రా, పూయా అనే హెబ్రీ మంత్రసానులతో* మాట్లాడుతూ 16 ఇలా అన్నాడు: “మీరు హెబ్రీ స్త్రీలకు పురుడు పోసే సమయంలో,+ వాళ్లు కాన్పుపీట మీద ఉన్నప్పుడు మీరు ఇలా చేయాలి: పుట్టింది మగపిల్లవాడైతే అతన్ని చంపేయాలి, ఆడపిల్ల అయితే బ్రతకనివ్వాలి.” 17 అయితే, ఆ మంత్రసానులు సత్యదేవునికి భయపడేవాళ్లు కాబట్టి ఐగుప్తు రాజు తమకు చెప్పినట్టు చేయకుండా మగపిల్లల్ని బ్రతకనిచ్చారు.+ 18 తర్వాత ఐగుప్తు రాజు ఆ మంత్రసానుల్ని పిలిపించి, “మీరు మగపిల్లల్ని ఎందుకు బ్రతకనిచ్చారు?” అని అడిగాడు. 19 అప్పుడు వాళ్లు ఫరోతో ఇలా అన్నారు: “హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల లాంటివాళ్లు కాదు; వాళ్లు చాలా చురుగ్గా ఉంటారు, మంత్రసాని వెళ్లేలోగా బిడ్డను కనేస్తారు.”
20 అందుకే దేవుడు ఆ మంత్రసానుల్ని దీవించాడు. ఇశ్రాయేలీయుల సంఖ్య పెరుగుతూ పోయింది, వాళ్లు చాలా బలంగా తయారౌతూ ఉన్నారు. 21 ఆ మంత్రసానులు దేవునికి భయపడ్డారు కాబట్టి ఆ తర్వాత దేవుడు వాళ్లకు కుటుంబాల్ని ఇచ్చి దీవించాడు. 22 చివరికి ఫరో తన ప్రజలందరికీ ఇలా ఆజ్ఞాపించాడు: “హెబ్రీయులకు పుట్టే ప్రతీ మగపిల్లవాణ్ణి మీరు నైలు నదిలో పారేయాలి, ఆడపిల్లల్ని మాత్రం బ్రతకనివ్వాలి.”+