మొదటి తిమోతి
6 దాసులుగా ఉన్నవాళ్లు ఎప్పుడూ తమ యజమానుల్ని పూర్తి గౌరవానికి అర్హులుగా ఎంచాలి.+ అప్పుడు ప్రజలు దేవుని పేరు గురించి, ఆయన బోధ గురించి చెడుగా మాట్లాడుకోకుండా ఉంటారు.+ 2 అలాగే, విశ్వాసులైన యజమానులు ఉన్న దాసులు తమ యజమానులు సహోదరులే కదా అని వాళ్లతో గౌరవం లేకుండా ప్రవర్తించకూడదు. బదులుగా, తమ మంచి సేవ నుండి ప్రయోజనం పొందేది తోటి విశ్వాసులు, ప్రియ సహోదరులు కాబట్టి వాళ్లు ఇంకా చక్కగా సేవచేయాలి.
ఈ విషయాల్ని బోధిస్తూ, ఈ ఆజ్ఞల్ని తెలియజేస్తూ ఉండు. 3 ఎవరైనా మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి వచ్చిన మంచి* బోధతో,+ దైవభక్తికి అనుగుణంగా ఉన్న బోధతో+ ఏకీభవించకుండా తప్పుడు సిద్ధాంతాన్ని బోధిస్తే, 4 అతను గర్వంతో ఉప్పొంగిపోతున్నట్టు; అతనికి ఏమీ అర్థంకాదు.+ అతనికి పదాల గురించి వాదించడం, చర్చించడమే లోకం.*+ వాటివల్ల ఈర్ష్య, గొడవలు, లేనిపోనివి కల్పించి చెప్పడాలు,* హానికరమైన సందేహాలు తలెత్తుతాయి, 5 చిన్నచిన్న విషయాల గురించి వాదోపవాదాలు జరుగుతాయి. తమ మనసు కలుషితమైపోయి,+ సత్యాన్ని ఇక అర్థం చేసుకునే స్థితిలో లేని మనుషులు ఆ వాదోపవాదాల్ని ఉసిగొల్పుతారు. వాళ్లు దైవభక్తిని స్వలాభం కోసం ఉపయోగించుకుంటారు.+ 6 నిజమే, ఉన్నవాటితో తృప్తిపడుతూ దైవభక్తితో జీవిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. 7 ఎందుకంటే, మనం ఈ లోకంలోకి ఏమీ తీసుకురాలేదు, ఈ లోకం నుండి ఏమీ తీసుకుపోలేం.+ 8 కాబట్టి మనకు ఆహారం, బట్టలు* ఉంటే చాలు, వాటితో తృప్తిపడదాం.+
9 అయితే ధనవంతులు అవ్వాలని నిశ్చయించుకున్నవాళ్లు ప్రలోభంలో, ఉరిలో,+ ఎన్నో హానికరమైన వెర్రి కోరికల్లో చిక్కుకుంటారు; అవి మనుషుల్ని కష్టాల్లోకి లాగుతాయి, నాశనం చేస్తాయి.+ 10 ఎందుకంటే డబ్బు మీది మోజు అన్నిరకాల చెడ్డవాటికి* మూలం. కొందరు దాని మోజులో పడి విశ్వాసం నుండి తొలగిపోయారు, ఎన్నో బాధలతో తమను తామే పొడుచుకున్నారు.*+
11 దేవుని సేవకుడా, నువ్వైతే వీటి నుండి పారిపో. బదులుగా నీతిని, దైవభక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, సహనాన్ని, సౌమ్యతను చూపించడానికి+ గట్టిగా కృషిచేయి. 12 విశ్వాసం కోసం మంచి పోరాటం పోరాడు; నువ్వు దేనికోసం పిలవబడ్డావో, దేని గురించి ఎంతోమంది ముందు మంచి సాక్ష్యం ఇచ్చావో ఆ శాశ్వత జీవితం మీద గట్టి పట్టు సాధించు.
13 అన్నిటినీ సజీవంగా ఉంచే దేవుని ఎదుట, అలాగే పొంతి పిలాతు ముందు మంచి సాక్ష్యం ఇచ్చిన క్రీస్తుయేసు+ ఎదుట నీకు ఈ ఆదేశాలు ఇస్తున్నాను: 14 మన ప్రభువైన యేసుక్రీస్తు వెల్లడయ్యే+ వరకు, నేను నీకు ఇచ్చిన ఆజ్ఞను ఏ కళంకం లేకుండా, నిందకు చోటివ్వకుండా పాటిస్తూ ఉండు; 15 సంతోషంగల, శక్తిమంతుడైన ప్రభువు నిర్ణయించబడిన సమయంలో తనను తాను వెల్లడి చేసుకుంటాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు.+ 16 ఆయన మాత్రమే అమర్త్యత గలవాడు,+ సమీపించలేని తేజస్సులో+ నివసిస్తున్నాడు, ఏ మనిషీ ఆయన్ని చూడలేదు, చూడలేడు కూడా.+ ఘనత, శాశ్వత బలం ఆయనకు చెందాలి. ఆమేన్.
17 ఈ వ్యవస్థలో* ధనవంతులుగా ఉన్నవాళ్లు గర్విష్ఠులుగా ఉండకూడదనీ, నశించిపోయే సిరిసంపదల మీద కాకుండా+ మనం ఆస్వాదిస్తున్న వాటన్నిటిని పుష్కలంగా ఇచ్చే దేవుని+ మీద నిరీక్షణ ఉంచాలనీ వాళ్లకు ఉపదేశించు.* 18 మేలు చేస్తూ మంచిపనుల విషయంలో ధనవంతులుగా ఉండమని, ఉదారస్ఫూర్తి చూపించమని, తమకున్నవాటిని ఇతరులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉండమని+ వాళ్లకు చెప్పు. 19 అలాచేస్తే వాళ్లు దేవుని నుండి వచ్చే సంపదల్ని పోగు చేసుకుంటారు, అంటే భవిష్యత్తు కోసం మంచి పునాది వేసుకుంటారు, వాస్తవమైన జీవితం మీద గట్టి పట్టు సాధించగలుగుతారు.+
20 ప్రియమైన తిమోతీ, నీకు అప్పగించబడినదాన్ని కాపాడు,+ పవిత్రమైన దాన్ని తిరస్కరించే వట్టి మాటలకు, సత్యానికి విరుద్ధంగా మాట్లాడేలా చేసే తప్పుడు “జ్ఞానానికి” దూరంగా ఉండు.+ 21 అలాంటి జ్ఞానాన్ని ప్రదర్శించి కొందరు విశ్వాసం నుండి తొలగిపోయారు.
దేవుని అపారదయ నీకు తోడుండాలి.