ప్రసంగి
9 కాబట్టి నేను ఇదంతా పరిశీలించి ఒక ముగింపుకు వచ్చాను: నీతిమంతులు, తెలివిగలవాళ్లు, తమ పనులతో సహా సత్యదేవుని చేతిలో ఉన్నారు.+ తాము పుట్టకముందు ఎంత ప్రేమ, ద్వేషం ఉన్నాయో మనుషులకు తెలీదు. 2 నీతిమంతులకు, దుష్టులకు;+ మంచివాళ్లకు, పవిత్రులకు, అపవిత్రులకు; బలి అర్పించేవాళ్లకు, బలి అర్పించనివాళ్లకు అందరికీ పట్టే గతి ఒక్కటే.+ మంచివాడికి, పాపం చేసేవాడికి; ఆలోచించకుండా ఒట్టేసేవాడికి, ఒట్టేసే విషయంలో జాగ్రత్తగా ఉండేవాడికి పట్టే గతి ఒక్కటే. 3 సూర్యుని కింద జరిగే ఈ విషయం దుఃఖకరమైనది: మనుషులందరికీ పట్టే గతి ఒక్కటే+ కాబట్టి, వాళ్ల హృదయాలు కూడా చెడుతనంతో నిండిపోయాయి. బ్రతికినన్ని రోజులు వాళ్ల హృదయాల్లో వెర్రితనం ఉంటుంది, ఆ తర్వాత వాళ్లు చనిపోతారు!
4 బ్రతికున్నవాళ్లకు ఆశ ఉంటుంది, ఎందుకంటే చనిపోయిన సింహం కన్నా బ్రతికున్న కుక్కే మేలు.+ 5 బ్రతికున్నవాళ్లకు తాము చనిపోతామని తెలుసు,+ కానీ చనిపోయినవాళ్లకు ఏమీ తెలీదు,+ వాళ్లకు ఇక ఏ ప్రతిఫలమూ* ఉండదు; ప్రజలు వాళ్లను ఇక గుర్తుచేసుకోరు.+ 6 అంతేకాదు వాళ్ల ప్రేమ, వాళ్ల ద్వేషం, వాళ్ల అసూయ నశించిపోయాయి; సూర్యుని కింద జరిగేవాటిలో వాళ్లకు ఇక ఏ వంతూ ఉండదు.
7 వెళ్లి సంతోషంగా భోజనం చేయి, ఉల్లాస హృదయంతో ద్రాక్షారసం తాగు,+ ఎందుకంటే సత్యదేవుడు ఇప్పటికే నీ పనుల్ని బట్టి సంతోషించాడు.+ 8 నీ బట్టలు ఎప్పుడూ తెల్లగా ఉండాలి,* నీ తలకు నూనె రాసుకోవడం మర్చిపోకు.+ 9 నీ కొద్దిపాటి* జీవితంలో నువ్వు బ్రతికినన్ని రోజులు నువ్వు ప్రేమించే నీ భార్యతో సంతోషంగా గడుపు;+ సూర్యుని కింద దేవుడు నీకు ఇచ్చిన ఈ వ్యర్థమైన జీవితమంతా అలాగే గడుపు. ఎందుకంటే జీవితంలో అదే నీ వంతు, సూర్యుని కింద నువ్వు పడే ప్రయాసకు అదే నీ బహుమతి. 10 నువ్వు చేయగలిగిన ఏ పనైనా నీ పూర్తి శక్తితో చేయి, ఎందుకంటే నువ్వు వెళ్లే సమాధిలో* పని గానీ, ఉపాయం గానీ, జ్ఞానం గానీ, తెలివి గానీ ఉండదు.+
11 నేను సూర్యుని కింద మరో విషయం చూశాను: వేగం గలవాళ్లు అన్నిసార్లూ పందెంలో గెలవరు, బలవంతులు అన్నిసార్లూ యుద్ధంలో గెలవరు,+ తెలివిగలవాళ్లకు అన్నిసార్లూ ఆహారం దొరకదు, మేధావులకు అన్నివేళలా సంపదలు ఉండవు,+ జ్ఞానం గలవాళ్లు అన్నిసార్లూ విజయం సాధించరు;+ ఎందుకంటే అనుకోని సమయాల్లో, అనుకోని సంఘటనలు వాళ్లందరికీ ఎదురౌతాయి. 12 తన సమయం ఎప్పుడు వస్తుందో మనిషికి తెలీదు.+ చేపలు వలలో చిక్కుకున్నట్టే, పక్షులు ఉచ్చులో చిక్కుకున్నట్టే, హఠాత్తుగా తమ మీదికి విపత్తు వచ్చినప్పుడు మనుషులు దానిలో చిక్కుకుంటారు.
13 సూర్యుని కింద నేను తెలివి గురించిన ఈ విషయాన్ని కూడా గమనించాను, అది నన్ను ముగ్ధుణ్ణి చేసింది: 14 కొద్దిమంది ప్రజలే ఉన్న ఒక చిన్న నగరం ఉంది; శక్తిమంతుడైన ఒక రాజు దానిమీదికి వచ్చి, దాన్ని చుట్టుముట్టి, చుట్టూ పెద్దపెద్ద ముట్టడిదిబ్బలు కట్టాడు. 15 ఆ నగరంలో, పేదవాడే అయినా తెలివిగల ఒకతను ఉన్నాడు; అతను తన తెలివితో ఆ నగరాన్ని కాపాడాడు. అయితే ఆ పేదవాణ్ణి ఎవ్వరూ గుర్తుపెట్టుకోలేదు.+ 16 అప్పుడు నేను ఇలా అనుకున్నాను: ‘బలం కన్నా తెలివి మేలు;+ అయితే పేదవాడి తెలివిని ప్రజలు నీచంగా చూస్తారు, అతని మాటల్ని పట్టించుకోరు.’+
17 తెలివితక్కువవాళ్లను పరిపాలించేవాడి కేకలు వినడం కన్నా తెలివిగలవాడు మెల్లగా మాట్లాడే మాటలు వినడం మేలు.
18 యుద్ధ ఆయుధాల కన్నా తెలివి మేలు, అయితే ఒక్క పాపి ఎంతో మంచిని పాడుచేయగలడు.+