మొదటి థెస్సలొనీకయులు
3 కాబట్టి మేము ఇక తట్టుకోలేకపోయినప్పుడు, ఒంటరిగా ఏథెన్సులో+ ఉండిపోవడమే మంచిదనుకొని, 2 మన సహోదరుడూ క్రీస్తు గురించిన మంచివార్త విషయంలో దేవుని పరిచారకుడూ* అయిన తిమోతిని+ మీ దగ్గరికి పంపించాం. మీ విశ్వాసం విషయంలో మిమ్మల్ని స్థిరపర్చడానికి,* ఓదార్చడానికి అతన్ని పంపించాం. 3 ఈ శ్రమల వల్ల ఎవ్వరూ విశ్వాసంలో బలహీనపడకూడదని* అలా పంపించాం. ఇలాంటి శ్రమలు మనం అనుభవించక తప్పదని+ మీకు కూడా తెలుసు. 4 ఎందుకంటే, మేము మీ దగ్గర ఉన్నప్పుడు, మనకు శ్రమలు వస్తాయని ముందుగానే మీతో చెప్తూ వచ్చాం. ఇప్పుడు జరిగింది అదేనని మీకు తెలుసు.+ 5 అందుకే, నేను ఇక తట్టుకోలేకపోయినప్పుడు, మీ నమ్మకత్వం గురించి తెలుసుకోవడానికి తిమోతిని పంపించాను.+ అపవాది*+ ఏదోకరకంగా మిమ్మల్ని ప్రలోభపెట్టాడేమో, మేము పడ్డ కష్టం వృథా అయిపోయిందేమో అనే ఆందోళనతో అతన్ని పంపించాను.
6 అయితే ఇప్పుడే తిమోతి మీ దగ్గర నుండి వచ్చి,+ మీ నమ్మకత్వం గురించి, మీ ప్రేమ గురించి సంతోషకరమైన వార్త చెప్పాడు. అలాగే, మీరు ఎప్పుడూ మమ్మల్ని ప్రేమతో గుర్తుచేసుకుంటున్నారని, మేము మిమ్మల్ని చూడాలని తపిస్తున్నట్టే మీరూ మమ్మల్ని చూడాలని తపిస్తున్నారని మాకు చెప్పాడు. 7 అందుకే సహోదరులారా, మాకు ఇన్ని కష్టాలూ శ్రమలూ వచ్చినా, మీ వల్ల, మీరు చూపించే నమ్మకత్వం వల్ల మాకు ఊరట కలిగింది.+ 8 ప్రభువు శిష్యులుగా మీరు స్థిరంగా నిలబడితే మాకు కొత్త బలం వస్తుంది.* 9 మీ విషయంలో దేవుని ముందు మాకు కలుగుతున్న గొప్ప సంతోషాన్ని బట్టి మీ గురించి ఆయనకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలం? 10 మిమ్మల్ని చూసేలా, మీ విశ్వాసం బలపడడానికి కావాల్సిన సహాయం చేసేలా అవకాశం కలిగించమని మేము రాత్రింబగళ్లు ఎంతో పట్టుదలతో దేవుణ్ణి వేడుకుంటున్నాం.+
11 మన తండ్రైన దేవుడు, అలాగే మన ప్రభువైన యేసు మేము మీ దగ్గరికి వచ్చేలా మార్గం తెరవాలని కోరుకుంటున్నాం. 12 అంతేకాదు, మీ మీద మాకున్న ప్రేమ ఎక్కువౌతున్నట్టే, మీకు మీ తోటి విశ్వాసుల మీద, అలాగే అందరి మీద ఉన్న ప్రేమ ఇంకా ఎక్కువయ్యేలా+ ప్రభువు మీకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. 13 అలా, మన ప్రభువైన యేసు తన పవిత్రులందరితో పాటు ప్రత్యక్షమైనప్పుడు,+ మన తండ్రైన దేవుని ముందు మీ హృదయాల్ని స్థిరపర్చాలని, మిమ్మల్ని నిందలేనివాళ్లుగా, పవిత్రులుగా చేయాలని+ కోరుకుంటున్నాం.