15 సౌమ్యంగా ఇచ్చే జవాబు కోపాన్ని చల్లారుస్తుంది,+
నొప్పించే మాట కోపాన్ని రేపుతుంది.+
2 తెలివిగలవాళ్ల నాలుక జ్ఞానంతో మంచి చేస్తుంది,+
మూర్ఖుల నోరు తెలివితక్కువతనాన్ని వెళ్లగక్కుతుంది.
3 యెహోవా కళ్లు ప్రతీ చోట ఉన్నాయి,
చెడ్డవాళ్లను, మంచివాళ్లను అవి చూస్తున్నాయి.+
4 ప్రశాంతమైన నాలుక జీవవృక్షం,+
వంకర మాటలు కృంగదీస్తాయి.
5 తెలివితక్కువవాడు తన తండ్రి ఇచ్చే క్రమశిక్షణను హీనంగా చూస్తాడు,+
వివేకం గలవాడు దిద్దుబాటును స్వీకరిస్తాడు.+
6 నీతిమంతుడి ఇంట్లో గొప్ప సంపద ఉంటుంది,
అయితే దుష్టుని ఆదాయం అతనికి సమస్యలు తీసుకొస్తుంది.+
7 తెలివిగలవాళ్ల పెదాలు జ్ఞానాన్ని వ్యాప్తిచేస్తాయి,+
కానీ మూర్ఖుల హృదయం అలా కాదు.+
8 దుష్టులు అర్పించే బలి యెహోవాకు అసహ్యం,+
నిజాయితీపరుల ప్రార్థనలు ఆయనకు సంతోషాన్నిస్తాయి.+
9 దుష్టుల మార్గం యెహోవాకు అసహ్యం,
నీతిని అనుసరించే వాళ్లంటే ఆయనకు చాలా ఇష్టం.+
10 మంచి మార్గాన్ని వదిలేసేవాడికి క్రమశిక్షణ చెడ్డదిగా కనిపిస్తుంది,+
గద్దింపును అసహ్యించుకునేవాడు చనిపోతాడు.+
11 సమాధి, నాశనస్థలం యెహోవాకు పూర్తిగా కనిపిస్తున్నాయి.+
అలాంటిది మనుషుల హృదయాలు ఇంకెంత బాగా కనిపిస్తాయో కదా!+
12 ఎగతాళి చేసేవాళ్లు తమను సరిదిద్దే వాళ్లను ఇష్టపడరు.
వాళ్లు తెలివిగలవాళ్లను సంప్రదించరు.+
13 హృదయం సంతోషంగా ఉంటే ముఖం మీద చిరునవ్వు ఉంటుంది,
హృదయంలో ఉన్న బాధ మనిషిని కృంగదీస్తుంది.+
14 అవగాహనగల హృదయం జ్ఞానాన్ని వెదుకుతుంది,+
మూర్ఖుల నోటికి తెలివితక్కువతనమే ఆహారం.+
15 కష్టాల్లో ఉన్నవాడికి ప్రతీరోజు చెడ్డదే,+
అయితే సంతోష హృదయం గలవాడికి ప్రతీరోజు విందే.+
16 ఆందోళనపడుతూ గొప్ప సంపద కలిగివుండడం కన్నా
యెహోవాకు భయపడుతూ కొంచెం కలిగివుండడం మేలు.+
17 ద్వేషం ఉన్న చోట కొవ్విన ఎద్దు మాంసం తినడం కన్నా+
ప్రేమ ఉన్న చోట కూరగాయల భోజనం తినడం మంచిది.
18 ముక్కోపి గొడవలు రేపుతాడు,+
కోప్పడే విషయంలో నిదానించేవాడు గొడవ సద్దుమణిగేలా చేస్తాడు.+
19 సోమరి దారి ముళ్లకంచె,+
నిజాయితీపరుల మార్గం చదునైన రహదారి.+
20 తెలివిగలవాడు తన తండ్రిని సంతోషపెడతాడు,
మూర్ఖుడు తన తల్లిని హీనంగా చూస్తాడు.+
21 వివేచన లేనివాడికి తెలివితక్కువతనమే సంతోషం,+
వివేచన ఉన్నవాడు సరైన మార్గంలో వెళ్తూ ఉంటాడు.+
22 ఒకరితో ఒకరు సంప్రదించుకోకపోతే ప్రణాళికలు విఫలమౌతాయి,
సలహాదారులు ఎక్కువమంది ఉంటే పనులు జరుగుతాయి.
23 సరైన జవాబు చెప్పేవాడు సంతోషంగా ఉంటాడు,+
సరైన సమయంలో మాట్లాడిన మాట ఎంత మంచిది!+
24 లోతైన అవగాహన గలవాణ్ణి జీవమార్గం పైకి తీసుకెళ్తుంది,
కిందున్న సమాధి నుండి అది అతన్ని కాపాడుతుంది.+
25 గర్విష్ఠుల ఇంటిని యెహోవా కూలగొడతాడు,+
అయితే విధవరాలి సరిహద్దును ఆయన కాపాడతాడు.+
26 దుష్టుల పన్నాగాలు యెహోవాకు అసహ్యం,+
మనోహరమైన మాటలు ఆయనకు ఇష్టం.
27 అక్రమ లాభం సంపాదించేవాడు తన ఇంట్లోవాళ్లకు సమస్యలు తెచ్చిపెడతాడు,+
లంచాన్ని అసహ్యించుకునేవాడు జీవిస్తూ ఉంటాడు.+
28 నీతిమంతుడి హృదయం జవాబిచ్చే ముందు ధ్యానిస్తుంది,+
దుష్టుల నోరు చెడ్డవాటిని కుమ్మరిస్తుంది.
29 దుష్టులకు యెహోవా దూరంగా ఉంటాడు,
నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు.+
30 మెరిసే కళ్లు హృదయానికి సంతోషాన్నిస్తాయి;
మంచి కబురు ఎముకలకు బలాన్నిస్తుంది.+
31 జీవాన్నిచ్చే గద్దింపును పట్టించుకునేవాడు
తెలివిగలవాళ్ల మధ్య నివసిస్తాడు.+
32 క్రమశిక్షణను తిరస్కరించేవాడు తన ప్రాణాన్ని నీచంగా చూస్తున్నాడు,+
గద్దింపును వినేవాడు అవగాహనను సంపాదించుకుంటున్నాడు.+
33 యెహోవా మీదుండే భయం తెలివిని నేర్పిస్తుంది,
ఘనతకు ముందు వినయం ఉంటుంది.+