నిర్గమకాండం
16 ఏలీము నుండి బయల్దేరిన తర్వాత ఇశ్రాయేలీయులంతా చివరికి సీను ఎడారికి చేరుకున్నారు.+ అది ఏలీముకు, సీనాయికి మధ్య ఉంది. వాళ్లు ఐగుప్తు దేశం నుండి బయల్దేరిన దాదాపు ఒక నెలకు, అంటే రెండో నెల 15వ రోజున అక్కడికి చేరుకున్నారు.
2 తర్వాత ఇశ్రాయేలీయులందరూ ఎడారిలో మోషే మీద, అహరోను మీద సణగడం మొదలుపెట్టారు.+ 3 ఇశ్రాయేలీయులు వాళ్లతో ఇలా అంటూ ఉన్నారు: “మేము ఐగుప్తు దేశంలో మాంసం పాత్రల దగ్గర కూర్చొని కడుపు నిండా ఆహారం తింటున్నప్పుడే యెహోవా చేతిలో చనిపోయి ఉంటే బావుండేది.+ ఇప్పుడేమో మీరు ఈ ప్రజలందర్నీ ఆకలితో చంపడానికి మమ్మల్ని ఈ ఎడారిలోకి తీసుకొచ్చారు.”+
4 తర్వాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఇదిగో నేను మీకోసం ఆకాశం నుండి ఆహారం కురిపిస్తున్నాను,+ ప్రతీ ఒక్కరు బయటికి వెళ్లి ప్రతీరోజు తనకు ఎంత కావాలో అంత పోగుచేసుకోవాలి.+ అలా నేను వాళ్లను పరీక్షించి, వాళ్లు నా నియమాన్ని పాటిస్తారో లేదో తెలుసుకుంటాను.+ 5 అయితే ఆరో రోజున+ వాళ్లు మిగతా రోజుల్లో ఏరుకున్న దానికి రెండింతలు ఏరుకొని,+ దాన్ని ముందుగానే సిద్ధం చేసుకోవాలి.”
6 కాబట్టి మోషే, అహరోనులు ఇశ్రాయేలీయులందరితో ఇలా అన్నారు: “మిమ్మల్ని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చింది యెహోవాయే అని సాయంత్రం మీకు ఖచ్చితంగా తెలుస్తుంది.+ 7 ఉదయం మీరు యెహోవా మహిమను చూస్తారు, ఎందుకంటే మీరు యెహోవా మీద సణుగుతున్న సణుగుల్ని ఆయన విన్నాడు. మీరు మా మీద సణగడానికి మేము ఎంతటివాళ్లం?” 8 మోషే ఇంకా ఇలా అన్నాడు: “మీరు తినడానికి యెహోవా సాయంత్రం మీకు మాంసాన్ని, ఉదయం కావాల్సినంత ఆహారాన్ని ఇచ్చినప్పుడు, మీరు తన మీద సణుగుతున్న సణుగుల్ని యెహోవా విన్నాడని మీకు తెలుస్తుంది. మీరు మా మీద సణగడానికి మేము ఎంతటివాళ్లం? మీరు సణుగుతున్నది మా మీద కాదు యెహోవా మీదే.”+
9 తర్వాత మోషే అహరోనుతో ఇలా అన్నాడు: “నువ్వు ఇశ్రాయేలీయులందరితో, ‘యెహోవా ముందుకు రండి, ఎందుకంటే ఆయన మీ సణుగుల్ని విన్నాడు’+ అని చెప్పు.” 10 అహరోను ఇశ్రాయేలీయులందరితో మాట్లాడడం అయిపోగానే వాళ్లు ఎడారి వైపు తిరిగి చూశారు. అప్పుడు ఇదిగో! యెహోవా మహిమ మేఘస్తంభంలో కనిపించింది.+
11 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 12 “నేను ఇశ్రాయేలీయుల సణుగుల్ని విన్నాను.+ నువ్వు వాళ్లతో ఇలా చెప్పు: ‘సంధ్య వెలుగు సమయంలో* మీరు మాంసం తింటారు, ఉదయం మీరు కడుపునిండా ఆహారం తింటారు.+ అప్పుడు మీరు, మీ దేవుడైన యెహోవాను నేనే అని ఖచ్చితంగా తెలుసుకుంటారు.’ ”+
13 కాబట్టి ఆ సాయంత్రం పూరేడు పిట్టలు వచ్చి పాలెం అంతటినీ కప్పేశాయి,+ ఉదయం పాలెం చుట్టూ మంచు పొర ఉంది. 14 మంచు పొర ఆవిరైపోయినప్పుడు, ఎడారిలో నేలమీద సన్నని నూగులాంటి పదార్థం కనిపించింది.+ అది నేలమీద గడ్డకట్టిన పొడి మంచు అంత సన్నగా ఉంది. 15 ఇశ్రాయేలీయులు దాన్ని చూసినప్పుడు, అదేంటో తెలియక ఒకరితో ఒకరు “ఇది ఏంటి?” అనుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు మోషే వాళ్లతో ఇలా అన్నాడు: “ఇది మీరు తినడానికి యెహోవా ఇచ్చిన ఆహారం.+ 16 యెహోవా ఏమని ఆజ్ఞాపించాడంటే, ‘మీలో ప్రతీ ఒక్కరు ఎంత తినగలరనేదాన్ని బట్టి దాన్ని పోగుచేసుకోవాలి. ప్రతీ ఒక్కరు తన డేరాలో ఎంతమంది ఉన్నారనేదాని ప్రకారం, ఒక్కొక్కరికి ఒక ఓమెరు కొలత*+ చొప్పున తీసుకోవాలి.’ ” 17 ఇశ్రాయేలీయులు అలాగే చేయడం మొదలుపెట్టారు; కొందరు ఎక్కువ పోగుచేసుకున్నారు, కొందరు తక్కువ పోగుచేసుకున్నారు. 18 వాళ్లు ఓమెరుతో కొలిచినప్పుడు, ఎక్కువ పోగుచేసుకున్న వ్యక్తికి ఎక్కువ మిగల్లేదు, తక్కువ పోగుచేసుకున్న వ్యక్తికి తక్కువ కాలేదు.+ వాళ్లలో ప్రతీ ఒక్కరు తాము ఎంత తినగలరో అంత పోగుచేసుకున్నారు.
19 తర్వాత మోషే వాళ్లతో ఇలా అన్నాడు: “మరుసటి రోజు ఉదయం వరకు ఎవ్వరూ దానిలో కొంచెం కూడా మిగుల్చుకోకూడదు.”+ 20 కానీ వాళ్లు మోషే మాట వినలేదు. కొందరు దానిలో కొంచెం మరుసటి ఉదయం వరకు మిగిల్చినప్పుడు అది పురుగులు పట్టి కంపుకొట్టింది. అప్పుడు మోషేకు వాళ్లమీద చాలా కోపం వచ్చింది. 21 వాళ్లు ప్రతీరోజు ఉదయం దాన్ని ఏరుకునేవాళ్లు. ప్రతీ ఒక్కరు తాము ఎంత తినగలరో అంత పోగుచేసుకునేవాళ్లు. ఎండ ఎక్కువైనప్పుడు అది కరిగిపోయేది.
22 ఆరో రోజున వాళ్లు రెండింతల ఆహారాన్ని,+ అంటే ఒక్కొక్కరికి రెండు ఓమెరు కొలతలు వచ్చేలా పోగుచేసుకున్నారు. కాబట్టి ప్రజల ప్రధానులంతా వచ్చి, ఆ విషయం గురించి మోషేకు చెప్పారు. 23 అప్పుడు మోషే వాళ్లతో ఇలా అన్నాడు: “యెహోవానే అలా చెప్పాడు. రేపటి రోజు పూర్తి విశ్రాంతి రోజుగా* ఉంటుంది, అది యెహోవాకు పవిత్రమైన విశ్రాంతి రోజు.+ మీరు కాల్చుకోవాల్సింది కాల్చుకోండి, ఉడకబెట్టుకోవాల్సింది ఉడకబెట్టుకోండి;+ మిగిలిందంతా మరుసటి రోజు ఉదయం వరకు ఉంచుకోండి.” 24 కాబట్టి మోషే ఆజ్ఞాపించినట్టే వాళ్లు దాన్ని ఉదయం వరకు ఉంచుకున్నారు, కానీ అది కంపుకొట్టలేదు, దానికి పురుగులు పట్టలేదు. 25 తర్వాత మోషే ఇలా అన్నాడు: “ఈ రోజు దాన్ని తినండి, ఎందుకంటే ఈ రోజు యెహోవాకు విశ్రాంతి రోజు. ఇవాళ అది నేలమీద మీకు కనిపించదు. 26 ఆరు రోజులు మీరు దాన్ని ఏరుకుంటారు; కానీ ఏడో రోజున, అంటే విశ్రాంతి రోజున+ అది ఏమాత్రం దొరకదు.” 27 అయినాసరే ఏడో రోజున కొంతమంది దాన్ని ఏరుకోవడానికి వెళ్లారు, కానీ వాళ్లకు ఏమీ దొరకలేదు.
28 కాబట్టి యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “మీరు ఎంతకాలం నా ఆజ్ఞల్ని, నియమాల్ని పాటించకుండా ఉంటారు?+ 29 యెహోవా మీకు విశ్రాంతి రోజును ఇచ్చాడనే విషయాన్ని గుర్తుంచుకోండి.+ అందుకే ఆయన ఆరో రోజున రెండు రోజులకు సరిపోయే ఆహారం మీకు ఇస్తున్నాడు. ప్రతీ ఒక్కరు తాము ఉన్న చోటే ఉండాలి; ఏడో రోజున ఎవ్వరూ తమ ప్రాంతం దాటి వెళ్లకూడదు.” 30 కాబట్టి ప్రజలు ఏడో రోజును విశ్రాంతి రోజుగా ఆచరించారు.*+
31 ఇశ్రాయేలు ప్రజలు ఆ ఆహారానికి “మన్నా”* అని పేరు పెట్టారు. అది ధనియాల్లా తెల్లగా ఉండేది. దాని రుచి తేనె కలిపిన పిండివంటకంలా ఉండేది.+ 32 తర్వాత మోషే ఇలా అన్నాడు: “యెహోవా ఏమని ఆజ్ఞాపించాడంటే, ‘మీరు దాన్ని ఒక ఓమెరు కొలత అంత తీసుకొని, అది తరతరాలపాటు ఉండేలా దాన్ని పక్కకుపెట్టండి.+ అలా, ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటికి తీసుకొస్తున్నప్పుడు, ఎడారిలో మీరు తినడానికి నేను ఇచ్చిన ఆహారాన్ని వాళ్లు చూస్తారు.’ ” 33 కాబట్టి మోషే అహరోనుతో ఇలా చెప్పాడు: “నువ్వు ఒక పాత్ర తీసుకొని, దానిలో ఒక ఓమెరు కొలత అంత మన్నాను పెట్టి, అది తరతరాలపాటు ఉండేలా దాన్ని యెహోవా ముందు ఉంచు.”+ 34 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే అహరోను చేశాడు. అది భద్రంగా ఉండేలా దాన్ని సాక్ష్యపు మందసం*+ ముందు ఉంచాడు. 35 ఇశ్రాయేలీయులు జనావాస ప్రాంతానికి వచ్చేవరకు,+ కనాను దేశం పొలిమేర్లకు వచ్చేవరకు+ 40 సంవత్సరాల పాటు మన్నా తిన్నారు.+ 36 ఓమెరు అంటే ఈఫా కొలతలో* పదోవంతు.