మీకా
2 “హానికరమైన పన్నాగాలు పన్నేవాళ్లకు శ్రమ,
మంచాల మీద పడుకుని కుట్రలు పన్నేవాళ్లకు శ్రమ!
తెల్లవారగానే వాళ్లు వాటిని అమలు చేస్తారు,
ఎందుకంటే, అలా చేసే శక్తి వాళ్లకు ఉంది.+
2 వాళ్లు భూముల్ని ఆశించి వాటిని ఆక్రమించుకుంటారు;+
ఇళ్లను లాక్కుంటారు;
మోసంతో ఒక మనిషి ఇంటిని,
అతని వారసత్వ ఆస్తిని కాజేస్తారు.+
3 కాబట్టి యెహోవా ఇలా చెప్తున్నాడు:
‘మీ మీదికి ఒక విపత్తు రప్పించాలని అనుకుంటున్నాను,+ దాని నుండి మీరు తప్పించుకోలేరు.+
ఇక మీదట మీరు గర్వంగా నడవరు,+ ఎందుకంటే అది విపత్తు వచ్చే సమయం.+
వాళ్లు ఇలా అంటారు: “మనం పూర్తిగా నాశనమైపోయాం!+
ఆయన మన ప్రజల భూమిని చేతులు మారేలా చేశాడు—దాన్ని మన దగ్గర నుండి తీసేసుకున్నాడు!+
మన పొలాల్ని అవిశ్వాసికి ఇచ్చేశాడు.”
5 కాబట్టి, యెహోవా సమాజంలో భూమిని పంచడానికి,
కొలనూలుతో కొలిచేవాళ్లు మీలో ఎవ్వరూ ఉండరు.
6 “ప్రకటించడం ఆపండి!” అని వాళ్లు చాటిస్తారు.
“వాళ్లు ఈ విషయాలు ప్రకటించకూడదు;
మనకు అవమానం ఎదురవ్వదు!”
7 యాకోబు ఇంటివాళ్లారా,
ప్రజలు, “యెహోవా పవిత్రశక్తికి ఓపిక నశించిందా?
ఇవి ఆయన పనులా?” అని అంటున్నారు.
నిజాయితీగా నడుచుకునేవాళ్లకు నా మాటలు మేలు చేయవా?
8 కానీ ఈ మధ్య నా ప్రజలే శత్రువుల్లా నా మీదికి లేచారు.
యుద్ధం నుండి తిరిగొస్తున్నవాళ్లలా ధైర్యంగా వెళ్తున్నవాళ్ల ఒంటి మీది నుండి
వస్త్రంతోపాటు* విలువైన ఆభరణాన్ని మీరు బాహాటంగా లాక్కుంటున్నారు.
9 మీరు నా ప్రజల్లోని స్త్రీలను ఆహ్లాదకరమైన తమ ఇళ్లల్లో నుండి గెంటేస్తున్నారు;
వాళ్ల పిల్లల నుండి మీరు నా వైభవాన్ని శాశ్వతంగా తీసేస్తున్నారు.
10 లేచి వెళ్లండి, ఇది విశ్రాంతి తీసుకునే చోటు కాదు.
అపవిత్రత వల్ల+ నాశనం, దుఃఖకరమైన నాశనం కలగబోతుంది.+
11 ఒక వ్యక్తి వ్యర్థంగా, మోసపూరితంగా నడుచుకుంటూ,
“నేను మీకు ద్రాక్షారసం గురించి, మద్యం గురించి ప్రకటిస్తాను” అని అబద్ధం చెప్తుంటే,
అతను కేవలం ఈ ప్రజల్ని మెప్పించాలని చూసే ప్రచారకుడు మాత్రమే!+
12 యాకోబూ, మిమ్మల్నందర్నీ నేను తప్పకుండా సమకూరుస్తాను;
ఇశ్రాయేలీయుల్లో మిగిలినవాళ్లను నేను ఖచ్చితంగా పోగుచేస్తాను.+
దొడ్డిలోని గొర్రెల్లా, పచ్చికబయళ్లలో ఉన్న మందలా,+
వాళ్లను ఐక్యం చేస్తాను;
అప్పుడు ఆ స్థలం ప్రజలతో సందడిసందడిగా ఉంటుంది.’+
13 ప్రాకారాన్ని పగలగొట్టే వ్యక్తి వాళ్లకు ముందుగా వెళ్తాడు;
వాళ్లు నగర ద్వారాన్ని పగలగొట్టి దానిలో నుండి బయటికి వెళ్తారు.+
వాళ్ల రాజు వాళ్ల ముందు నడుస్తాడు,
యెహోవాయే వాళ్లను నడిపిస్తాడు.”+