కొలొస్సయులు
3 అయితే మీరు క్రీస్తుతోపాటు బ్రతికించబడివుంటే, పైనున్న వాటినే వెతుకుతూ ఉండండి. క్రీస్తు అక్కడే దేవుని కుడిపక్కన కూర్చొని ఉన్నాడు.+ 2 మీరు పైనున్న వాటిమీదే మనసుపెట్టండి,+ భూమ్మీదున్న వాటిమీద కాదు. 3 ఎందుకంటే మీరు చనిపోయారు, ఇప్పుడు మీ జీవం దేవుని ఇష్టప్రకారం క్రీస్తు దగ్గర దాచబడివుంది. 4 మన జీవమైన క్రీస్తు+ వెల్లడి చేయబడినప్పుడు, మీరు కూడా ఆయనతోపాటు వెల్లడి చేయబడి ఆయన మహిమలో పాలుపంచుకుంటారు.+
5 కాబట్టి, భూమ్మీద ఉన్న మీ శరీర అవయవాల్ని చంపేసుకోండి.+ లైంగిక పాపం,* అపవిత్రత, అదుపులేని లైంగిక వాంఛ,+ చెడు కోరిక, విగ్రహపూజతో సమానమైన అత్యాశ అనేవి వాటిలో నుండే పుడతాయి. 6 వాటివల్ల దేవుని ఆగ్రహం రాబోతుంది. 7 ఒకప్పుడు మీరు కూడా అలాగే ప్రవర్తించేవాళ్లు.+ 8 కానీ ఇప్పుడు మీరు వాటన్నిటినీ వదిలేయాలి. మీరు ఆగ్రహం, కోపం, చెడుతనం, తిట్టడం మానేయాలి,+ మీ నోటి నుండి అసభ్యమైన మాటలు రాకూడదు.+ 9 ఒకరితో ఒకరు అబద్ధమాడకండి.+ మీ పాత వ్యక్తిత్వాన్ని* దాని అలవాట్లతో సహా తీసిపారేయండి,+ 10 అయితే కొత్త వ్యక్తిత్వాన్ని ధరించండి.+ ఆ వ్యక్తిత్వం, దాన్ని సృష్టించిన దేవుణ్ణి ప్రతిబింబించేలా+ సరైన జ్ఞానంతో అంతకంతకూ కొత్తదౌతూ ఉంటుంది. 11 ఇందులో గ్రీకువాళ్లని, యూదులని; సున్నతి చేయించుకున్నవాళ్లని, సున్నతి చేయించుకోనివాళ్లని; విదేశీయులని, సిథియనులని;* దాసులని, స్వతంత్రులని తేడా లేదు. క్రీస్తే అన్నీ, ఆయనే అందరిలో ఉన్నాడు.
12 మీరు దేవుడు ఎంచుకున్న వ్యక్తులు,+ పవిత్రులు, ఆయన ప్రేమించేవాళ్లు కాబట్టి వాత్సల్యంతో కూడిన కనికరాన్ని, దయను, వినయాన్ని,*+ సౌమ్యతను, ఓర్పును+ అలవర్చుకోండి.* 13 ఒకరి విషయంలో ఒకరు సహనం చూపిస్తూ, మనస్ఫూర్తిగా ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండండి.+ ఇతరుల మీద ఫిర్యాదు చేయడానికి కారణం ఉన్నాసరే అలా క్షమించండి.+ యెహోవా* మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమించినట్టే మీరూ క్షమించాలి.+ 14 వీటన్నిటి కన్నా ముఖ్యంగా, ప్రేమను అలవర్చుకోండి.* ఎందుకంటే ప్రేమ ప్రజల్ని పూర్తిస్థాయిలో ఐక్యం చేస్తుంది.+
15 అంతేకాదు, మీరు ఒకే శరీరంగా ఉంటూ శాంతితో మెలగాలని దేవుడు మిమ్మల్ని పిలిచాడు కాబట్టి క్రీస్తు శాంతి మీ హృదయాల్లో ఏలనివ్వండి.*+ అలాగే కృతజ్ఞులై ఉండండి. 16 క్రీస్తు సందేశం మీలో పూర్తిగా పనిచేయనివ్వండి, మీకు పూర్తి తెలివిని అనుగ్రహించనివ్వండి. మీరు కీర్తనలతో,+ దేవుణ్ణి స్తుతించే పాటలతో, కృతజ్ఞత* ఉట్టిపడే ఆరాధనా గీతాలతో ఒకరికొకరు బోధించుకోండి, ఒకరినొకరు ప్రోత్సహించుకోండి,* అలాగే మీ హృదయాల్లో యెహోవాకు* పాటలు పాడండి.+ 17 మీరు ఏమి మాట్లాడినా, ఏమి చేసినా ప్రతీది యేసు ప్రభువు పేరున చేయండి, ఆయన ద్వారా తండ్రైన దేవునికి కృతజ్ఞతలు చెప్తూ అలా చేయండి.+
18 భార్యలారా, మీ భర్తలకు లోబడివుండండి.+ ప్రభువు శిష్యులు అలా చేయడం సరైనది. 19 భర్తలారా, మీ భార్యల్ని ప్రేమిస్తూ ఉండండి,+ వాళ్ల మీద విపరీతమైన కోపం చూపించకండి.*+ 20 పిల్లలారా, ప్రతీ విషయంలో మీ అమ్మానాన్నల మాట వినండి.*+ ఇది ప్రభువుకు ఇష్టం. 21 తండ్రులారా, మీ పిల్లలకు కోపం తెప్పించకండి.*+ అలాచేస్తే వాళ్లు కృంగిపోతారు.* 22 దాసులారా, భూమ్మీదున్న మీ యజమానులకు ప్రతీ విషయంలో విధేయత చూపించండి.+ మనుషుల్ని మెప్పించాలనే ఉద్దేశంతో, వాళ్లు చూస్తున్నప్పుడు మాత్రమే కాదుగానీ, యెహోవా* మీదున్న భయంతో మనస్ఫూర్తిగా విధేయత చూపించండి. 23 మీరు ఏమి చేసినా, మనుషుల కోసం చేస్తున్నట్టు కాకుండా, యెహోవా* కోసం చేస్తున్నట్టు మనస్ఫూర్తిగా, మీ పూర్తి శక్తితో చేయండి.+ 24 ఎందుకంటే, మీరు యెహోవా* నుండే స్వాస్థ్యాన్ని బహుమతిగా పొందుతారని మీకు తెలుసు.+ మీ యజమాని అయిన క్రీస్తుకు దాసులుగా ఉండండి. 25 తప్పుచేసిన వ్యక్తికి తప్పకుండా శిక్ష పడుతుంది,+ దేవునికి పక్షపాతం లేదు.+