లేవీయకాండం
16 యెహోవా దగ్గరికి వెళ్లడంవల్ల అహరోను ఇద్దరు కుమారులు చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడాడు.+ 2 యెహోవా మోషేకు ఇలా చెప్పాడు: “నీ సహోదరుడైన అహరోను చనిపోకుండా ఉండేలా,+ తెర+ లోపల ఉన్న పవిత్ర స్థలంలోకి+ అంటే మందసం* మూత ముందుకు ఎప్పుడుబడితే అప్పుడు రాకూడదని అతనికి చెప్పు. ఎందుకంటే నేను ఆ మందసం మూత మీద+ మేఘంలో+ కనిపిస్తాను.
3 “అహరోను పవిత్ర స్థలంలోకి వస్తున్నప్పుడు పాపపరిహారార్థ బలి కోసం ఒక కోడెదూడను,+ దహనబలి కోసం ఒక పొట్టేలును+ తీసుకురావాలి. 4 అతను పవిత్రమైన నార చొక్కా+ వేసుకోవాలి; తన మర్మాంగాల్ని కప్పుకోవడానికి నార లాగుల్ని*+ తొడుక్కోవాలి; నార దట్టీ+ కట్టుకోవాలి, నారతో చేసిన తలపాగాను+ చుట్టుకోవాలి. అవి పవిత్రమైన వస్త్రాలు.+ అతను నీళ్లతో స్నానం చేసి+ వాటిని వేసుకుంటాడు.
5 “అతను ఇశ్రాయేలీయుల సమాజం+ దగ్గర నుండి పాపపరిహారార్థ బలి కోసం, ఏడాది వయసున్న రెండు మగ మేకల్ని, దహనబలి కోసం ఒక పొట్టేలును తీసుకోవాలి.
6 “తర్వాత అహరోను తనకోసం తెచ్చిన పాపపరిహారార్థ బలి కోడెదూడను తీసుకొని తనకోసం, తన ఇంటివాళ్ల కోసం ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు.+
7 “తర్వాత అతను ఆ రెండు మేకల్ని తీసుకొని ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర యెహోవా ముందు నిలబెడతాడు. 8 అహరోను ఆ రెండు మేకల గురించి చీట్లు* వేస్తాడు. ఒకటి యెహోవా పేరున, ఇంకొకటి అజాజేలు* పేరున. 9 యెహోవా పేరున వేసిన చీటి ఏ మేక మీద పడిందో+ ఆ మేకను తీసుకొచ్చి అహరోను పాపపరిహారార్థ బలిగా అర్పిస్తాడు. 10 కానీ అజాజేలు పేరున వేసిన చీటి ఏ మేక మీద పడిందో ఆ మేకను సజీవంగా తీసుకొచ్చి, దానిమీద ప్రాయశ్చిత్తం చేయడానికి దాన్ని యెహోవా ముందు నిలబెట్టాలి. తర్వాత, దాన్ని అజాజేలు కోసం ఎడారిలోకి పంపించాలి.+
11 “అహరోను తనకోసం తెచ్చిన పాపపరిహారార్థ బలి కోడెదూడను తీసుకొని తనకోసం, తన ఇంటివాళ్ల కోసం ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు; తర్వాత తనకోసం తెచ్చిన ఆ పాపపరిహారార్థ బలి కోడెదూడను వధిస్తాడు.
12 “ఆ తర్వాత అతను యెహోవా ముందున్న బలిపీఠం మీద నుండి ధూపపాత్ర*+ నిండా నిప్పుల్ని,+ రెండు పిడికిళ్ల నిండా పరిమళ ధూపద్రవ్య పొడిని+ తెర లోపలికి తీసుకురావాలి.+ 13 అంతేకాదు అతను యెహోవా ముందు+ ఆ నిప్పుల మీద ధూపద్రవ్య పొడిని వేస్తాడు, ఆ ధూపపు పొగ వల్ల ఏర్పడిన మేఘం సాక్ష్యపు మందసం మూతను కప్పుతుంది. అలా, అతను చనిపోకుండా ఉంటాడు.
14 “అతను ఆ కోడెదూడ రక్తంలో+ కొంత తీసుకొని, ఆ మూత ముందు తూర్పు వైపున తన వేలితో దాన్ని చిమ్ముతాడు. అతను తన వేలితో కొంత రక్తాన్ని ఆ మూత ముందు ఏడుసార్లు చిమ్ముతాడు.+
15 “తర్వాత అతను, ప్రజల కోసం తెచ్చిన పాపపరిహారార్థ బలి మేకను వధించి,+ దాని రక్తాన్ని తెర లోపలికి+ తీసుకొచ్చి, ఆ కోడెదూడ రక్తం+ విషయంలో చేసినట్టే చేస్తాడు; అతను దాన్ని ఆ మూత వైపుగా, మూత ముందు చిమ్ముతాడు.
16 “ఇశ్రాయేలీయుల అపవిత్రమైన పనుల విషయంలో, వాళ్ల అపరాధాల విషయంలో, పాపాల విషయంలో అతను పవిత్ర స్థలానికి ప్రాయశ్చిత్తం చేయాలి. అలాగే, అపవిత్రమైన పనులు చేస్తున్న ఆ ప్రజల మధ్య ఉన్న ప్రత్యక్ష గుడారానికి అతను ప్రాయశ్చిత్తం చేయాలి.
17 “అతను పవిత్ర స్థలంలో ప్రాయశ్చిత్తం చేయడానికి వెళ్లినప్పటి నుండి బయటికి వచ్చే వరకు ప్రత్యక్ష గుడారంలో ఎవ్వరూ ఉండకూడదు. అతను తన కోసం, తన ఇంటివాళ్ల కోసం, ఇశ్రాయేలు సమాజమంతటి కోసం+ ప్రాయశ్చిత్తం చేస్తాడు.
18 “ఆ తర్వాత అతను బయట యెహోవా ముందున్న బలిపీఠం దగ్గరికి వచ్చి దానికి ప్రాయశ్చిత్తం చేస్తాడు. అతను ఆ కోడెదూడ రక్తంలో కొంత, మేక రక్తంలో కొంత తీసుకొని బలిపీఠానికి అన్నివైపులా ఉన్న కొమ్ములకు పూస్తాడు. 19 అంతేకాదు అతను తన వేలితో కొంత రక్తం తీసుకొని బలిపీఠం మీద ఏడుసార్లు చిమ్మి, దాన్ని శుద్ధిచేసి, ఇశ్రాయేలీయులు చేసిన అపవిత్రమైన పనుల నుండి దాన్ని పవిత్రపరుస్తాడు.
20 “పవిత్ర స్థలానికి, ప్రత్యక్ష గుడారానికి, బలిపీఠానికి ప్రాయశ్చిత్తం+ చేసిన తర్వాత అతను బ్రతికున్న మేకను కూడా దగ్గరికి తీసుకొస్తాడు. 21 అహరోను తన రెండు చేతుల్ని బ్రతికున్న ఆ మేక తలమీద పెట్టి ఇశ్రాయేలీయుల తప్పులన్నిటినీ, వాళ్ల అపరాధాలన్నిటినీ, పాపాలన్నిటినీ ఒప్పుకొని, వాటిని దాని తలమీద పెట్టి,+ దాన్ని ఎడారిలోకి పంపిస్తాడు. ఆ పని కోసం నియమించబడిన* వ్యక్తితో దాన్ని ఎడారిలోకి పంపిస్తాడు. 22 ఆ మేక వాళ్ల తప్పులన్నిటినీ ఎడారి ప్రదేశానికి+ మోసుకెళ్తుంది,+ అతను ఆ మేకను ఎడారిలోకి పంపించేస్తాడు.
23 “అహరోను ఆ తర్వాత ప్రత్యక్ష గుడారంలోకి ప్రవేశించి, తాను పవిత్ర స్థలంలోకి వెళ్లేటప్పుడు వేసుకున్న నారవస్త్రాల్ని తీసేసి, వాటిని అక్కడే కింద పెడతాడు. 24 అతను ఒక పవిత్రమైన చోట నీళ్లతో స్నానం చేసి,+ తన వస్త్రాల్ని వేసుకోవాలి; ఆ తర్వాత అతను బయటికి వచ్చి తన కోసం తెచ్చిన దహనబలిని, ప్రజల కోసం తెచ్చిన దహనబలిని+ అర్పించి తనకోసం, ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు.+ 25 అతను పాపపరిహారార్థ బలి కొవ్వును బలిపీఠం మీద పొగ పైకిలేచేలా కాలుస్తాడు.
26 “అజాజేలు మేకను పంపించేసిన వ్యక్తి తన వస్త్రాల్ని ఉతుక్కొని, నీళ్లతో స్నానం చేయాలి. తర్వాత అతను పాలెంలోకి రావచ్చు.
27 “ప్రాయశ్చిత్తం చేయడానికి ఏ జంతువుల రక్తాన్నైతే పవిత్ర స్థలంలోకి తీసుకొచ్చారో ఆ జంతువుల్ని అంటే పాపపరిహారార్థ బలి కోడెదూడను, పాపపరిహారార్థ బలి మేకను పాలెం బయటికి తీసుకెళ్లి, వాటి చర్మాల్ని, మాంసాన్ని, పేడను అగ్నితో కాల్చేయాలి.+ 28 వాటిని కాల్చేసే వ్యక్తి తన వస్త్రాల్ని ఉతుక్కొని, నీళ్లతో స్నానం చేయాలి. తర్వాత అతను పాలెంలోకి రావచ్చు.
29 “ఇది మీకు శాశ్వత శాసనం: ఏడో నెల, పదో రోజున మీరు మీ పాపాల విషయంలో దుఃఖాన్ని వ్యక్తం చేయాలి,* ఆ రోజు మీరు ఏ పనీ చేయకూడదు.+ మీరూ, మీ మధ్య ఉండే పరదేశులూ దీన్ని పాటించాలి. 30 మిమ్మల్ని పవిత్రులని ప్రకటించడానికి ఆ రోజున మీకోసం ప్రాయశ్చిత్తం+ చేయబడుతుంది. మీరు యెహోవా ఎదుట మీ పాపాలన్నిటి నుండి పవిత్రులౌతారు.+ 31 అది మీకు పూర్తి విశ్రాంతి రోజుగా* ఉంటుంది. ఆ రోజున మీరు మీ పాపాల విషయంలో దుఃఖాన్ని వ్యక్తం చేయాలి.+ ఇది శాశ్వత శాసనం.
32 “తన తండ్రి స్థానంలో యాజకునిగా సేవచేయడానికి అభిషేకించబడి, ప్రతిష్ఠించబడిన* యాజకుడు+ ప్రాయశ్చిత్తం చేస్తాడు; అతను పవిత్రమైన నారవస్త్రాల్ని+ వేసుకుంటాడు. 33 అతను అతి పవిత్రమైన స్థలానికి, ప్రత్యక్ష గుడారానికి, బలిపీఠానికి ప్రాయశ్చిత్తం చేస్తాడు; అలాగే అతను యాజకుల కోసం, ఇశ్రాయేలీయులందరి కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు.+ 34 ఇశ్రాయేలీయుల పాపాలన్నిటిని బట్టి సంవత్సరానికి ఒకసారి వాళ్ల కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి+ ఇది మీకు శాశ్వతమైన శాసనం.”+
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే అతను చేశాడు.