మలాకీ
4 “ఎందుకంటే, ఇదిగో! ఆ రోజు కొలిమిలా మండుతూ వస్తోంది.+ అప్పుడు గర్విష్ఠులందరు, చెడుగా నడుచుకునే వాళ్లందరు కొయ్యకాలులా* అవుతారు. రాబోయే ఆ రోజు వాళ్లను తప్పకుండా మింగేస్తుంది” అని సైన్యాలకు అధిపతైన యెహోవా అంటున్నాడు. “అది వాళ్లకు వేరును గానీ, కొమ్మను గానీ మిగల్చదు. 2 కానీ నా పేరును గౌరవించే* మీ మీద, నీతి సూర్యుడు ప్రకాశిస్తాడు. అతని కిరణాలకు* స్వస్థపర్చే గుణం ఉంటుంది. అప్పుడు మీరు కొవ్విన దూడల్లా గంతులు వేస్తారు.”
3 “నేను చర్య తీసుకునే ఆ రోజున దుష్టులు మీ పాదాల కింద ధూళిలా ఉంటారు. కాబట్టి మీరు వాళ్లను మీ కాళ్ల కింద అణగదొక్కుతారు” అని సైన్యాలకు అధిపతైన యెహోవా అంటున్నాడు.
4 “నా సేవకుడైన మోషే ద్వారా నేనిచ్చిన ధర్మశాస్త్రాన్ని, అంటే ఇశ్రాయేలీయులందరు లోబడాలని హోరేబు దగ్గర నేను ఆజ్ఞాపించిన శాసనాల్ని, న్యాయనిర్ణయాల్ని గుర్తుచేసుకోండి.+
5 “ఇదిగో! సంభ్రమాశ్చర్యాలు పుట్టించే యెహోవా మహారోజు రావడానికి ముందు+ నేను మీ దగ్గరికి ఏలీయా ప్రవక్తను పంపిస్తున్నాను.+ 6 నేను వచ్చి భూమిని శిక్షించి, దాన్ని పూర్తిగా నాశనం చేయకుండా ఉండేలా అతను తండ్రుల హృదయాల్ని కుమారుల వైపుకు,+ కుమారుల హృదయాల్ని తండ్రుల వైపుకు తిప్పుతాడు.”