యోహానుకు ఇచ్చిన ప్రకటన
15 అప్పుడు పరలోకంలో అద్భుతమైన ఇంకొక గొప్ప సూచన చూశాను. ఏడుగురు దేవదూతలు ఏడు తెగుళ్లు పట్టుకొని ఉన్నారు. ఇవి చివరి తెగుళ్లు, వీటితో దేవుని కోపం తీరిపోతుంది.
2 తర్వాత, అగ్ని కలిసివున్న గాజు సముద్రం+ లాంటిదాన్ని నేను చూశాను. క్రూరమృగాన్ని, దాని ప్రతిమను,+ దాని పేరుకు సంబంధించిన సంఖ్యను+ జయించినవాళ్లు+ ఆ గాజు సముద్రం దగ్గర నిలబడివున్నారు. వాళ్ల చేతుల్లో దేవుని వీణలు* ఉన్నాయి. 3 వాళ్లు దేవుని దాసుడైన మోషే పాటను,+ గొర్రెపిల్ల పాటను పాడుతూ ఇలా అంటున్నారు:
“యెహోవా* దేవా, సర్వశక్తిమంతుడా,+ నీ పనులు గొప్పవి, అద్భుతమైనవి.+ యుగయుగాలకు రాజా,+ నీ మార్గాలు న్యాయమైనవి, సత్యమైనవి.+ 4 యెహోవా,* నువ్వు మాత్రమే విశ్వసనీయుడివి; నీకు భయపడని వాళ్లెవరు?+ నీ పేరును మహిమపర్చని వాళ్లెవరు? నీతియుక్తమైన నీ తీర్పులు వెల్లడి చేయబడ్డాయి కాబట్టి అన్నిదేశాల ప్రజలు నీ ముందుకు వచ్చి నిన్ను ఆరాధిస్తారు.”+
5 ఆ తర్వాత నేను పరలోకంలో సాక్ష్యపు గుడార పవిత్ర స్థలం+ తెరవబడి ఉండడం చూశాను. 6 ఆ పవిత్ర స్థలంలో నుండి ఏడుగురు దేవదూతలు ఏడు తెగుళ్లను పట్టుకొని వచ్చారు. వాళ్లు స్వచ్ఛమైన, మెరిసే నారవస్త్రాలు వేసుకొని ఉన్నారు, వాళ్ల ఛాతి చుట్టూ బంగారు దట్టీ ఉంది. 7 నాలుగు జీవుల్లో ఒక జీవి ఆ ఏడుగురు దేవదూతలకు ఏడు బంగారు గిన్నెలు ఇచ్చింది. ఆ గిన్నెలు యుగయుగాలు జీవించే దేవుని కోపంతో నిండివున్నాయి.+ 8 దేవుని మహిమవల్ల, ఆయన శక్తివల్ల ఆ పవిత్ర స్థలం పొగతో నిండిపోయింది.+ ఏడుగురు దేవదూతలు పట్టుకొని ఉన్న ఏడు తెగుళ్లు+ పూర్తయ్యేవరకు ఎవ్వరూ పవిత్ర స్థలంలోకి వెళ్లలేకపోయారు.