లేవీయకాండం
1 తర్వాత యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్ష గుడారంలో+ నుండి మాట్లాడుతూ అతనితో ఇలా అన్నాడు: 2 “నువ్వు ఇశ్రాయేలీయులతో* మాట్లాడి వాళ్లకు ఇలా చెప్పు: ‘మీలో ఎవరైనా సాధు జంతువుల్లో నుండి యెహోవాకు అర్పణ తీసుకొస్తుంటే, దాన్ని పశువుల్లో నుండి గానీ, మందలో నుండి గానీ తీసుకురావాలి.+
3 “ ‘ఒకవేళ అతను పశువుల్లో ఒకదాన్ని దహనబలిగా అర్పించాలనుకుంటే, ఏ లోపంలేని మగదాన్ని అర్పించాలి.+ అతను ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర యెహోవా ముందు దాన్ని ఇష్టపూర్వకంగా అర్పించాలి.+ 4 అతను ఆ దహనబలి పశువు తల మీద చెయ్యి పెట్టాలి, అతని కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి అది అతని తరఫున స్వీకరించబడుతుంది.
5 “ ‘తర్వాత ఆ కోడెదూడను యెహోవా ముందు వధించాలి. యాజకులైన+ అహరోను కుమారులు దాని రక్తాన్ని తీసుకొని, ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గరున్న బలిపీఠానికి అన్నివైపులా దాన్ని చిలకరించాలి.+ 6 దహనబలి పశువు చర్మాన్ని ఊడదీసి, దాన్ని ముక్కలుముక్కలు చేయాలి.+ 7 యాజకులైన అహరోను కుమారులు బలిపీఠం మీద మంట పెట్టి,+ దానిమీద కట్టెలు పేర్చాలి. 8 యాజకులైన అహరోను కుమారులు ఆ బలి పశువు ముక్కల్ని, దాని తలను, దాని మూత్రపిండాల మీది కొవ్వును బలిపీఠం మంట మీదున్న కట్టెలపై పేరుస్తారు.+ 9 దాని పేగుల్ని, కాళ్లను* నీళ్లతో కడుగుతారు. యాజకుడు వాటన్నిటినీ తీసుకొని బలిపీఠం మీద పొగ పైకిలేచేలా కాల్చాలి. అది అగ్నితో అర్పించే దహనబలి, యెహోవాకు ఇంపైన* సువాసన.+
10 “ ‘ఒకవేళ అతను మందలో నుండి ఒకదాన్ని అర్పించాలనుకుంటే,+ గొర్రెల్లో నుండి లేదా మేకల్లో నుండి ఏ లోపంలేని మగదాన్ని తీసుకురావాలి.+ 11 దాన్ని బలిపీఠానికి ఉత్తరాన యెహోవా ముందు వధించాలి. యాజకులైన అహరోను కుమారులు దాని రక్తాన్ని బలిపీఠానికి అన్నివైపులా చిలకరించాలి.+ 12 అతను దాన్ని ముక్కలుముక్కలు చేస్తాడు. యాజకుడు వాటిని, దాని తలను, దాని మూత్రపిండాల మీది కొవ్వును తీసుకొని బలిపీఠం మంట మీదున్న కట్టెలపై వాటిని పేరుస్తాడు. 13 అతను దాని పేగుల్ని, కాళ్లను* నీళ్లతో కడుగుతాడు; యాజకుడు వాటన్నిటినీ తీసుకొని బలిపీఠం మీద పొగ పైకిలేచేలా కాలుస్తాడు. అది అగ్నితో అర్పించే దహనబలి, యెహోవాకు ఇంపైన* సువాసన.
14 “ ‘ఒకవేళ అతను పక్షుల్ని యెహోవాకు దహనబలిగా అర్పించాలనుకుంటే, అతను గువ్వల్ని గానీ పావురం పిల్లల్ని గానీ తీసుకొస్తాడు.+ 15 యాజకుడు దాన్ని బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చి, దాని తలను తుంచి, బలిపీఠం మీద పొగ పైకిలేచేలా దాన్ని కాలుస్తాడు. దాని రక్తాన్ని మాత్రం బలిపీఠానికి ఒకవైపున ఒలికించాలి. 16 అతను దాని అన్నాశయాన్ని,* ఈకల్ని తీసేసి వాటిని బలిపీఠం పక్కన తూర్పు వైపున బూడిదను* వేసే చోట పారేయాలి.+ 17 అతను ఆ పక్షిని రెండు భాగాలుగా విడదీయకుండా రెండు రెక్కల మధ్య దాన్ని చీలుస్తాడు. తర్వాత యాజకుడు బలిపీఠం మంట మీదున్న కట్టెలపై పొగ పైకిలేచేలా దాన్ని కాలుస్తాడు. అది అగ్నితో అర్పించే దహనబలి, యెహోవాకు ఇంపైన* సువాసన.