లూకా సువార్త
12 ఆ సమయంలో, వేలమంది ప్రజలు ఒక చోట గుమికూడి ఒకరినొకరు తోసుకుంటున్నప్పుడు ఆయన ముందుగా తన శిష్యులతో ఇలా అన్నాడు: “పరిసయ్యుల పులిసిన పిండి విషయంలో, అంటే వాళ్ల మోసం విషయంలో అప్రమత్తంగా ఉండండి.+ 2 జాగ్రత్తగా దాచివుంచిన ప్రతీది బయటికి వస్తుంది; రహస్యంగా ఉన్న ప్రతీది తెలిసిపోతుంది.+ 3 కాబట్టి, మీరు చీకట్లో చెప్పేవి వెలుగులో వినబడతాయి, మీరు మీ ఇళ్ల లోపల గుసగుసలాడుకునేవి ఇంటి పైకప్పుల మీద నుండి ప్రకటించబడతాయి. 4 నా స్నేహితులారా,+ నేను మీతో చెప్తున్నాను, శరీరాన్ని చంపి ఆ తర్వాత ఏమీ చేయలేనివాళ్లకు భయపడకండి.+ 5 అయితే ఎవరికి భయపడాలో నేను మీకు చెప్తాను: చంపిన తర్వాత గెహెన్నాలో* పడేసే అధికారం ఉన్న దేవునికే భయపడండి.+ అవును, ఆయనకే భయపడమని మీతో చెప్తున్నాను.+ 6 తక్కువ విలువగల రెండు నాణేలకు* ఐదు పిచ్చుకలు వస్తాయి కదా? అయినా వాటిలో ఒక్కదాన్ని కూడా దేవుడు మర్చిపోడు.+ 7 మీ తలమీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా ఆయనకు తెలుసు.+ భయపడకండి, మీరు చాలా పిచ్చుకల కన్నా విలువైనవాళ్లు.+
8 “నేను మీతో చెప్తున్నాను, మనుషుల ముందు నన్ను ఒప్పుకునే+ ప్రతీ ఒక్కర్ని, మానవ కుమారుడు కూడా దేవదూతల ముందు ఒప్పుకుంటాడు.+ 9 అయితే మనుషుల ముందు ఎవరైనా నన్ను తిరస్కరిస్తే, అతను దేవదూతల ముందు తిరస్కరించబడతాడు.+ 10 మానవ కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లకు క్షమాపణ ఉంటుంది; కానీ పవిత్రశక్తిని దూషించేవాళ్లకు క్షమాపణ ఉండదు.+ 11 వాళ్లు మిమ్మల్ని సమాజమందిరాల* ముందుకు, పరిపాలకుల ముందుకు, అధికారుల ముందుకు తీసుకెళ్లినప్పుడు ఏం మాట్లాడాలి? ఎలా జవాబు చెప్పాలి? అని ఆందోళన పడకండి.+ 12 మీరు ఏం మాట్లాడాలో ఆ సమయంలోనే పవిత్రశక్తి మీకు నేర్పిస్తుంది.”+
13 అప్పుడు ఆ గుంపులో ఒకతను ఆయన్ని, “బోధకుడా, మా నాన్న ఆస్తిలో నాకు వాటా ఇవ్వమని నా సహోదరునికి చెప్పు” అన్నాడు. 14 దానికి యేసు అతనితో, “మీ మీద న్యాయమూర్తిగా గానీ మీకు మధ్యవర్తిగా* గానీ నన్ను ఎవరు నియమించారు?” అన్నాడు. 15 తర్వాత ఆయన వాళ్లకు ఇలా చెప్పాడు: “ఏ రకమైన అత్యాశకూ* చోటివ్వకుండా జాగ్రత్తపడండి.+ ఎందుకంటే, ఒక వ్యక్తికి చాలా ఆస్తిపాస్తులు ఉన్నా, అవి అతనికి జీవాన్ని ఇవ్వవు.”+ 16 అప్పుడాయన వాళ్లకు ఈ ఉదాహరణ* చెప్పాడు: “ఒక ధనవంతుడి పొలం బాగా పండింది. 17 కాబట్టి అతను ఇలా ఆలోచించుకున్నాడు: ‘నా ధాన్యాన్ని నిల్వచేయడానికి ఎక్కడా చోటు లేదు, ఇప్పుడు నేనేం చేయాలి?’ 18 తర్వాత అతను ఇలా అనుకున్నాడు:+ ‘నేను నా గోదాముల్ని పడగొట్టి ఇంకా పెద్దవి కట్టిస్తాను, వాటిలో నా ధాన్యం అంతటినీ నా వస్తువులన్నిటినీ నిల్వచేస్తాను. 19 తర్వాత నా ప్రాణంతో ఇలా అంటాను: “నా ప్రాణమా, ఎన్నో సంవత్సరాలకు సరిపోయే మంచి వస్తువులు నీకు ఉన్నాయి. కాబట్టి హాయిగా ఉండు, తిను, తాగు, సంతోషించు.” ’ 20 అయితే దేవుడు అతనితో ఇలా అన్నాడు: ‘తెలివితక్కువవాడా, ఈ రాత్రి నీ ప్రాణం తీసేయబడుతుంది. నువ్వు నిల్వచేసుకున్న వాటిని ఎవరు అనుభవిస్తారు?’+ 21 దేవుని దృష్టిలో ధనవంతుడిగా ఉండడానికి కృషి చేయకుండా, తన కోసమే సంపదలు కూడబెట్టుకునే వాళ్ల పరిస్థితి అలా ఉంటుంది.”+
22 తర్వాత ఆయన తన శిష్యులతో ఇలా చెప్పాడు: “అందుకే నేను మీతో చెప్తున్నాను, ఏం తినాలా అని మీ ప్రాణం గురించి గానీ, ఏం వేసుకోవాలా అని మీ శరీరం గురించి గానీ ఆందోళన పడడం మానేయండి.+ 23 ఆహారం కన్నా ప్రాణం, బట్టల కన్నా శరీరం చాలా విలువైనవి. 24 కాకుల్ని గమనించండి: అవి విత్తవు, కోయవు; వాటికి గోదాములు ఉండవు; అయినా దేవుడు వాటిని పోషిస్తున్నాడు.+ మీరు పక్షుల కన్నా ఎంతో విలువైనవాళ్లు కారా?+ 25 మీలో ఎవరైనా ఆందోళన పడడం వల్ల మీ ఆయుష్షును కాస్తయినా* పెంచుకోగలరా? 26 అంత చిన్న పనే మీరు చేయలేనప్పుడు, మిగతా వాటి గురించి ఎందుకు ఆందోళన పడాలి?+ 27 లిల్లీ పూలు ఎలా ఎదుగుతాయో గమనించండి. అవి కష్టపడవు, వడకవు; కానీ తన పూర్తి వైభవంతో ఉన్న సొలొమోను కూడా ఈ పూలలో ఒకదానంత అందంగా అలంకరించబడలేదని నేను మీతో చెప్తున్నాను.+ 28 ఇవాళ ఉండి రేపు పొయ్యిలో వేయబడే గడ్డిమొక్కలనే దేవుడు ఇలా అలంకరిస్తున్నాడంటే, అల్పవిశ్వాసులారా, ఆయన మీకు తప్పకుండా బట్టలు ఇస్తాడు కదా? 29 కాబట్టి ఏం తినాలి? ఏం తాగాలి? అని ఆందోళన పడడం మానేయండి. అతిగా చింతించడం ఆపండి.+ 30 ఎందుకంటే, లోకంలోని అన్యజనులు వీటి వెనకే ఆత్రంగా పరుగెత్తుతున్నారు. అయితే ఇవి మీకు అవసరమని మీ తండ్రికి తెలుసు.+ 31 మీరు మాత్రం, ఆయన రాజ్యానికి మొదటిస్థానం ఇస్తూ ఉండండి; అప్పుడు ఆయన వాటిని మీకు ఇస్తాడు.+
32 “చిన్నమందా,+ భయపడకండి, మీకు రాజ్యాన్ని ఇవ్వడం మీ తండ్రికి ఇష్టం.+ 33 మీకు ఉన్నవాటిని అమ్మి దానధర్మాలు* చేయండి.+ పాడవ్వని డబ్బు సంచుల్ని తయారుచేసుకోండి, అంటే పరలోకంలో ఎప్పటికీ ఉండే సంపదను కూడబెట్టుకోండి.+ ఏ దొంగా దాని దగ్గరికి రాలేడు, దానికి చెదలు పట్టవు. 34 ఎందుకంటే, మీ సంపద ఎక్కడ ఉంటే మీ హృదయం కూడా అక్కడే ఉంటుంది.
35 “మీ నడుం కట్టుకొని సిద్ధంగా ఉండండి,+ మీ దీపాలు మండుతూ ఉండేలా చూసుకోండి.+ 36 యజమాని పెళ్లి నుండి తిరిగొచ్చి+ తలుపు తట్టగానే దాన్ని తీయాలని, అతని కోసం ఎదురుచూస్తున్న దాసుల్లా+ మీరు ఉండాలి. 37 యజమాని వచ్చి ఏ దాసులు అలా మెలకువగా ఉండడం చూస్తాడో ఆ దాసులు సంతోషంగా ఉంటారు! నేను నిజంగా మీతో చెప్తున్నాను, అప్పుడు ఆ యజమాని నడుం కట్టుకొని, వాళ్లను భోజనం బల్ల దగ్గర కూర్చోబెట్టి, పక్కనే ఉండి వాళ్లకు సేవలు చేస్తాడు. 38 యజమాని రెండో జామున* వచ్చినా, చివరికి మూడో జామున* వచ్చినా ఆ దాసులు సిద్ధంగా ఉంటే వాళ్లు సంతోషంగా ఉంటారు! 39 అయితే ఈ విషయం గుర్తుపెట్టుకోండి, దొంగ ఏ సమయంలో వస్తాడో ఇంటి యజమానికి ముందే తెలిస్తే, అతను ఆ దొంగను ఇంట్లో చొరబడనిచ్చేవాడు కాదు.+ 40 కాబట్టి మీరు కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. ఎందుకంటే, మీరు అనుకోని సమయంలో మానవ కుమారుడు వస్తున్నాడు.”+
41 అప్పుడు పేతురు, “ప్రభువా, ఈ ఉదాహరణను మాకు మాత్రమే చెప్తున్నావా లేక అందరికీ చెప్తున్నావా?” అని అడిగాడు. 42 దానికి ప్రభువు ఇలా చెప్పాడు: “తన సేవకులందరికీ* తగిన సమయంలో, తగినంత ఆహారం పెడుతూ ఉండేలా యజమాని వాళ్లమీద నియమించే నమ్మకమైన, బుద్ధిగల* గృహనిర్వాహకుడు నిజంగా ఎవరు?+ 43 యజమాని వచ్చి ఆ దాసుడు అలాచేస్తూ ఉండడం చూస్తే, ఆ దాసుడు సంతోషంగా ఉంటాడు! 44 నేను మీతో నిజం చెప్తున్నాను, ఆయన ఆ దాసుణ్ణి తన ఆస్తి అంతటి మీద నియమిస్తాడు. 45 కానీ ఒకవేళ ఆ దాసుడు, ‘నా యజమాని ఆలస్యం చేస్తున్నాడు’ అని తన హృదయంలో అనుకొని పనివాళ్లను, పనికత్తెలను కొడుతూ, తింటూ తాగుతూ మత్తుగా ఉంటే+ 46 ఆ దాసుడు ఎదురుచూడని రోజున, అతనికి తెలియని సమయంలో యజమాని వచ్చి అతన్ని అతి కఠినంగా శిక్షిస్తాడు, నమ్మకంగాలేని వాళ్ల మధ్య అతన్ని ఉంచుతాడు. 47 తన యజమాని ఇష్టాన్ని అర్థం చేసుకొని కూడా సిద్ధపడకుండా, అతను చెప్పింది* చేయకుండా ఉన్న ఆ దాసుడికి చాలా దెబ్బలు పడతాయి.+ 48 అయితే యజమాని ఇష్టాన్ని అర్థం చేసుకోనందువల్ల దెబ్బలకు తగిన పనులు చేసే వ్యక్తికి తక్కువ దెబ్బలు పడతాయి. నిజానికి, ఎవరికైతే ఎక్కువ ఇవ్వబడిందో అతని నుండి ఎక్కువ కోరబడుతుంది. ఎక్కువ వాటి మీద నియమించబడిన వ్యక్తి నుండి మామూలు కన్నా ఎక్కువ కోరబడుతుంది.+
49 “నేను భూమ్మీద నిప్పు అంటించడానికి వచ్చాను. అయితే అది ఇప్పటికే రగులుకుంది, ఇక అంతకన్నా నాకు ఏంకావాలి? 50 నిజానికి నేను తీసుకోవాల్సిన బాప్తిస్మం ఒకటి ఉంది. అది పూర్తయ్యేవరకు నేను ఎంతో వేదన పడుతున్నాను!+ 51 నేను భూమ్మీదికి శాంతిని తేవడానికి వచ్చానని మీరు అనుకుంటున్నారా? శాంతిని తేవడానికి కాదు విరోధం పెట్టడానికే వచ్చానని మీతో చెప్తున్నాను.+ 52 ఇప్పటినుండి ఒక ఇంట్లో ఐదుగురు ఉంటే, వాళ్లలో ముగ్గురికి వ్యతిరేకంగా ఇద్దరు, ఇద్దరికి వ్యతిరేకంగా ముగ్గురు ఉంటారు. 53 తండ్రి కుమారుడికి, కుమారుడు తండ్రికి, తల్లి కూతురికి, కూతురు తల్లికి, అత్త కోడలికి, కోడలు అత్తకు వ్యతిరేకంగా ఉంటారు.”+
54 తర్వాత ఆయన ప్రజలతో ఇలా కూడా అన్నాడు: “పడమటి నుండి మబ్బు పైకి రావడం మీరు చూసినప్పుడు వెంటనే, ‘తుఫాను రాబోతుంది’ అంటారు; అది వస్తుంది. 55 అలాగే, దక్షిణ గాలి వీచడం మీరు చూసినప్పుడు, ‘వడగాలి రాబోతుంది’ అంటారు; అది వస్తుంది. 56 వేషధారులారా, భూమినీ ఆకాశాన్నీ చూసి వాతావరణం ఎలా ఉంటుందో మీరు గ్రహించగలరు. కానీ ఈ సమయంలో జరుగుతున్న వాటి అర్థాన్ని మీరు ఎందుకు గ్రహించట్లేదు?+ 57 అలాగే, ఏది సరైనదో మీ అంతట మీరే ఎందుకు గ్రహించట్లేదు? 58 ఉదాహరణకు, నువ్వు నీ ప్రతివాదితో న్యాయస్థానానికి వెళ్లే దారిలో ఉన్నప్పుడే త్వరగా అతనితో రాజీపడు; లేకపోతే అతను నిన్ను న్యాయమూర్తి ముందుకు తీసుకెళ్తాడు, న్యాయమూర్తి నిన్ను భటుడికి అప్పగిస్తాడు, అతను నిన్ను చెరసాలలో వేస్తాడు.+ 59 నువ్వు చివరి నాణెం* చెల్లించేంత వరకు అక్కడి నుండి బయటికి రానేరావని నేను నీతో చెప్తున్నాను.”