యెహెజ్కేలు
39 “మానవ కుమారుడా, గోగుకు వ్యతిరేకంగా ప్రవచించి+ అతనితో ఇలా అను, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: “మెషెకు, తుబాలుల+ ముఖ్య ప్రధానుడివైన* గోగూ, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను. 2 నేను నిన్ను వెనక్కి తిప్పి, నడిపించి, ఉత్తరాన సుదూర ప్రాంతాల నుండి ఇశ్రాయేలు పర్వతాల మీదికి తీసుకొస్తాను.+ 3 నేను నీ ఎడమచేతిలో నుండి విల్లు, నీ కుడిచేతిలో నుండి బాణాలు పడిపోయేలా చేస్తాను. 4 నువ్వు, నీ సైన్యాలు, నీతో ఉన్న జనాలు ఇశ్రాయేలు పర్వత ప్రాంతాల మీద కూలిపోతారు.+ నేను నిన్ను అన్నిరకాల వేటపక్షులకు, అడవి జంతువులకు ఆహారంగా ఇస్తాను.” ’+
5 “ ‘నువ్వు మైదానంలో కూలిపోతావు,+ ఎందుకంటే నేనే స్వయంగా ఈ మాట చెప్పాను’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నాడు.
6 “ ‘నేను మాగోగు మీదికి, ద్వీపాల్లో సురక్షితంగా నివసిస్తున్న వాళ్లమీదికి అగ్ని రప్పిస్తాను,+ అప్పుడు నేను యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు. 7 నేను నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్య నా పవిత్రమైన పేరును తెలియజేసుకుంటాను, ఇకమీదట నా పవిత్రమైన పేరును అపవిత్రం చేయనివ్వను; అప్పుడు నేను ఇశ్రాయేలులోని పవిత్ర దేవుడైన యెహోవానని+ జనాలు తెలుసుకుంటాయి.’+
8 “సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు, ‘అవును, అది వస్తోంది, అది నెరవేరుతుంది. ఆ రోజు గురించే నేను మాట్లాడాను. 9 ఇశ్రాయేలు నగరాల్లోని ప్రజలు బయటికి వెళ్లి ఆ యుద్ధాయుధాలతో, అంటే చిన్న డాళ్లతో,* డాళ్లతో, విల్లులతో, బాణాలతో, యుద్ధంలో వాడే కర్రలతో,* ఈటెలతో మంట వెలిగించుకుంటారు. వాళ్లు ఏడు సంవత్సరాల పాటు వాటితో మంట వెలిగించుకుంటారు.+ 10 వాళ్లు ఆ ఆయుధాలతో మంట వెలిగించుకుంటారు కాబట్టి వాళ్లు పొలాల్లో నుండి గానీ, అడవుల్లో నుండి గానీ కట్టెలు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు.’
“ ‘వాళ్లు తమను కొల్లగొట్టినవాళ్లను కొల్లగొడతారు, తమను దోచుకుంటూ వచ్చినవాళ్లను దోచుకుంటారు’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు.
11 “ ‘ఆ రోజున, అక్కడే ఇశ్రాయేలు దేశంలో, సముద్రానికి తూర్పున ప్రయాణించేవాళ్ల లోయలో నేను గోగుకు+ ఒక సమాధి స్థలాన్ని ఇస్తాను; అది ప్రయాణికులు వెళ్లకుండా ఆ దారిని మూసేస్తుంది. అక్కడే వాళ్లు గోగును, అతని సైన్యాలన్నిటినీ పాతిపెడతారు, వాళ్లు దాన్ని హమోను-గోగు లోయ*+ అని పిలుస్తారు. 12 వాళ్లను పాతిపెట్టి, దేశాన్ని శుభ్రం చేయడానికి+ ఇశ్రాయేలు ఇంటివాళ్లకు ఏడు నెలలు పడుతుంది. 13 దేశంలోని ప్రజలందరూ వాళ్లను పాతిపెడతారు. దానివల్ల, నన్ను నేను మహిమపర్చుకునే రోజున వాళ్లకు కీర్తి వస్తుంది’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.
14 “ ‘దేశాన్ని శుభ్రం చేయడం కోసం, దేశం గుండా ఎప్పుడూ సంచరిస్తూ భూమ్మీద మిగిలివున్న శవాల్ని పాతిపెట్టడానికి కొంతమంది మనుషులు నియమించబడతారు. వాళ్లు ఏడు నెలలపాటు అలా వెదుకుతూ ఉంటారు. 15 దేశం గుండా సంచరించేవాళ్లకు ఎప్పుడైనా ఒక మనిషి ఎముక కనిపిస్తే, వాళ్లు దాని పక్కన ఒక గుర్తును పెడతారు. పాతిపెట్టడానికి నియమించబడినవాళ్లు దాన్ని హమోను-గోగు లోయలో+ పాతిపెడతారు. 16 అంతేకాదు, అక్కడ హమోనా* అనే పేరుగల ఒక నగరం కూడా ఉంటుంది. అలా వాళ్లు దేశాన్ని శుభ్రం చేస్తారు.’+
17 “మానవ కుమారుడా, సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘ప్రతీ రకమైన పక్షితో, అడవి జంతువులన్నిటితో ఇలా చెప్పు, “మీరంతా కలిసి రండి. నేను మీ కోసం ఇశ్రాయేలు పర్వతాల మీద సిద్ధం చేస్తున్న గొప్ప బలి+ చుట్టూ పోగవ్వండి. మీరు మాంసం తింటారు, రక్తం తాగుతారు.+ 18 మీరు బలవంతుల మాంసం తింటారు, భూమ్మీది ప్రధానుల రక్తం తాగుతారు. వాళ్లంతా బాషానులోని కొవ్విన జంతువులు అంటే పొట్టేళ్లు, గొర్రెపిల్లలు, మేకలు, ఎద్దులు. 19 నేను మీ కోసం సిద్ధం చేసిన బలి కొవ్వును మీరు పీకలదాకా తింటారు, మత్తెక్కే దాకా రక్తం తాగుతారు.” ’
20 “ ‘నా బల్ల దగ్గర మీరు గుర్రాల్ని, గుర్రపురౌతుల్ని, బలవంతుల్ని, అన్నిరకాల యోధుల్ని కడుపునిండా తింటారు’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.
21 “ ‘నేను జనాల మధ్య నా మహిమను చూపిస్తాను, అప్పుడు జనాలన్నీ నేను తీర్చిన తీర్పును, నేను వాళ్ల మధ్య ప్రదర్శించిన నా శక్తిని చూస్తాయి.+ 22 ఆ రోజు నుండి ఇశ్రాయేలు ఇంటివాళ్లు నేను తమ దేవుడైన యెహోవానని తెలుసుకుంటారు. 23 ఇశ్రాయేలు ఇంటివాళ్లు తమ దోషం వల్లే, వాళ్లు నాకు చేసిన నమ్మకద్రోహం వల్లే చెరలోకి వెళ్లారని జనాలు తెలుసుకుంటాయి.+ అందుకే, నేను నా ముఖాన్ని వాళ్ల నుండి పక్కకు తిప్పుకొని,+ వాళ్లను తమ శత్రువుల చేతికి అప్పగించాను,+ వాళ్లంతా ఖడ్గం వల్ల చనిపోయారు. 24 వాళ్ల అపవిత్రతను బట్టి, వాళ్ల అపరాధాల్ని బట్టి నేను వాళ్లను శిక్షించాను, వాళ్ల నుండి నా ముఖం పక్కకు తిప్పుకున్నాను.’
25 “కాబట్టి సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ‘నేను బందీలుగా వెళ్లిన యాకోబు ప్రజల్ని వాళ్ల దేశానికి తిరిగి తీసుకొస్తాను,+ ఇశ్రాయేలు ఇంటివాళ్లందరి మీద కరుణ చూపిస్తాను;+ నా పవిత్రమైన పేరు విషయంలో ఉత్సాహంతో స్థిరంగా చర్య తీసుకుంటాను.+ 26 నాకు చేసిన నమ్మకద్రోహం అంతటిని బట్టి వాళ్లు అవమానాలపాలైన+ తర్వాత, వాళ్లు ఎవరి భయం లేకుండా తమ దేశంలో సురక్షితంగా నివసిస్తారు.+ 27 నేను వాళ్లను జనాల మధ్య నుండి, వాళ్ల శత్రువుల దేశాల నుండి సమకూర్చి తీసుకొచ్చినప్పుడు,+ అనేక జనాల కళ్లముందు వాళ్లమధ్య నన్ను నేను పవిత్రపర్చుకుంటాను.’+
28 “ ‘నేను వాళ్లను జనాల మధ్యకు చెరగా పంపించి, ఆ తర్వాత వాళ్లలో ఒక్కర్ని కూడా విడిచిపెట్టకుండా అందర్నీ తమ దేశానికి తిరిగి తీసుకొచ్చినప్పుడు,+ నేను తమ దేవుడైన యెహోవానని వాళ్లు తెలుసుకుంటారు. 29 నేను ఇక ఎంతమాత్రం ఇశ్రాయేలు ఇంటివాళ్ల నుండి నా ముఖం పక్కకు తిప్పుకోను,+ ఎందుకంటే నేను వాళ్లమీద నా పవిత్రశక్తిని కుమ్మరిస్తాను’+ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా చెప్తున్నాడు.”