రాజులు మొదటి గ్రంథం
21 వీటి తర్వాత ఒక సంఘటన జరిగింది. యెజ్రెయేలువాడైన నాబోతుకు ఒక ద్రాక్షతోట ఉంది, అది యెజ్రెయేలులో+ సమరయ రాజైన అహాబు రాజభవనం పక్కన ఉంది. 2 అహాబు నాబోతుతో ఇలా అన్నాడు: “నీ ద్రాక్షతోట నా భవనం దగ్గర ఉంది కాబట్టి కూరగాయల తోటగా వాడుకోవడానికి దాన్ని నాకు ఇవ్వు. దానికి బదులు నీకు అంతకన్నా మంచి ద్రాక్షతోటను ఇస్తాను. లేదా నువ్వు కావాలనుకుంటే, దాని విలువను డబ్బు రూపంలో ఇస్తాను.” 3 కానీ నాబోతు అహాబుతో, “నా పూర్వీకుల నుండి వారసత్వంగా వచ్చినదాన్ని నీకు ఇవ్వడం నా ఊహకందని విషయం. ఎందుకంటే యెహోవా దాన్ని నిషేధించాడు”+ అని అన్నాడు. 4 “నా పూర్వీకుల నుండి వారసత్వంగా వచ్చినదాన్ని నీకు ఇవ్వను” అని యెజ్రెయేలువాడైన నాబోతు అన్న మాటను బట్టి అహాబు ముఖం మాడ్చుకుని, దిగాలుగా ఇంట్లోకి వచ్చాడు. అతను మంచం మీద పడుకొని ముఖం పక్కకు తిప్పుకున్నాడు, భోజనం కూడా వద్దన్నాడు.
5 అతని భార్య యెజెబెలు+ అతని దగ్గరికి వచ్చి, “నువ్వు ఎందుకింత బాధగా ఉన్నావు? భోజనం కూడా వద్దంటున్నావు?” అని అడిగింది. 6 అందుకు అతను ఇలా చెప్పాడు: “నేను యెజ్రెయేలువాడైన నాబోతుతో, ‘నీ ద్రాక్షతోటను నాకు అమ్ము. లేదా, నీకిష్టమైతే దానికి బదులు మరో ద్రాక్షతోటను ఇస్తాను’ అని అన్నాను. కానీ అతను, ‘నా ద్రాక్షతోటను నీకు ఇవ్వను’ అన్నాడు.” 7 దానికి అహాబు భార్య యెజెబెలు, “నువ్వు ఇశ్రాయేలు మీద రాజువు కాదా? లేచి ఏమైనా తిను, సంతోషంగా ఉండు. యెజ్రెయేలువాడైన నాబోతు ద్రాక్షతోటను నేను నీకు ఇప్పిస్తాను”+ అంది. 8 అప్పుడు ఆమె అహాబు పేరుతో ఉత్తరాలు రాసి, వాటిమీద అతని ముద్ర వేసి+ నాబోతు నగరంలోని పెద్దలకు,+ ప్రముఖులకు పంపించింది. 9 ఆమె ఉత్తరాల్లో ఇలా రాసింది: “ఒక ఉపవాస దినాన్ని చాటించి, నాబోతును ప్రజలందరి ముందు కూర్చోబెట్టండి. 10 ఇద్దరు పనికిమాలినవాళ్లను అతని ముందు కూర్చోబెట్టి, ‘నువ్వు దేవుణ్ణి, రాజును శపించావు!’+ అని వాళ్లచేత అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించండి.+ తర్వాత అతన్ని బయటికి తీసుకెళ్లి, రాళ్లతో కొట్టి చంపండి.”+
11 నాబోతు నగరం వాళ్లు, అంటే ఆ నగరంలోని పెద్దలు, ప్రముఖులు యెజెబెలు తమకు పంపిన ఉత్తరాల్లో రాసివున్నట్టే చేశారు.12 వాళ్లు ఒక ఉపవాస దినాన్ని చాటించి, నాబోతును ప్రజలందరి ముందు కూర్చోబెట్టారు. 13 తర్వాత ఇద్దరు పనికిమాలినవాళ్లు అతని ముందు కూర్చొని, “నాబోతు దేవుణ్ణి, రాజును శపించాడు” అని ప్రజలందరి ముందు సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టారు.+ తర్వాత ప్రజలు అతన్ని నగరం బయటికి తీసుకెళ్లి, రాళ్లతో కొట్టి చంపారు.+ 14 ఆ తర్వాత వాళ్లు యెజెబెలుకు, “నాబోతును రాళ్లతో కొట్టి చంపారు”+ అని కబురు పంపించారు.
15 నాబోతును రాళ్లతో కొట్టి చంపారనే వార్త వినగానే యెజెబెలు అహాబుతో ఇలా అంది: “నువ్వు లేచి, యెజ్రెయేలువాడైన నాబోతు నీకు అమ్మనని చెప్పిన అతని ద్రాక్షతోటను స్వాధీనం చేసుకో,+ నాబోతు ఇప్పుడు ప్రాణాలతో లేడు. అతను చనిపోయాడు.” 16 నాబోతు చనిపోయాడని వినగానే అహాబు లేచి, యెజ్రెయేలువాడైన నాబోతు ద్రాక్షతోటను స్వాధీనం చేసుకోవడానికి బయల్దేరాడు.
17 అప్పుడు యెహోవా వాక్యం తిష్బీయుడైన ఏలీయా+ దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: 18 “నువ్వు లేచి, సమరయలో ఉన్న ఇశ్రాయేలు రాజైన అహాబును+ కలవడానికి వెళ్లు. అతను నాబోతు ద్రాక్షతోటలో ఉన్నాడు. అతను దాన్ని స్వాధీనం చేసుకోవడానికి వెళ్లాడు. 19 నువ్వు అతనికి ఇలా చెప్పాలి, ‘యెహోవా చెప్పేదేమిటంటే: “నువ్వు ఒక వ్యక్తిని హత్య చేసి,+ అతని ఆస్తిని కూడా లాక్కున్నావు కదా?” ’+ తర్వాత అతనితో ఇలా చెప్పు, ‘ “కుక్కలు ఏ స్థలంలో నాబోతు రక్తాన్ని నాకాయో, అదే స్థలంలో అవి నీ రక్తాన్ని నాకుతాయి” అని యెహోవా చెప్తున్నాడు.’ ”+
20 అప్పుడు అహాబు ఏలీయాతో, “నా శత్రువా, నేను నీ చేతికి చిక్కానా!”+ అని అన్నాడు. దానికి ఏలీయా ఇలా అన్నాడు: “అవును, నువ్వు నా చేతికి చిక్కావు. దేవుడు ఇలా చెప్పాడు: ‘నువ్వు యెహోవా దృష్టిలో చెడు చేయాలని తీర్మానించుకున్నావు*+ కాబట్టి 21 ఇదిగో నేను నీ మీదికి విపత్తు తీసుకొస్తున్నాను, నిన్ను నిర్మూలిస్తాను; ఇశ్రాయేలులో ఉన్న నిస్సహాయులతో, బలహీనులతో సహా అహాబు కుటుంబంలో ఉన్న ప్రతీ మగవాణ్ణి పూర్తిగా నాశనం చేస్తాను.+ 22 నేను నీ ఇంటిని నెబాతు కుమారుడైన యరొబాము ఇంటిలా,+ అహీయా కుమారుడైన బయెషా ఇంటిలా+ చేస్తాను. ఎందుకంటే నువ్వు నాకు కోపం తెప్పించావు, ఇశ్రాయేలీయులతో పాపం చేయించావు.’ 23 అంతేకాదు, యెజెబెలు గురించి యెహోవా ఇలా చెప్పాడు: ‘యెజ్రెయేలులోని పొలంలో కుక్కలు యెజెబెలును తింటాయి.+ 24 అహాబుకు చెందినవాళ్లు ఎవరైనా నగరంలో చనిపోతే కుక్కలు వాళ్లను తింటాయి, ఎవరైనా పొలంలో చనిపోతే వాళ్లను ఆకాశపక్షులు తింటాయి.+ 25 నిజానికి, తన భార్య అయిన యెజెబెలు ప్రోద్బలంతో+ యెహోవా దృష్టిలో చెడు చేయాలని గట్టిగా తీర్మానించుకున్న* అహాబులాంటి వ్యక్తి ఎవ్వరూ లేరు.+ 26 యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి వెళ్లగొట్టిన అమోరీయుల్లా అతను అసహ్యమైన విగ్రహాల్ని* పూజిస్తూ ఎంతో నీచంగా ప్రవర్తించాడు.’ ”+
27 ఆ మాటలు వినగానే అహాబు బట్టలు చింపుకొని, గోనెపట్ట కట్టుకున్నాడు; అతను ఉపవాసం ఉంటూ, గోనెపట్టతోనే పడుకుంటూ, బాధగా నడుస్తూ ఉన్నాడు. 28 అప్పుడు యెహోవా వాక్యం తిష్బీయుడైన ఏలీయా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది: 29 “అహాబు నా ఎదుట తనను తాను ఎలా తగ్గించుకున్నాడో చూశావా?+ అతను నా ఎదుట తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి, నేను ఆ విపత్తును అతని జీవితకాలంలో తీసుకురాను. అతని కుమారుని రోజుల్లో అహాబు ఇంటి మీదికి విపత్తు తీసుకొస్తాను.”+