రాజులు మొదటి గ్రంథం
19 ఏలీయా చేసినదంతా, అలాగే అతను ప్రవక్తలందర్నీ కత్తితో చంపిన సంగతి అహాబు+ యెజెబెలుకు+ చెప్పాడు. 2 అప్పుడు యెజెబెలు ఒక సందేశకుడి ద్వారా ఏలీయాకు ఈ కబురు పంపింది: “రేపు ఈ సమయానికి నిన్ను, నువ్వు చంపిన ప్రవక్తల్లా చేయకపోతే దేవుళ్లు నన్ను తీవ్రంగా శిక్షించాలి!” 3 దాంతో అతను భయపడిపోయి, తన ప్రాణం కాపాడుకోవడానికి పారిపోయాడు.+ అతను యూదాకు చెందిన+ బెయేర్షెబాకు వచ్చాడు, తన సేవకుణ్ణి అక్కడ విడిచిపెట్టి వెళ్లాడు. 4 ఏలీయా ఒకరోజు ప్రయాణమంత దూరం ఎడారిలోకి వెళ్లి, ఒక చిన్న చెట్టు కింద కూర్చున్నాడు; అతను చనిపోవాలని కోరుకున్నాడు. ఏలీయా ఇలా అన్నాడు: “యెహోవా, ఇక చాలు, నా ప్రాణం తీసేయి.+ నేను నా పూర్వీకులకన్నా గొప్పవాణ్ణి కాదు.”
5 ఏలీయా ఆ చిన్న చెట్టు కింద పడుకొని నిద్రపోయాడు. అయితే ఉన్నట్టుండి ఒక దేవదూత అతన్ని ముట్టుకుని,+ “లేచి తిను” అని అన్నాడు.+ 6 ఏలీయా చూసినప్పుడు, తన తల దగ్గర వేడి రాళ్ల మీద ఒక గుండ్రటి రొట్టె, ఒక కూజాలో నీళ్లు ఉన్నాయి. అతను తిని తాగి మళ్లీ పడుకున్నాడు. 7 తర్వాత యెహోవా దూత రెండోసారి వచ్చి అతన్ని ముట్టుకొని, “లేచి తిను, నీ శక్తికి మించిన ప్రయాణం నువ్వు చేయాల్సి ఉంది” అని చెప్పాడు. 8 దాంతో ఏలీయా లేచి తిని తాగాడు, ఆ ఆహారం వల్ల వచ్చిన శక్తితో అతను 40 పగళ్లు, 40 రాత్రులు ప్రయాణించి సత్యదేవుని పర్వతమైన హోరేబుకు+ చేరుకున్నాడు.
9 అక్కడ అతను ఒక గుహలోకి+ వెళ్లి ఆ రాత్రి అందులోనే ఉన్నాడు; అప్పుడు యెహోవా అతన్ని, “ఏలీయా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు?” అని అడిగాడు. 10 అందుకు ఏలీయా ఇలా అన్నాడు: “నేను సైన్యాలకు దేవుడైన యెహోవాను ఎంతో ఉత్సాహంతో సేవించాను;+ ఇశ్రాయేలు ప్రజలు నీ ఒప్పందాన్ని విడిచిపెట్టారు,+ నీ బలిపీఠాల్ని పడగొట్టారు, నీ ప్రవక్తల్ని కత్తితో చంపారు;+ నేను ఒక్కడినే మిగిలాను. ఇప్పుడు వాళ్లు నా ప్రాణం తీయాలని చూస్తున్నారు.”+ 11 అయితే ఆయన, “నువ్వు బయటికి వెళ్లి, పర్వతం మీద యెహోవా ఎదుట నిలబడు” అని చెప్పాడు. ఇదిగో! యెహోవా ఏలీయా పక్కన నుండి వెళ్లాడు,+ అప్పుడు ఒక బలమైన పెనుగాలి యెహోవా ఎదుట పర్వతాల్ని బద్దలుచేసి, బండల్ని పగలగొట్టింది,+ అయితే యెహోవా ఆ గాలిలో లేడు. గాలి తర్వాత ఒక భూకంపం+ వచ్చింది, కానీ యెహోవా ఆ భూకంపంలో లేడు. 12 భూకంపం తర్వాత అగ్నిజ్వాలలు రేగాయి,+ కానీ యెహోవా ఆ అగ్నిలో కూడా లేడు. అగ్ని తర్వాత ఒక ప్రశాంతమైన, మెల్లని స్వరం వినబడింది.+ 13 అది వినగానే ఏలీయా తన ముఖాన్ని తన అధికారిక వస్త్రంతో కప్పుకొని+ బయటికి వెళ్లి, గుహ ప్రవేశ ద్వారం దగ్గర నిలబడ్డాడు. అప్పుడు ఒక స్వరం, “ఏలీయా, ఇక్కడ ఏం చేస్తున్నావు?” అని అడిగింది. 14 అందుకు ఏలీయా ఇలా అన్నాడు: “నేను సైన్యాలకు దేవుడైన యెహోవాను ఎంతో ఉత్సాహంతో సేవించాను; ఇశ్రాయేలు ప్రజలు నీ ఒప్పందాన్ని విడిచిపెట్టారు,+ నీ బలిపీఠాల్ని పడగొట్టారు, నీ ప్రవక్తల్ని కత్తితో చంపారు; నేను ఒక్కడినే మిగిలాను. ఇప్పుడు వాళ్లు నా ప్రాణం తీయాలని చూస్తున్నారు.”+
15 అప్పుడు యెహోవా ఏలీయాతో ఇలా అన్నాడు: “నువ్వు దమస్కు ఎడారికి తిరిగెళ్లి, హజాయేలును+ సిరియా మీద రాజుగా అభిషేకించు. 16 అలాగే నింషీ మనవడైన యెహూను+ ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించు, ఆబేల్-మెహోలాకు చెందిన షాపాతు కుమారుడు ఎలీషాను* నీ స్థానంలో ప్రవక్తగా అభిషేకించు.+ 17 హజాయేలు కత్తి నుండి తప్పించుకున్నవాళ్లను+ యెహూ చంపుతాడు;+ యెహూ కత్తి నుండి తప్పించుకున్నవాళ్లను ఎలీషా చంపుతాడు.+ 18 అంతేకాదు, బయలుకు మోకరించని,+ అతన్ని ముద్దు పెట్టుకోని+ 7,000 మంది ఇశ్రాయేలులో ఇంకా నాకు మిగిలివున్నారు.”+
19 కాబట్టి ఏలీయా అక్కడి నుండి వెళ్లి షాపాతు కుమారుడైన ఎలీషాను చూశాడు. ఎలీషా ఆ సమయంలో 12 జతల ఎద్దులతో పొలం దున్నుతున్నాడు, అతను చివర్లో ఉన్న 12వ జత ఎద్దులతో పాటు ఉన్నాడు. ఏలీయా అతని దగ్గరికి వెళ్లి తన అధికారిక వస్త్రాన్ని+ అతని మీద వేశాడు. 20 అప్పుడు ఎలీషా ఎద్దుల్ని విడిచిపెట్టి ఏలీయా వెనక పరుగెత్తుకుంటూ వెళ్లి, “దయచేసి నా తల్లిదండ్రులకు వీడ్కోలు చెప్పనివ్వు.* తర్వాత నేను నిన్ను అనుసరిస్తాను” అన్నాడు. అందుకు ఏలీయా, “సరే వెళ్లు, నేను నిన్ను ఆపట్లేదు” అన్నాడు. 21 కాబట్టి ఎలీషా వెనక్కి వెళ్లి, ఒక జత ఎద్దుల్ని తీసుకుని వాటిని బలి అర్పించాడు; అతను కాడి మ్రానులతో ఎద్దుల మాంసం ఉడికించి, ప్రజలకు ఇచ్చాడు. వాళ్లు తిన్నారు. తర్వాత అతను లేచి ఏలీయాను అనుసరించి, అతనికి సేవ చేయడం మొదలుపెట్టాడు.+