సమూయేలు రెండో గ్రంథం
5 కొంతకాలానికి ఇశ్రాయేలు గోత్రాల వాళ్లందరూ హెబ్రోనులో దావీదు దగ్గరికి వచ్చి+ ఇలా అన్నారు: “ఇదిగో! మేము నీ రక్తసంబంధులం.*+ 2 గతంలో సౌలు మాకు రాజుగా ఉన్నప్పుడు, నువ్వే యుద్ధాల్లో ఇశ్రాయేలీయులకు నాయకత్వం వహించావు.+ అంతేకాదు యెహోవా నీతో ఇలా అన్నాడు: ‘నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలీయుల్ని కాస్తావు, నువ్వు ఇశ్రాయేలు మీద నాయకుడివి అవుతావు.’ ”+ 3 అలా ఇశ్రాయేలు పెద్దలందరూ హెబ్రోనులో రాజు దగ్గరికి వచ్చారు, దావీదు రాజు హెబ్రోనులో యెహోవా ఎదుట వాళ్లతో ఒప్పందం చేశాడు.+ తర్వాత వాళ్లు దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించారు.+
4 దావీదు రాజైనప్పుడు అతని వయసు 30 ఏళ్లు, అతను 40 సంవత్సరాలు పరిపాలించాడు. 5 అతను హెబ్రోనులో యూదా మీద ఏడున్నర సంవత్సరాలు, యెరూషలేములో+ ఇశ్రాయేలు, యూదా అంతటిమీద 33 సంవత్సరాలు పరిపాలించాడు. 6 దావీదు రాజు, అతని మనుషులు యెరూషలేమును స్వాధీనం చేసుకోవడానికి అక్కడ నివసిస్తున్న యెబూసీయుల+ మీదికి వెళ్లారు. యెబూసీయులు దావీదును, “నువ్వు ఎప్పటికీ ఇక్కడికి రాలేవు! చివరికి గుడ్డివాళ్లు, కుంటివాళ్లు కూడా నిన్ను వెళ్లగొడతారు” అని హేళన చేశారు. వాళ్లు, ‘దావీదు ఎప్పటికీ ఇక్కడికి రాడు’+ అనుకున్నారు. 7 అయితే, దావీదు సీయోను కోటను స్వాధీనం చేసుకున్నాడు. దాన్ని ఇప్పుడు దావీదు నగరం అని పిలుస్తున్నారు.+ 8 కాబట్టి దావీదు ఆ రోజు ఇలా అన్నాడు: “యెబూసీయుల మీద దాడిచేసేవాళ్లు ‘కుంటివాళ్లను, గుడ్డివాళ్లను’ చంపడానికి నీటి సొరంగం గుండా వెళ్లాలి, వాళ్లంటే దావీదుకు అసహ్యం!” అందుకే, “గుడ్డివాళ్లు, కుంటివాళ్లు ఈ స్థలంలోకి ఎప్పటికీ ప్రవేశించలేరు” అని అంటారు. 9 తర్వాత దావీదు ఆ కోటలో నివసించడం మొదలుపెట్టాడు, దానికి దావీదు నగరం అనే పేరు వచ్చింది;* దావీదు మిల్లో*+ మీద, అలాగే నగరంలో ఆయా చోట్ల గోడల్ని, మిగతా భవనాల్ని కట్టించడం మొదలుపెట్టాడు.+ 10 అలా దావీదు అంతకంతకూ గొప్పవాడౌతూ ఉన్నాడు,+ సైన్యాలకు దేవుడైన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు.+
11 తూరు రాజైన హీరాము+ దావీదు దగ్గరికి సందేశకుల్ని, అలాగే దేవదారు మ్రానుల్ని,+ వడ్రంగుల్ని, గోడలు నిర్మించడానికి తాపీ పనివాళ్లను పంపించాడు. వాళ్లు దావీదు కోసం ఒక రాజభవనాన్ని కట్టడం మొదలుపెట్టారు.+ 12 యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం+ తనను ఇశ్రాయేలు మీద రాజుగా స్థిరపర్చాడని,+ తన రాజ్యాన్ని గొప్ప చేశాడని+ దావీదుకు అర్థమైంది.
13 దావీదు హెబ్రోను నుండి యెరూషలేముకు వచ్చిన తర్వాత ఇంకొంతమంది ఉపపత్నుల్ని,+ భార్యల్ని చేసుకున్నాడు. దావీదుకు ఇంకొంతమంది కుమారులు, కూతుళ్లు పుట్టారు.+ 14 యెరూషలేములో దావీదుకు పుట్టినవాళ్ల పేర్లు ఇవి: షమ్మూయ, షోబాబు, నాతాను,+ సొలొమోను, 15 ఇభారు, ఏలీషూవ, నెపెగు, యాఫీయ, 16 ఎలీషామా, ఎల్యాదా, ఎలీపేలెటు.
17 దావీదు ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించబడ్డాడని విన్నప్పుడు, ఫిలిష్తీయులందరూ అతనితో యుద్ధం చేయడానికి వచ్చారు.+ దావీదు దాని గురించి విన్నప్పుడు తాను దాక్కున్న స్థలానికి వెళ్లిపోయాడు.+ 18 అప్పుడు ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీము లోయలో+ తిరుగుతున్నారు. 19 దాంతో దావీదు, “నేను ఫిలిష్తీయుల మీదికి వెళ్లనా? వాళ్లను నా చేతికి అప్పగిస్తావా?” అని యెహోవా దగ్గర విచారణ చేశాడు.+ దానికి యెహోవా దావీదుతో, “వెళ్లు, నేను తప్పకుండా ఫిలిష్తీయుల్ని నీ చేతికి అప్పగిస్తాను”+ అన్నాడు. 20 కాబట్టి దావీదు బయల్పెరాజీముకు వచ్చి అక్కడ ఫిలిష్తీయుల్ని హతం చేశాడు. అప్పుడు దావీదు, “నీళ్లు గోడను కూల్చినట్టు, యెహోవా నా ఎదుట నా శత్రువుల్ని ఓడించాడు”+ అన్నాడు. అందుకే అతను ఆ స్థలానికి బయల్పెరాజీము*+ అని పేరు పెట్టాడు. 21 ఫిలిష్తీయులు తమ విగ్రహాల్ని అక్కడ వదిలేసి వెళ్లిపోయారు. దావీదు, అతని మనుషులు వాటిని తీసుకెళ్లారు.
22 తర్వాత ఫిలిష్తీయులు మళ్లీ వచ్చి రెఫాయీము లోయలో+ తిరుగుతున్నారు. 23 దావీదు యెహోవా దగ్గర విచారణ చేశాడు; అయితే ఆయన ఇలా చెప్పాడు: “నువ్వు నేరుగా వెళ్లొద్దు. బదులుగా, వాళ్ల వెనక నుండి చుట్టూ తిరిగి, కంబళి చెట్ల ఎదురుగా వాళ్ల మీదికి వెళ్లు. 24 కంబళి చెట్ల కొనల్లో ప్రజలు వస్తున్న శబ్దం వినబడగానే నువ్వు చర్య తీసుకో. ఎందుకంటే ఫిలిష్తీయుల సైన్యాన్ని హతం చేయడానికి యెహోవా అప్పటికే నీకు ముందుగా వెళ్లివుంటాడు.” 25 దావీదు యెహోవా ఆజ్ఞాపించినట్టే చేశాడు. అతను ఫిలిష్తీయుల్ని గెబా+ నుండి గెజెరు+ వరకు హతం చేశాడు.+