ప్రసంగి
2 తర్వాత నేను, “సుఖసంతోషాలు అనుభవించి, అందులో ఏదైనా మంచి ఉందేమో చూద్దాం” అని నా మనసులో అనుకున్నాను. కానీ అది కూడా వ్యర్థమే అని తేలింది.
2 నవ్వు గురించి, “అది వెర్రిది!” అని
సుఖసంతోషాల గురించి, “వాటివల్ల ప్రయోజనమేంటి?” అని నేను అన్నాను.
3 నా తెలివిని కాపాడుకుంటూనే, నేను ద్రాక్షారసంలో మునిగితేలుతూ+ అందులో ఏదైనా మంచి ఉందేమో తెలుసుకోవాలని లోతుగా పరిశోధించాను; ఆకాశం కింద తాము జీవించే కొన్ని రోజుల్లో మనుషులు చేయగల శ్రేష్ఠమైన పని ఏమిటో తెలుసుకోవడానికి నేను తెలివితక్కువతనాన్ని కూడా అనుసరించాను. 4 నేను గొప్పగొప్ప పనులు చేపట్టాను.+ నా కోసం ఇళ్లు కట్టించుకున్నాను,+ ద్రాక్షతోటలు నాటించుకున్నాను.+ 5 తోటలు, ఉద్యానవనాలు నాటించుకున్నాను, వాటిలో అన్నిరకాల పండ్ల చెట్లు వేశాను. 6 నా వనంలోని చెట్లకు నీళ్లు పెట్టడానికి చెరువులు తవ్వించాను. 7 నేను చాలామంది సేవకుల్ని, సేవకురాళ్లను సంపాదించాను,+ నా ఇంట్లో పుట్టిన సేవకులు నాకు ఉండేవాళ్లు. యెరూషలేములో నాకన్నా ముందున్న వాళ్లందరికన్నా చాలా ఎక్కువ పశువుల్ని, మందల్ని సంపాదించుకున్నాను.+ 8 నా కోసం వెండిబంగారాల్ని, ఆయా ప్రాంతాల రాజుల సంపదల్ని సమకూర్చుకున్నాను.+ నా కోసం గాయనీ గాయకుల్ని, అలాగే మనిషికి ఎంతో సంతోషాన్నిచ్చే స్త్రీని, అవును చాలామంది స్త్రీలను సంపాదించుకున్నాను. 9 అలా నేను గొప్పవాణ్ణి అయ్యాను, యెరూషలేములో నాకన్నా ముందున్న వాళ్లందర్నీ మించిపోయాను.+ నా తెలివి నన్ను ఎప్పుడూ విడిచివెళ్లలేదు.
10 నేను కోరుకున్న* ప్రతీది చేశాను.+ నేను నా హృదయానికి ఏ సంతోషాన్నీ దూరం చేయలేదు. ఎందుకంటే నేను కష్టపడి చేసిన పనులన్నిటిని బట్టి నా హృదయానికి సంతోషం కలిగింది; నా కష్టమంతటి వల్ల నాకు దొరికిన ప్రతిఫలం* అదే.11 కానీ నా చేతులతో నేను చేసిన పనులన్నిటి గురించి, నేను పడ్డ ప్రయాస అంతటి+ గురించి ఆలోచించినప్పుడు, అదంతా వ్యర్థమని, నేను గాలి కోసం ప్రయాసపడ్డానని నాకు అర్థమైంది;+ సూర్యుని కింద నిజంగా ప్రయోజనకరమైనది* ఏదీ లేదు.
12 తర్వాత నేను తెలివి మీద, వెర్రితనం మీద, తెలివితక్కువతనం మీద మనసుపెట్టాను.+ (ఎందుకంటే రాజు తర్వాత వచ్చే మనిషి ఏమి చేయగలడు? ప్రజలు అప్పటికే చేసినవాటిని తప్ప.) 13 చీకటికన్నా వెలుగు ఎలా ప్రయోజనకరమో, అలాగే తెలివితక్కువతనం కన్నా తెలివి ప్రయోజనకరమని నాకు అర్థమైంది.+
14 తెలివిగలవాడు తన దారిని స్పష్టంగా చూస్తాడు;*+ కానీ మూర్ఖుడు చీకట్లో నడుస్తుంటాడు.+ అయినా వాళ్లందరికీ పట్టే గతి ఒక్కటేనని+ నాకు అర్థమైంది. 15 తర్వాత నేను నా మనసులో ఇలా అనుకున్నాను: “మూర్ఖుడికి ఏమి జరుగుతుందో అది నాకు కూడా జరుగుతుంది.”+ మరి, నేను ఇంత తెలివి సంపాదించడం వల్ల నాకు వచ్చిన లాభం ఏంటి? కాబట్టి, “ఇది కూడా వ్యర్థమే” అని నాలో నేను అనుకున్నాను.16 ప్రజలు తెలివిగలవాళ్లనైనా, మూర్ఖులనైనా ఎల్లకాలం గుర్తుంచుకోరు.+ రాబోయే రోజుల్లో ఎవ్వరూ గుర్తుండరు. తెలివిగలవాడు కూడా మూర్ఖుడు చనిపోయినట్టే చనిపోతాడు.+
17 కాబట్టి జీవితమంటే నాకు అసహ్యం వేసింది;+ ఎందుకంటే సూర్యుని కింద జరుగుతున్న ప్రతీది దుఃఖకరమని నాకు అనిపించింది. అంతా వ్యర్థం,+ అది గాలి కోసం ప్రయాసపడడం లాంటిది.+ 18 సూర్యుని కింద నేను ఎంతో ప్రయాసపడి చేసిన వాటన్నిటి మీద+ నాకు అసహ్యం కలిగింది, ఎందుకంటే నా తర్వాత వచ్చేవాడికి నేను వాటన్నిటినీ విడిచి వెళ్లాలి.+ 19 ఆ వచ్చేవాడు తెలివిగలవాడో, మూర్ఖుడో ఎవరికి తెలుసు?+ అయినాసరే, సూర్యుని కింద నేను ఎంతో కష్టపడి, తెలివితో సంపాదించుకున్నవన్నీ అతని సొంతమౌతాయి. అది కూడా వ్యర్థమే. 20 కాబట్టి సూర్యుని కింద నేను పడ్డ కష్టమంతటిని బట్టి నా హృదయంలో ఎంతో వేదనపడ్డాను. 21 ఎందుకంటే, ఒక మనిషి తెలివితేటలతో, జ్ఞానంతో, నైపుణ్యంతో కష్టపడి పనిచేస్తాడు; అయితే దానికోసం ఏమాత్రం కష్టపడని వ్యక్తికి అతను అదంతా అప్పగించాల్సి వస్తుంది.+ ఇది కూడా వ్యర్థం, పెద్ద విషాదం.*
22 సూర్యుని కింద మనిషి పడే కష్టమంతటి వల్ల, కష్టపడి పనిచేసేలా అతన్ని నడిపించే కోరిక* వల్ల నిజానికి అతనికి వచ్చే లాభం ఏంటి?+ 23 బ్రతికినన్ని రోజులు అతని పని వల్ల అతనికి బాధ, చిరాకే కలుగుతాయి;+ రాత్రిపూట కూడా అతని హృదయానికి నెమ్మది ఉండదు.+ ఇది కూడా వ్యర్థమే.
24 తింటూ తాగుతూ తన కష్టార్జితంతో సుఖపడడం కన్నా మనిషికి మేలైనది ఏదీ లేదు.+ ఇది కూడా సత్యదేవుడు ఇచ్చేదేనని నాకు అర్థమైంది;+ 25 ఎంతైనా, నా కన్నా శ్రేష్ఠమైనవి తినేవాళ్లు, తాగేవాళ్లు ఎవరున్నారు?+
26 సత్యదేవుడు తనను సంతోషపెట్టేవాళ్లకు తెలివిని, జ్ఞానాన్ని, సంతోషాన్ని ఇస్తున్నాడు;+ అయితే తనను సంతోషపెట్టేవాళ్లకు ఇవ్వడానికి పోగుచేసే, సమకూర్చే పనిని మాత్రం ఆయన పాపులకు ఇస్తున్నాడు.+ ఇది కూడా వ్యర్థమే, గాలి కోసం ప్రయాసపడడమే.