ఎస్తేరు
1 అహష్వేరోషు* పరిపాలిస్తున్న రోజుల్లో, అంటే భారతదేశం* నుండి ఇతియోపియా* వరకున్న 127 సంస్థానాలను+ పరిపాలించిన అహష్వేరోషు కాలంలో, 2 అహష్వేరోషు రాజు షూషను*+ కోటలోని* తన రాజ సింహాసనం మీద కూర్చున్న రోజుల్లో, 3 అతని పరిపాలనలోని మూడో సంవత్సరంలో, అతను తన అధిపతులందరికీ, సేవకులందరికీ గొప్ప విందు ఏర్పాటు చేశాడు. పారసీక-మాదీయ+ సైన్యం, ప్రముఖులు, సంస్థానాధిపతులు అతని ముందు ఉన్నారు. 4 అతను తన మహిమాన్విత రాజ్య సంపదను, తన ఘనతను, తన గొప్పతనపు వైభవాన్ని చాలా రోజులపాటు, అంటే 180 రోజులపాటు వాళ్లకు చూపించాడు. 5 ఆ రోజులు ముగిసిన తర్వాత, రాజు షూషను* కోటలో* ఉన్న గొప్పవాళ్ల నుండి సామాన్యుల వరకు అందరికీ రాజభవనం తోట ఆవరణలో ఏడురోజుల పాటు గొప్ప విందు ఏర్పాటు చేశాడు. 6 అక్కడ నార వస్త్రాలు, సన్నని నూలు వస్త్రాలు, సన్నని పోగులతో పేనిన తాళ్లు కట్టిన నీలిరంగు తెరలు, వెండి ఉంగరాల్లో ఊదారంగు ఉన్నితో చేసిన తాళ్లు, పాలరాతి స్తంభాలు; చలువరాళ్లు, పాలరాయి, ముత్యాలు, నలుపు రంగు చలువరాళ్లు పర్చిన దారిలో వెండిబంగారు ఆసనాలు* ఉన్నాయి.
7 అక్కడ బంగారు గిన్నెల్లో* ద్రాక్షారసాన్ని అందించారు, ప్రతీ గిన్నె మిగతావాటి కన్నా ప్రత్యేకమైనది, రాజు హోదాకు తగ్గట్టు రాజు తాగే ద్రాక్షారసాన్ని విస్తారంగా అందించారు. 8 తాగమని ఎవరూ అతిథుల్ని బలవంతపెట్టలేదు,* ఎందుకంటే అలా చేయకూడదనే నియమం ఇవ్వబడింది; ఎవరికి నచ్చినంత వాళ్లు తాగేలా ఏర్పాట్లు చేయమని రాజు తన రాజభవనంలోని అధికారులకు ఆజ్ఞాపించాడు.
9 వష్తి రాణి+ కూడా రాజైన అహష్వేరోషు రాజగృహంలో* స్త్రీల కోసం గొప్ప విందు ఏర్పాటు చేసింది.
10 ఏడో రోజున, అహష్వేరోషు రాజు ద్రాక్షారసం తాగి చాలా సంతోషంగా ఉన్నప్పుడు, అతను తన వ్యక్తిగత సేవకులైన ఏడుగురు ఆస్థాన అధికారుల్ని అంటే మెహూమాను, బిజ్తా, హర్బోనా,+ బిగ్తా, అబగ్తా, జేతరు, కర్కసులను పిలిచి 11 రాణిని తన ముందుకు తీసుకురమ్మని చెప్పాడు. అతను ప్రజలకు, అధిపతులకు వష్తి రాణి అందాన్ని చూపించాలనుకున్నాడు. అందుకే రాచ కిరీటం* ధరించుకొని రమ్మని వాళ్ల ద్వారా ఆమెకు కబురు పంపాడు. ఆమె చాలా అందగత్తె. 12 అయితే ఆస్థాన అధికారుల ద్వారా రాజు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అతని ముందుకు వెళ్లడానికి వష్తి రాణి తిరస్కరిస్తూ ఉంది. దాంతో రాజుకు చాలా కోపం వచ్చింది, అతను లోలోపల ఆగ్రహంతో రగిలిపోయాడు.
13 అప్పుడు రాజు ఇలాంటివాటి* విషయంలో లోతైన అవగాహన ఉన్న జ్ఞానులతో మాట్లాడాడు (రాజు తనకు సంబంధించిన దేని గురించైనా చట్టం విషయంలో, న్యాయపరమైన వివాదాల విషయంలో మంచి పట్టు ఉన్న వాళ్లందర్ని అలా సంప్రదించేవాడు. 14 కర్షెనా, షెతారు, అద్మాతా, తర్షీషు, మెరెసు, మర్సెనా, మెమూకాను అనేవాళ్లు అతనికి సన్నిహితులు. ఈ ఏడుగురు పారసీక-మాదీయ అధిపతులు,+ వీళ్లకు రాజు ముందుకు వెళ్లే ప్రత్యేక అవకాశం ఉండేది. వీళ్లు రాజ్యంలో అత్యున్నత స్థానాల్లో ఉండేవాళ్లు). 15 రాజు ఇలా అడిగాడు: “ఆస్థాన అధికారుల ద్వారా అహష్వేరోషు రాజు ఇచ్చిన ఆజ్ఞకు లోబడనందుకు వష్తి రాణిపై చట్టప్రకారం ఎలాంటి చర్య తీసుకోవాలి?”
16 అప్పుడు రాజు ముందు, అధిపతుల ముందు మెమూకాను ఇలా అన్నాడు: “వష్తి రాణి రాజుకు వ్యతిరేకంగా మాత్రమే కాదు, అహష్వేరోషు రాజు సంస్థానాలన్నిట్లో ఉన్న అధిపతులందరికీ, ప్రజలందరికీ వ్యతిరేకంగా తప్పు చేసింది.+ 17 ఎందుకంటే రాణి చేసిన దాని గురించి స్త్రీలందరికీ తెలిసిపోతుంది, అప్పుడు వాళ్లు తమ భర్తల్ని నీచంగా చూస్తూ, ‘అహష్వేరోషు రాజు వష్తి రాణిని తన ముందుకు తీసుకురమ్మని చెప్పాడు, కానీ ఆమె అలా వెళ్లడానికి తిరస్కరించింది’ అని అంటారు. 18 రాణి చేసిన దాని గురించి తెలిసిన పారసీక-మాదీయ అధిపతుల భార్యలు ఈరోజే రాజు అధిపతులందరితో ఆ విషయం గురించి మాట్లాడతారు. వాళ్లు తమ భర్తల్ని చాలా నీచంగా చూస్తారు, భర్తలకు వాళ్ల మీద విపరీతమైన కోపం వస్తుంది. 19 ఒకవేళ రాజు దృష్టికి మంచిదనిపిస్తే, అతను ఒక రాజాజ్ఞను జారీ చేయాలి, మార్చడానికి వీల్లేకుండా+ అది పారసీక-మాదీయ చట్టాల్లో రాయబడాలి. అదేంటంటే, వష్తి ఇంకెప్పుడూ అహష్వేరోషు రాజు ముందుకు రాకూడదు; రాజు ఆమె కన్నా మంచి స్త్రీని రాణిగా నియమించాలి. 20 రాజు పరిపాలనలోని సువిశాల సామ్రాజ్యమంతటా ఆ ఆజ్ఞ గురించి చాటించబడిన తర్వాత, గొప్పవాళ్ల నుండి సామాన్యుల వరకు స్త్రీలందరూ తమ భర్తల్ని గౌరవిస్తారు.”
21 ఆ ఆలోచన రాజుకు, అధిపతులకు నచ్చింది; దాంతో రాజు మెమూకాను చెప్పినట్టే చేశాడు. 22 కాబట్టి ప్రతీ భర్త తన ఇంటికి యజమానిగా* ఉండాలని, తన సొంత ప్రజల భాషలో మాట్లాడాలని రాజు తన రాజ సంస్థానాలన్నిటికీ వాటివాటి సొంత లిపిలో, ప్రతీ జనానికి వాళ్ల మాతృభాషలో ఉత్తరాలు పంపించాడు.+