యెహెజ్కేలు
3 తర్వాత ఆయన నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, నీ ముందు ఉన్నదాన్ని* తిను. నువ్వు ఈ గ్రంథపు చుట్టను తిని, వెళ్లి ఇశ్రాయేలు ఇంటివాళ్లతో మాట్లాడు.”+
2 కాబట్టి నేను నోరు తెరిచాను, ఆయన నాతో ఆ గ్రంథపు చుట్టను తినిపించాడు. 3 తర్వాత ఆయన నాతో, “మానవ కుమారుడా, నేను నీకు ఇస్తున్న ఈ గ్రంథపు చుట్టను తిని దానితో నీ కడుపు నింపుకో” అన్నాడు. నేను దాన్ని తిన్నాను, అది నా నోటికి తేనెలా తియ్యగా ఉంది.+
4 ఆయన నాతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, నువ్వు ఇశ్రాయేలు ఇంటివాళ్ల మధ్యకు వెళ్లి నా మాటలు వాళ్లకు చెప్పు. 5 నేను నిన్ను కష్టమైన భాష, తెలియని భాష మాట్లాడే ప్రజల దగ్గరికి కాదుగానీ ఇశ్రాయేలు ఇంటివాళ్ల దగ్గరికి పంపిస్తున్నాను. 6 నీకు అర్థంకాని కష్టమైన భాష, తెలియని భాష మాట్లాడే అనేక జనాల దగ్గరికి నిన్ను పంపట్లేదు. ఒకవేళ వాళ్ల దగ్గరికి నేను నిన్ను పంపిస్తే, వాళ్లు నువ్వు చెప్పేది వింటారు.+ 7 అయితే ఇశ్రాయేలు ఇంటివాళ్లు నువ్వు చెప్పేది వినరు, ఎందుకంటే నేను చెప్పేది వినడం వాళ్లకు ఇష్టం లేదు.+ ఇశ్రాయేలు ఇంటివాళ్లందరూ మొండివాళ్లు, కఠిన హృదయులు.+ 8 ఇదిగో! నేను నీ ముఖాన్ని వాళ్ల ముఖమంత కఠినంగా చేశాను, నీ నుదురును వాళ్ల నుదురంత కఠినంగా చేశాను.+ 9 నేను నీ నుదురును చెకుముకి రాయి కంటే గట్టిగా, వజ్రంలా చేశాను.+ వాళ్లకు భయపడకు, వాళ్ల ముఖాలు చూసి బెదిరిపోకు,+ ఎందుకంటే వాళ్లు తిరుగుబాటు చేసే ప్రజలు.”
10 ఆయన నాతో ఇంకా ఇలా అన్నాడు: “మానవ కుమారుడా, నేను నీకు చెప్పే మాటలన్నిటినీ మనసుపెట్టి విను. 11 చెరలో ఉన్న నీ ప్రజల మధ్యకు వెళ్లి వాళ్లతో మాట్లాడు.+ వాళ్లు విన్నా, వినకపోయినా,+ ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు’ అని చెప్పు.”
12 అప్పుడు ఒక శక్తి* నన్ను తీసుకెళ్లింది;+ నా వెనక ఒక గొప్ప స్వరం వినిపించింది, అది “యెహోవా మహిమకు ఆయన స్థలంలో స్తుతి కలగాలి” అని అంది. 13 ఆ జీవుల రెక్కలు ఒకదానికొకటి తాకుతున్న శబ్దం,+ వాటి పక్కనున్న చక్రాల శబ్దం,+ ఒక గొప్ప స్వరం నాకు వినిపించాయి. 14 ఆ శక్తి* నన్ను పట్టుకుని తీసుకెళ్తుండగా నేను దుఃఖంతో, కోపంతో వెళ్లాను; యెహోవా చెయ్యి నా మీద బలంగా ఉండిపోయింది. 15 కాబట్టి నేను కెబారు నది పక్కన+ తేలాబీబులో నివసిస్తున్న బందీలైన ప్రజల దగ్గరికి వెళ్లి, వాళ్లు నివసిస్తున్న చోటే ఉండిపోయాను; నేను నిర్ఘాంతపోయిన స్థితిలో+ ఏడురోజులు వాళ్ల మధ్య ఉన్నాను.
16 ఏడురోజుల తర్వాత యెహోవా వాక్యం నా దగ్గరికి వచ్చి ఇలా అంది:
17 “మానవ కుమారుడా, నేను నిన్ను ఇశ్రాయేలు ఇంటివాళ్లకు కావలివాడిగా నియమించాను;+ నువ్వు నా నోటి నుండి ఏదైనా మాట విన్నప్పుడు, నా హెచ్చరికను వాళ్లకు చెప్పాలి.+ 18 ‘నువ్వు ఖచ్చితంగా చనిపోతావు’ అని నేను దుష్టుడితో అన్నప్పుడు, నువ్వు అతన్ని హెచ్చరించకపోతే, అతను తన తప్పుడు మార్గం నుండి పక్కకుమళ్లి బ్రతికుండేలా+ అతనికి హెచ్చరిక చేయకపోతే, అతను దుష్టుడు కాబట్టి తన దోషాన్ని బట్టి చనిపోతాడు,+ కానీ అతని రక్తానికి నేను నిన్ను బాధ్యునిగా ఎంచుతాను.*+ 19 అయితే నువ్వు దుష్టుణ్ణి హెచ్చరించినా, అతను తన దుష్టత్వం నుండి, చెడ్డ మార్గం నుండి పక్కకు మళ్లకపోతే, అతను తన దోషాన్ని బట్టి చనిపోతాడు; నువ్వు మాత్రం తప్పకుండా నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు.+ 20 అయితే నీతిమంతుడు తన నీతిని విడిచిపెట్టి తప్పు* చేస్తే, నేను అతని మార్గంలో అడ్డంకుల్ని పెడతాను, అతను చనిపోతాడు.+ నువ్వు అతన్ని హెచ్చరించలేదు కాబట్టి అతను తన పాపాన్ని బట్టి చనిపోతాడు, అతని నీతికార్యాల్ని నేను గుర్తు చేసుకోను; అయితే అతని రక్తానికి నేను నిన్ను బాధ్యునిగా ఎంచుతాను.*+ 21 ఒకవేళ, పాపం చేయొద్దని నువ్వు నీతిమంతుణ్ణి హెచ్చరించినప్పుడు అతను పాపం చేయకుండా ఉంటే, అతను హెచ్చరిక స్వీకరించాడు కాబట్టి ఖచ్చితంగా బ్రతికుంటాడు;+ నువ్వు కూడా నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు.”
22 అక్కడ యెహోవా చెయ్యి నా మీదికి వచ్చింది. ఆయన నాతో, “లేచి, లోయ మైదానానికి వెళ్లు, అక్కడ నేను నీతో మాట్లాడతాను” అన్నాడు. 23 కాబట్టి నేను లేచి లోయ మైదానానికి వెళ్లాను. ఇదిగో! యెహోవా మహిమ అక్కడ ఉంది,+ అది కెబారు నది పక్కన నేను చూసిన మహిమలా ఉంది.+ దాన్ని చూసి నేను సాష్టాంగపడ్డాను. 24 అప్పుడు పవిత్రశక్తి నాలోకి ప్రవేశించి నన్ను నిలబెట్టింది;+ ఆయన నాతో ఇలా అన్నాడు:
“నువ్వు నీ ఇంట్లోకి వెళ్లి, తలుపులు వేసుకో. 25 మానవ కుమారుడా, నువ్వు వాళ్ల మధ్యకు వెళ్లకుండా వాళ్లు నిన్ను తాళ్లతో కట్టేస్తారు. 26 నేను నీ నాలుకను నీ అంగిలికి అంటుకుపోయేలా చేస్తాను; నువ్వు మూగవాడివి అవుతావు, వాళ్లను సరిదిద్దలేవు, ఎందుకంటే వాళ్లు తిరుగుబాటు చేసే ప్రజలు. 27 అయితే నేను నీతో మాట్లాడినప్పుడు నీ నోరు తెరుస్తాను, అప్పుడు నువ్వు వాళ్లతో, ‘సర్వోన్నత ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు’ అని చెప్పాలి.+ వినేవాళ్లను విననీ,+ విననివాళ్లను వినకపోనీ, ఎంతైనా వాళ్లు తిరుగుబాటు చేసే ప్రజలు.+