లూకా సువార్త
15 ఒక సందర్భంలో, పన్ను వసూలుచేసే వాళ్లు, పాపులు అందరూ యేసు మాటలు వినడానికి ఆయన చుట్టూ గుమికూడారు.+ 2 అప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు, “ఇతను పాపులతో కలిసిపోయి వాళ్లతో పాటు భోంచేస్తున్నాడు” అని గొణుక్కున్నారు. 3 కాబట్టి యేసు వాళ్లకు ఈ ఉదాహరణ* చెప్పాడు: 4 “మీలో ఎవరికైనా 100 గొర్రెలు ఉండి వాటిలో ఒకటి తప్పిపోతే, అతను మిగతా 99 గొర్రెల్ని ఎడారిలో విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రె దొరికే వరకు దాన్ని వెతకడానికి వెళ్లడా?+ 5 అది దొరికినప్పుడు, అతను దాన్ని భుజాల మీద వేసుకొని ఎంతో సంతోషిస్తాడు. 6 అతను ఇంటికి వచ్చినప్పుడు తన స్నేహితుల్ని, చుట్టుపక్కల వాళ్లను పిలిచి, ‘నాతో కలిసి సంతోషించండి. తప్పిపోయిన నా గొర్రె దొరికింది’+ అంటాడు. 7 అదేవిధంగా, పశ్చాత్తాపపడాల్సిన అవసరంలేని 99 మంది నీతిమంతుల కన్నా, పశ్చాత్తాపపడిన ఒక్క పాపి విషయంలో+ పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుందని నేను మీతో చెప్తున్నాను.
8 “అలాగే, ఏ స్త్రీకైనా పది వెండి నాణేలు* ఉండి వాటిలో ఒక నాణెం పోతే, ఆమె దీపం వెలిగించి, ఇల్లంతా ఊడ్చి, ఆ నాణెం దొరికే వరకు జాగ్రత్తగా వెతకదా? 9 ఆ నాణెం దొరికినప్పుడు ఆమె తన స్నేహితురాళ్లను, చుట్టుపక్కల వాళ్లను పిలిచి, ‘నాతో కలిసి సంతోషించండి. పోయిన నా వెండి నాణెం దొరికింది’ అంటుంది. 10 అదేవిధంగా, పశ్చాత్తాపపడే ఒక్క పాపి విషయంలో+ దేవదూతల మధ్య ఎంతో సంతోషం కలుగుతుందని నేను మీతో చెప్తున్నాను.”
11 తర్వాత ఆయన ఇలా చెప్పాడు: “ఒకతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 12 చిన్న కుమారుడు తండ్రితో, ‘నాన్నా, ఆస్తిలో నా వాటా నాకు ఇవ్వు’ అన్నాడు. దాంతో ఆ తండ్రి వాళ్లిద్దరికీ ఆస్తిని పంచి ఇచ్చాడు. 13 కొన్ని రోజుల తర్వాత ఆ చిన్న కుమారుడు తనకున్నదంతా పోగుచేసుకొని దూర దేశానికి వెళ్లాడు. అక్కడ విచ్చలవిడిగా జీవిస్తూ తన ఆస్తంతా దుబారా చేశాడు. 14 అతను మొత్తం ఖర్చు చేసిన తర్వాత, ఆ దేశమంతటా పెద్ద కరువు వచ్చింది. దాంతో అతని దగ్గర ఏమీ లేకుండా పోయింది. 15 చివరికి అతను ఆ దేశంలో ఒక వ్యక్తి దగ్గర పనిలో చేరాడు. ఆ వ్యక్తి అతన్ని పందుల్ని కాయడానికి తన పొలాల్లోకి పంపించాడు.+ 16 అతను పందుల మేతతో కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు, కానీ ఎవ్వరూ అతనికి ఏమీ ఇవ్వలేదు.
17 “అతనికి బుద్ధి వచ్చినప్పుడు ఇలా అనుకున్నాడు: ‘మా నాన్న దగ్గర ఎంతోమంది పనివాళ్లకు బోలెడంత ఆహారం ఉంది. నేనేమో ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను! 18 నేను లేచి, మా నాన్న దగ్గరికి వెళ్లి ఇలా అంటాను: “నాన్నా, నేను దేవునికీ* నీకూ విరుద్ధంగా పాపం చేశాను. 19 ఇక నీ కుమారుణ్ణని అనిపించుకునే అర్హత నాకు లేదు. నన్ను నీ పనివాళ్లలో ఒకడిగా పెట్టుకో.” ’ 20 తర్వాత అతను లేచి వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లాడు. అతను ఇంకా దూరంగా ఉన్నప్పుడే, వాళ్ల నాన్న అతన్ని చూసి, జాలిపడి, పరుగెత్తుకుంటూ వచ్చి అతన్ని కౌగిలించుకొని,* ఆప్యాయంగా ముద్దుపెట్టుకున్నాడు. 21 అప్పుడు ఆ చిన్న కుమారుడు వాళ్ల నాన్నతో, ‘నాన్నా, నేను దేవునికీ* నీకూ విరుద్ధంగా పాపం చేశాను.+ ఇక నీ కుమారుణ్ణని అనిపించుకునే అర్హత నాకు లేదు’ అన్నాడు. 22 కానీ ఆ తండ్రి తన దాసులతో ఇలా చెప్పాడు: ‘వెంటనే మీరు శ్రేష్ఠమైన వస్త్రం తెచ్చి ఇతనికి వేయండి, ఇతని చేతికి ఉంగరం పెట్టండి, కాళ్లకు చెప్పులు తొడగండి! 23 అలాగే, కొవ్విన దూడను తెచ్చి వధించండి. మనం విందు చేసుకుందాం, సంబరాలు జరుపుకుందాం. 24 ఎందుకంటే, నా కుమారుడు చనిపోయి బ్రతికాడు;+ తప్పిపోయి దొరికాడు.’ దాంతో వాళ్లు సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు.
25 “అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉన్నాడు. అతను తిరిగొస్తూ ఇంటికి దగ్గర్లో ఉన్నప్పుడు సంగీతం, నాట్యం చేస్తున్న శబ్దం వినిపించాయి. 26 కాబట్టి అతను ఒక సేవకుణ్ణి పిలిచి, ఏం జరుగుతోందని అడిగాడు. 27 ఆ సేవకుడు అతనితో, ‘మీ తమ్ముడు వచ్చాడు. అతను క్షేమంగా* తిరిగొచ్చినందుకు మీ నాన్న కొవ్విన దూడను వధించాడు’ అని చెప్పాడు. 28 దాంతో పెద్ద కుమారుడికి కోపమొచ్చి లోపలికి రానన్నాడు. అప్పుడు వాళ్ల నాన్న బయటికి వచ్చి అతన్ని లోపలికి రమ్మని బ్రతిమాలాడు. 29 కానీ అతను వాళ్ల నాన్నతో ఇలా అన్నాడు: ‘ఇదిగో! ఇన్ని సంవత్సరాలు నేను నీకు సేవ చేశాను. ఇప్పటివరకు ఒక్కసారి కూడా నీ మాట జవదాటలేదు. అయినా నా స్నేహితులతో కలిసి సంతోషించమని నువ్వెప్పుడూ నాకు ఒక మేకపిల్లను కూడా ఇవ్వలేదు. 30 కానీ వేశ్యలతో తిరిగి నీ ఆస్తంతా దుబారా చేసిన* నీ చిన్న కుమారుడు రాగానే అతని కోసం కొవ్విన దూడను వధించావు.’ 31 అప్పుడు తండ్రి అతనితో ఇలా అన్నాడు: ‘బాబూ, నువ్వెప్పుడూ నాతోనే ఉన్నావు. నావన్నీ నీవే కదా. 32 అయితే మనం ఇప్పుడు సంతోషించాలి, సంబరాలు చేసుకోవాలి. ఎందుకంటే, నీ తమ్ముడు చనిపోయి బ్రతికాడు; తప్పిపోయి దొరికాడు.’ ”