రూతు
1 న్యాయాధిపతుల* కాలంలో,+ దేశంలో కరువు వచ్చింది; అప్పుడు ఒకతను తన భార్యను, ఇద్దరు కుమారుల్ని తీసుకుని యూదాలోని బేత్లెహేము+ నుండి మోయాబు+ ప్రాంతానికి పరదేశిగా వెళ్లాడు. 2 అతని పేరు ఎలీమెలెకు,* అతని భార్య పేరు నయోమి,* అతని ఇద్దరు కుమారుల పేర్లు మహ్లోను,* కిల్యోను.* వాళ్లు యూదాలోని బేత్లెహేముకు చెందిన ఎఫ్రాతీయులు. వాళ్లు మోయాబు ప్రాంతానికి వెళ్లి అక్కడే నివసించారు.
3 కొంతకాలానికి నయోమి భర్త ఎలీమెలెకు చనిపోయాడు. ఇక ఆమెకు మిగిలింది, ఆమె ఇద్దరు కుమారులే. 4 తర్వాత వాళ్లిద్దరు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు; ఒకామె పేరు ఓర్పా, ఇంకొకామె పేరు రూతు.+ వాళ్లక్కడ దాదాపు పది సంవత్సరాలు ఉన్నారు. 5 ఆ తర్వాత నయోమి ఇద్దరు కుమారులు మహ్లోను, కిల్యోను కూడా చనిపోయారు. దాంతో ఆమెకు భర్తే కాదు, కుమారులు కూడా లేకుండా పోయారు. 6 కాబట్టి ఆమె తన ఇద్దరు కోడళ్లతో కలిసి మోయాబు ప్రాంతం నుండి బయల్దేరి తన సొంత దేశానికి తిరిగి ప్రయాణమైంది. ఎందుకంటే, యెహోవా మళ్లీ తన ప్రజల్ని ఆశీర్వదించి వాళ్లకు ఆహారం ఇస్తున్నాడని ఆమె మోయాబులో ఉన్నప్పుడు వింది.
7 ఆమె తన ఇద్దరు కోడళ్లతో కలిసి నివసిస్తున్న ప్రాంతాన్ని విడిచి బయల్దేరింది. వాళ్లు అలా నడుస్తూ యూదా దేశానికి వెళ్తున్నప్పుడు 8 నయోమి తన ఇద్దరు కోడళ్లతో ఇలా అంది: “మీరిద్దరూ మీ మీ తల్లుల ఇళ్లకు తిరిగెళ్లండి. చనిపోయిన మీ భర్తల పట్ల, నా పట్ల మీరు విశ్వసనీయ ప్రేమ చూపించినట్టే యెహోవా కూడా మీ పట్ల విశ్వసనీయ ప్రేమ చూపించాలి;+ 9 మీరిద్దరూ క్షేమంగా ఉండేలా* యెహోవా మీకు భర్తల్ని ఇవ్వాలి.”+ తర్వాత ఆమె వాళ్లను ముద్దుపెట్టుకుంది, వాళ్లు బిగ్గరగా ఏడ్చారు. 10 వాళ్లు ఆమెతో “లేదు, మేము నీతోపాటు నీ ప్రజల దగ్గరికి వస్తాం” అని అంటూ ఉన్నారు. 11 కానీ నయోమి వాళ్లతో ఇలా అంది: “నా కూతుళ్లారా, వెళ్లండి. మీరు నాతో రావడం దేనికి? మీకు భర్తల్ని ఇవ్వడానికి నేను ఇంకా పిల్లల్ని కనగలనా?+ 12 నా కూతుళ్లారా, వెళ్లండి. నేను చాలా ముసలిదాన్ని, నాది మళ్లీ పెళ్లి చేసుకునే వయసు కాదు. ఒకవేళ ఈ రాత్రే నాకు పెళ్లయి, కుమారులు పుట్టినా, 13 వాళ్లు పెద్దయ్యేంత వరకు మీరు ఎదురుచూస్తూ ఉంటారా? వాళ్ల కోసం మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఉంటారా? నా కూతుళ్లారా, వద్దు. మీ గురించి నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే, యెహోవా చెయ్యి నాకు విరోధంగా తిరిగింది.”+
14 మళ్లీ వాళ్లు బిగ్గరగా ఏడ్చారు. తర్వాత ఓర్పా తన అత్తను ముద్దుపెట్టుకుని వెళ్లిపోయింది. కానీ రూతు తన అత్తతోనే ఉండిపోయింది. 15 కాబట్టి నయోమి రూతుతో ఇలా అంది: “చూడు! నీ తోడికోడలు తన ప్రజల దగ్గరికి, తన దేవుళ్ల దగ్గరికి తిరిగెళ్లిపోయింది. నువ్వు కూడా ఆమెతోపాటు వెళ్లు.”
16 కానీ రూతు ఇలా అంది: “నిన్ను విడిచివెళ్లమని, నీతోపాటు రావద్దని నన్ను బ్రతిమాలొద్దు; నువ్వు ఎక్కడికి వెళ్తే నేనూ అక్కడికి వస్తాను, నువ్వు రాత్రి ఎక్కడ ఉంటే నేనూ అక్కడే ఉంటాను. నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు.+ 17 నువ్వు ఎక్కడ చనిపోతే నేనూ అక్కడే చనిపోతాను, అక్కడే పాతిపెట్టబడతాను. చావు తప్ప ఇంకేదైనా నీ నుండి నన్ను వేరుచేస్తే యెహోవా నన్ను తీవ్రంగా శిక్షించాలి.”
18 రూతు తనతోనే వస్తానని పట్టుబట్టడం చూసి నయోమి ఇక ఆమెను ఒప్పించే ప్రయత్నం మానుకుంది. 19 అప్పుడు వాళ్లిద్దరూ తమ ప్రయాణం కొనసాగించి బేత్లెహేముకు చేరుకున్నారు.+ వాళ్లు బేత్లెహేముకు రాగానే ఆ నగరమంతటా కలకలం మొదలైంది. అక్కడి స్త్రీలు, “ఈమె నయోమి కదా?” అని అంటూ ఉన్నారు. 20 నయోమి ఆ స్త్రీలతో ఇలా అంది: “నన్ను నయోమి* అని పిలవద్దు, మారా* అని పిలవండి. ఎందుకంటే, సర్వశక్తిమంతుడు నా జీవితాన్ని చేదుమయం చేశాడు.+ 21 నేను ఇక్కడి నుండి వెళ్లినప్పుడు నాకు అన్నీ ఉన్నాయి, కానీ యెహోవా నన్ను వట్టిచేతులతో తిరిగొచ్చేలా చేశాడు. యెహోవాయే నాకు విరోధి అయినప్పుడు, సర్వశక్తిమంతుడే నా మీదికి విపత్తు తీసుకొచ్చినప్పుడు+ ఇక మీరు నన్ను నయోమి అని పిలవడం దేనికి?”
22 ఇలా నయోమి మోయాబీయురాలైన తన కోడలు రూతుతో కలిసి మోయాబు ప్రాంతం+ నుండి తిరిగొచ్చేసింది. వాళ్లు బార్లీ కోత మొదలయ్యే సమయంలో+ బేత్లెహేముకు వచ్చారు.