సంఖ్యాకాండం
3 సీనాయి పర్వతం+ మీద యెహోవా మోషేతో మాట్లాడిన సమయానికి మోషే, అహరోనుల వంశస్థులు* వీళ్లే. 2 ఇవి అహరోను కుమారుల పేర్లు: మొదటి కుమారుడు నాదాబు, తర్వాత అబీహు,+ ఎలియాజరు,+ ఈతామారు.+ 3 ఇవి, యాజకులుగా సేవ చేయడానికి ప్రతిష్ఠించబడిన* అభిషిక్త యాజకులైన అహరోను కుమారుల పేర్లు.+ 4 అయితే నాదాబు, అబీహులు సీనాయి ఎడారిలో యెహోవా ముందు ఆయన ఆజ్ఞాపించని వేరే అగ్నితో ధూపం వేసి యెహోవా ముందే చనిపోయారు.+ వాళ్లకు కుమారులెవరూ లేరు. ఎలియాజరు,+ ఈతామారులు+ మాత్రం తమ తండ్రి అహరోనుతో పాటు యాజకులుగా సేవ చేస్తూనే ఉన్నారు.
5 తర్వాత యెహోవా మోషేకు ఇలా చెప్పాడు: 6 “లేవి గోత్రం+ వాళ్లను ముందుకు తీసుకొచ్చి, యాజకుడైన అహరోను ఎదుట నిలబెట్టు; వాళ్లు అతనికి పరిచారం చేస్తారు.+ 7 వాళ్లు గుడారానికి సంబంధించిన తమ సేవ చేస్తూ ప్రత్యక్ష గుడారం ముందు అతని విషయంలో, సమాజమంతటి విషయంలో తమ బాధ్యతల్ని నిర్వర్తించాలి. 8 వాళ్లు ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన ఉపకరణాలన్నిటినీ చూసుకోవాలి,+ అలాగే గుడారానికి సంబంధించిన సేవలు చేస్తూ ఇశ్రాయేలీయుల విషయంలో తమకున్న బాధ్యతల్ని నిర్వర్తించాలి.+ 9 నువ్వు లేవీయుల్ని అహరోనుకు, అతని కుమారులకు ఇవ్వాలి. వాళ్లు ఇశ్రాయేలీయుల్లో నుండి అతనికి ఇవ్వబడినవాళ్లు.+ 10 నువ్వు అహరోనును, అతని కుమారుల్ని నియమించాలి; వాళ్లు యాజకులుగా తమ విధుల్ని నిర్వర్తించాలి;+ వేరేవాళ్లు* ఎవరైనా పవిత్ర స్థలం దగ్గరికి వస్తే వాళ్లు చంపబడాలి.”+
11 యెహోవా మోషేకు ఇంకా ఇలా చెప్పాడు: 12 “నా విషయానికొస్తే, ఇదిగో! ఇశ్రాయేలీయుల మొదటి సంతానమంతటికి బదులుగా నేను ఇశ్రాయేలీయుల్లో నుండి లేవీయుల్ని తీసుకుంటున్నాను,+ లేవీయులు నావాళ్లు అవుతారు. 13 ఎందుకంటే, ప్రతీ మొదటి సంతానం నాదే.+ నేను ఐగుప్తు దేశంలోని ప్రతీ మొదటి సంతానాన్ని చంపిన రోజున,+ మనుషుల నుండి జంతువుల వరకు ఇశ్రాయేలులోని ప్రతీ మొదటి సంతానాన్ని నాకోసం ప్రతిష్ఠించుకున్నాను.+ అది నాది అవ్వాలి. నేను యెహోవాను.”
14 సీనాయి ఎడారిలో+ యెహోవా మోషేకు ఇంకా ఇలా చెప్పాడు: 15 “వాళ్లవాళ్ల పూర్వీకుల కుటుంబాల్ని బట్టి, వంశాల్ని బట్టి లేవీయుల్ని నమోదు చేయి. ఒక నెల, అంతకన్నా ఎక్కువ వయసున్న మగవాళ్లందర్నీ నువ్వు నమోదు చేయాలి.” 16 కాబట్టి మోషే యెహోవా ఆదేశం ప్రకారం వాళ్లను నమోదు చేశాడు. దేవుడు తనకు ఆజ్ఞాపించినట్టే అతను చేశాడు. 17 ఇవి లేవి కుమారుల పేర్లు: గెర్షోను, కహాతు, మెరారి.+
18 ఇవి వాళ్లవాళ్ల వంశాల ప్రకారం గెర్షోను కుమారుల పేర్లు: లిబ్నీ, షిమీ.
19 ఇవి వాళ్లవాళ్ల వంశాల ప్రకారం కహాతు కుమారుల పేర్లు: అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు.
20 ఇవి వాళ్లవాళ్ల వంశాల ప్రకారం మెరారి కుమారుల పేర్లు: మహలి,+ మూషి.
వాళ్లవాళ్ల పూర్వీకుల కుటుంబాల ప్రకారం లేవీయుల వంశాలు ఇవి.
21 లిబ్నీయుల వంశం, షిమీయుల వంశం గెర్షోను నుండి వచ్చాయి.+ వాళ్లు గెర్షోనీయుల వంశస్థులు. 22 వాళ్లలో ఒక నెల, అంతకన్నా ఎక్కువ వయసు ఉండి తమ పేరు నమోదైన మగవాళ్లందరి సంఖ్య 7,500.+ 23 గెర్షోనీయుల వంశస్థుల డేరాలు గుడారానికి వెనక,+ పడమటి వైపున ఉండేవి. 24 లాయేలు కుమారుడైన ఎలీయాసాపు, గెర్షోనీయుల పూర్వీకుల కుటుంబానికి ప్రధానుడు. 25 ప్రత్యక్ష గుడారంలో వీటిని చూసుకోవడం గెర్షోను వంశస్థుల బాధ్యత:+ గుడారం,+ దాని వేర్వేరు పైకప్పులు,+ ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం తెర,+ 26 ప్రాంగణంలో వేలాడే తెరలు,+ గుడారం చుట్టూ బలిపీఠం చుట్టూ ఉండే ప్రాంగణ ప్రవేశ ద్వారం తెర,+ దాని తాళ్లు, వీటికి సంబంధించిన సేవలన్నీ.
27 అమ్రామీయుల వంశం, ఇస్హారీయుల వంశం, హెబ్రోనీయుల వంశం, ఉజ్జీయేలీయుల వంశం కహాతు నుండి వచ్చాయి. వాళ్లు కహాతీయుల వంశస్థులు.+ 28 వాళ్లలో ఒక నెల, అంతకన్నా ఎక్కువ వయసున్న మగవాళ్లందరి సంఖ్య 8,600; పవిత్ర స్థలాన్ని చూసుకునే బాధ్యత వాళ్లమీద ఉండేది.+ 29 కహాతీయుల వంశస్థుల డేరాలు గుడారానికి దక్షిణం వైపున ఉండేవి.+ 30 ఉజ్జీయేలు+ కుమారుడైన ఎలీషాపాను, కహాతీయుల వంశస్థుల పూర్వీకుల కుటుంబానికి ప్రధానుడు. 31 మందసాన్ని,*+ బల్లను,+ దీపస్తంభాన్ని,+ ధూపవేదికను, బలిపీఠాన్ని,+ పవిత్ర స్థల సేవలో ఉపయోగించే పాత్రల్ని,+ తెరను,+ వీటికి సంబంధించిన సేవ అంతటినీ చూసుకునే బాధ్యత వాళ్లమీద ఉండేది.+
32 యాజకుడైన అహరోను కుమారుడు ఎలియాజరు,+ లేవీయుల ముఖ్య ప్రధానుడు; పవిత్ర స్థలానికి సంబంధించిన బాధ్యతలు నిర్వర్తించేవాళ్లను ఇతను పర్యవేక్షించేవాడు.
33 మహలీయుల వంశం, మూషీయుల వంశం మెరారి నుండి వచ్చాయి. వాళ్లు మెరారి వంశస్థులు.+ 34 వాళ్లలో ఒక నెల, అంతకన్నా ఎక్కువ వయసు ఉండి తమ పేరు నమోదైన మగవాళ్లందరి సంఖ్య 6,200.+ 35 అబీహాయిలు కుమారుడైన సూరీయేలు, మెరారి వంశస్థుల పూర్వీకుల కుటుంబానికి ప్రధానుడు. వాళ్ల డేరాలు గుడారానికి ఉత్తరం వైపున ఉండేవి.+ 36 వీటిని పర్యవేక్షించడం మెరారి వంశస్థుల బాధ్యత: గుడారపు చట్రాలు,*+ దాని అడ్డకర్రలు,+ దాని స్తంభాలు,+ దాని దిమ్మలు, దాని పాత్రలన్నీ,+ వాటికి సంబంధించిన సేవలన్నీ,+ 37 అలాగే ప్రాంగణం చుట్టూ ఉన్న స్తంభాలు, వాటి దిమ్మలు,+ వాటి మేకులు, వాటి తాళ్లు.
38 మోషే, అహరోను, అతని కుమారుల డేరాలు గుడారం ముందు తూర్పు వైపున ఉండేవి, అంటే సూర్యుడు ఉదయించే వైపున ప్రత్యక్ష గుడారానికి ఎదురుగా ఉండేవి. ఇశ్రాయేలీయుల తరఫున విధిగా పవిత్రమైన స్థలాన్ని చూసుకునే బాధ్యత వాళ్లమీద ఉండేది. వేరేవాళ్లు* ఎవరైనా దాని దగ్గరికి వస్తే వాళ్లు చంపబడతారు.+
39 లేవీయుల్లో ఒక నెల, అంతకన్నా ఎక్కువ వయసు ఉండి, యెహోవా ఆదేశం ప్రకారం వాళ్లవాళ్ల వంశాల్ని బట్టి మోషే, అహరోనులు నమోదు చేసిన మగవాళ్లందరి సంఖ్య 22,000.
40 తర్వాత యెహోవా మోషేకు ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలీయుల్లో ఒక నెల, అంతకన్నా ఎక్కువ వయసు ఉండి మొదట పుట్టిన మగవాళ్లందర్నీ నమోదు చేసి,+ లెక్కపెట్టి, వాళ్ల పేర్ల జాబితా తయారుచేయి. 41 ఇశ్రాయేలీయుల్లో మొదట పుట్టిన వాళ్లందరికి బదులుగా నాకోసం లేవీయుల్ని తీసుకోవాలి,+ అలాగే ఇశ్రాయేలీయుల పశువుల్లో మొదట పుట్టిన వాటన్నిటికి బదులుగా లేవీయుల పశువుల్ని తీసుకోవాలి.+ నేను యెహోవాను.” 42 అప్పుడు మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే, ఇశ్రాయేలీయుల్లో మొదట పుట్టిన వాళ్లందర్నీ నమోదు చేశాడు. 43 ఒక నెల, అంతకన్నా ఎక్కువ వయసు ఉండి తమ పేర్లు నమోదైన మొదట పుట్టిన మగవాళ్లందరి సంఖ్య 22,273.
44 యెహోవా మోషేకు ఇంకా ఇలా చెప్పాడు: 45 “ఇశ్రాయేలీయుల్లో మొదట పుట్టిన వాళ్లందరికి బదులుగా లేవీయుల్ని తీసుకో, అలాగే వాళ్ల పశువులకు బదులుగా లేవీయుల పశువుల్ని తీసుకో. లేవీయులు నావాళ్లు అవ్వాలి. నేను యెహోవాను. 46 అయితే ఇశ్రాయేలీయుల మొదటి సంతానంలో లేవీయుల కన్నా ఎక్కువున్న 273 మందిని+ విడిపించడానికి విమోచనా మూల్యంగా+ 47 పవిత్ర స్థల షెకెల్* కొలమానం ప్రకారం ఒక్కో వ్యక్తికి ఐదు షెకెల్‌ల* చొప్పున తీసుకోవాలి.+ ఒక షెకెల్ విలువ 20 గీరాలు.*+ 48 లేవీయుల కన్నా ఎక్కువున్న వాళ్లను విడిపించడానికి విమోచనా మూల్యంగా నువ్వు ఆ డబ్బును అహరోనుకు, అతని కుమారులకు ఇవ్వాలి.” 49 కాబట్టి మోషే లేవీయుల కన్నా ఎక్కువున్న వాళ్లను విడిపించడానికి విమోచనా మూల్యంగా ఆ డబ్బు తీసుకున్నాడు. 50 అతను పవిత్ర స్థల షెకెల్ కొలమానం ప్రకారం ఇశ్రాయేలీయుల మొదటి సంతానం దగ్గర ఆ డబ్బును, అంటే 1,365 షెకెల్‌లను తీసుకున్నాడు. 51 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే, యెహోవా నోటి మాట ప్రకారం మోషే ఆ విమోచనా మూల్యాన్ని అహరోనుకు, అతని కుమారులకు ఇచ్చాడు.