రాజులు మొదటి గ్రంథం
2 దావీదు చనిపోయే సమయం దగ్గరపడినప్పుడు, అతను తన కుమారుడు సొలొమోనుకు ఈ నిర్దేశాలు ఇచ్చాడు: 2 “నేను చనిపోబోతున్నాను,* కాబట్టి నువ్వు నిబ్బరంగా,+ ధైర్యంగా ఉండు.+ 3 మోషే ధర్మశాస్త్రంలో రాయబడినట్టు, నువ్వు నీ దేవుడైన యెహోవా మార్గాల్లో నడుస్తూ, ఆయన శాసనాల్ని, ఆజ్ఞల్ని, తీర్పుల్ని, జ్ఞాపికల్ని పాటిస్తూ ఆయనకు లోబడాలి;+ అప్పుడే నువ్వు ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్లినా విజయం సాధిస్తావు.* 4 ‘నీ కుమారులు తమ నిండు హృదయంతో, నిండు ప్రాణంతో* నా ముందు నమ్మకంగా నడుచుకుంటూ,+ తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉంటే, ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చునే ఒక వ్యక్తి నీ రాజవంశంలో ఎప్పుడూ ఉంటాడు’+ అని యెహోవా నా విషయంలో చేసిన తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాడు.
5 “సెరూయా కుమారుడైన యోవాబు నాకు, ఇశ్రాయేలు ఇద్దరు సైన్యాధిపతులకు అంటే నేరు కుమారుడైన అబ్నేరుకు,+ యెతెరు కుమారుడైన అమాశాకు+ ఏమి చేశాడో నీకు బాగా తెలుసు. అతను యుద్ధం లేని సమయంలో వాళ్లను చంపి, రక్తం చిందించాడు;+ అతను తన నడుముకు ఉన్న దట్టీమీద, తన కాళ్లకున్న చెప్పులమీద రక్తం మరకలు అంటించుకున్నాడు. 6 నువ్వు నీ తెలివిని ఉపయోగించు, అతని నెరసిన వెంట్రుకల్ని ప్రశాంతంగా సమాధిలోకి* వెళ్లనివ్వొద్దు.+
7 “అయితే నువ్వు గిలాదుకు చెందిన బర్జిల్లయి+ కుమారుల మీద విశ్వసనీయ ప్రేమ చూపించాలి, నీ బల్ల దగ్గర భోజనం చేసేవాళ్లలో వాళ్లూ ఉండాలి. ఎందుకంటే నేను నీ సహోదరుడైన అబ్షాలోము నుండి పారిపోయినప్పుడు+ వాళ్లు నాకు మద్దతిచ్చారు.+
8 “బహూరీముకు చెందిన గెరా అనే బెన్యామీనీయుడి కుమారుడైన షిమీ కూడా నీకు దగ్గర్లో నివసిస్తున్నాడు. నేను మహనయీముకు వెళ్తున్న రోజున+ అతను నన్ను తీవ్రంగా శపించాడు;+ అయితే అతను యొర్దాను దగ్గర నన్ను కలవడానికి వచ్చినప్పుడు, ‘నేను నిన్ను కత్తితో చంపను’ అని యెహోవా పేరున అతనికి ప్రమాణం చేశాను.+ 9 ఇప్పుడు అతన్ని శిక్షించకుండా వదలొద్దు;+ నువ్వు తెలివిగలవాడివి, అతనికి ఏం చేయాలో నీకు తెలుసు. నువ్వు అతని నెరసిన వెంట్రుకల్ని రక్తంతో సమాధిలోకి* పంపించాలి.”+
10 తర్వాత దావీదు చనిపోయాడు,* అతన్ని దావీదు నగరంలో పాతిపెట్టారు.+ 11 దావీదు ఇశ్రాయేలు మీద పరిపాలించిన కాలం 40 సంవత్సరాలు. అతను హెబ్రోనులో+ 7 సంవత్సరాలు, యెరూషలేములో 33 సంవత్సరాలు పరిపాలించాడు.+
12 తర్వాత సొలొమోను తన తండ్రైన దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు, అతని రాజరికం అంతకంతకూ స్థిరపర్చబడింది.+
13 కొంతకాలానికి, హగ్గీతు కుమారుడైన అదోనీయా, సొలొమోను తల్లియైన బత్షెబ దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆమె, “నువ్వు మంచి ఉద్దేశంతోనే వస్తున్నావా?” అని అడిగింది; అతను, “అవును” అన్నాడు. 14 తర్వాత అతను, “నేను నీకో మాట చెప్పాలి” అన్నాడు. ఆమె, “చెప్పు” అంది. 15 అతను ఇలా చెప్పాడు: “రాజరికం నాకు రావాల్సిందని నీకు బాగా తెలుసు, అంతేకాదు నేను రాజు అవుతానని ఇశ్రాయేలీయులందరూ అనుకున్నారు;+ కానీ రాజరికం నాకు కాకుండా, నా సహోదరునికి దక్కింది. ఎందుకంటే యెహోవాయే అతనికి రాజరికాన్ని ఇచ్చాడు.+ 16 కానీ ఇప్పుడు నేను నిన్ను ఒకేఒక్క కోరిక కోరుతున్నాను, దాన్ని కాదనొద్దు.” అందుకు ఆమె, “అడుగు” అంది. 17 అతను, “షూనేమీయురాలైన అబీషగును+ నాకు భార్యగా ఇవ్వమని దయచేసి సొలొమోను రాజును అడుగు, అతను నీ మాట కాదనడు” అన్నాడు. 18 దానికి బత్షెబ, “మంచిది! నీ గురించి రాజుతో మాట్లాడతాను” అంది.
19 కాబట్టి బత్షెబ, అదోనీయా గురించి మాట్లాడడానికి సొలొమోను రాజు దగ్గరికి వెళ్లింది. రాజు వెంటనే, ఆమెను కలుసుకోవడానికి లేచి వంగి నమస్కారం చేశాడు. అతను సింహాసనం మీద కూర్చొని, తన తల్లి తన కుడివైపున కూర్చునేలా ఆమె కోసం ఒక సింహాసనం వేయించాడు. 20 అప్పుడు బత్షెబ, “నేను నిన్ను ఒక చిన్న కోరిక కోరతాను, కాదనకు” అంది. అందుకు రాజు, “అమ్మా అడుగు, నీ మాట కాదనను” అన్నాడు. 21 ఆమె, “షూనేమీయురాలైన అబీషగును నీ సహోదరుడు అదోనీయాకు భార్యగా ఇవ్వు” అని అడిగింది. 22 అప్పుడు సొలొమోను తన తల్లితో, “నువ్వు అదోనీయా కోసం షూనేమీయురాలైన అబీషగును ఎందుకు అడుగుతున్నావు? అతను నా అన్న+ కాబట్టి నువ్వు అతని కోసం రాజరికం కూడా అడగవచ్చు కదా?+ పైగా యాజకుడైన అబ్యాతారు, సెరూయా కుమారుడైన యోవాబు+ కూడా అతనికి మద్దతిస్తున్నారు”+ అన్నాడు.
23 తర్వాత సొలొమోను రాజు యెహోవా పేరున ఇలా ప్రమాణం చేశాడు: “అదోనీయా ఇలా అడిగినందుకు అతను తన ప్రాణాలు కోల్పోకపోతే దేవుడు నన్ను తీవ్రంగా శిక్షించాలి. 24 తాను వాగ్దానం చేసినట్టుగా, నా తండ్రైన దావీదు సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టి, నా పరిపాలనను స్థిరపర్చి,+ నా కోసం ఒక రాజవంశాన్ని కట్టిన+ యెహోవా జీవం తోడు, అదోనీయా ఈ రోజు చంపబడతాడు.”+ 25 వెంటనే రాజైన సొలొమోను యెహోయాదా కుమారుడైన బెనాయాను+ పంపించాడు; అతను వెళ్లి అదోనీయా మీద దాడిచేశాడు, దాంతో అతను చనిపోయాడు.
26 తర్వాత, రాజు యాజకుడైన అబ్యాతారుతో,+ “నువ్వు అనాతోతులోని+ నీ పొలాల దగ్గరికి వెళ్లిపో! నువ్వు చావాల్సిన వాడివి. కానీ నువ్వు నా తండ్రి దావీదు ఎదుట సర్వోన్నత ప్రభువైన యెహోవా మందసాన్ని* మోశావు,+ నా తండ్రి కష్టాలన్నిట్లో పాలుపంచుకున్నావు+ కాబట్టి ఈ రోజు నేను నిన్ను చంపను” అన్నాడు. 27 షిలోహులో+ ఏలీ ఇంటికి వ్యతిరేకంగా వచ్చిన యెహోవా మాటను+ నెరవేర్చడం కోసం, సొలొమోను అబ్యాతారును యెహోవా యాజకునిగా ఉండకుండా వెళ్లగొట్టాడు.
28 జరిగినదంతా యోవాబుకు తెలిసినప్పుడు అతను యెహోవా గుడారానికి+ పారిపోయి, బలిపీఠం కొమ్ముల్ని పట్టుకున్నాడు. యోవాబు అబ్షాలోముకు మద్దతివ్వలేదు+ కానీ అదోనీయాకు మద్దతిచ్చాడు.+ 29 “యోవాబు యెహోవా గుడారానికి పారిపోయాడు, అతను అక్కడ బలిపీఠం పక్కన ఉన్నాడు” అని రాజైన సొలొమోనుకు తెలిసింది. కాబట్టి అతను యెహోయాదా కుమారుడైన బెనాయాను పంపించి, “వెళ్లి అతన్ని చంపు” అని చెప్పాడు. 30 దాంతో బెనాయా యెహోవా గుడారం దగ్గరికి వెళ్లి యోవాబుతో, “రాజు ఆజ్ఞాపిస్తున్నాడు, బయటికి రా” అన్నాడు. కానీ అతను, “లేదు, నేనిక్కడే చనిపోతాను” అన్నాడు. అప్పుడు బెనాయా రాజు దగ్గరికి తిరిగెళ్లి, యోవాబు మాటల్ని అతనికి చెప్పాడు. 31 అప్పుడు రాజు అతనితో ఇలా చెప్పాడు: “అతను చెప్పినట్టే చేయి; అతన్ని చంపి పాతిపెట్టు; అతను సరైన కారణం లేకుండా చిందించిన రక్తాన్ని+ నా మీద నుండి, నా తండ్రి ఇంటి మీద నుండి తీసేయి. 32 యెహోవా అతని చావుకు* అతన్నే బాధ్యునిగా ఎంచుతాడు; ఎందుకంటే అతను తనకన్నా నీతిమంతులైన, ఉత్తములైన ఇద్దర్ని, అంటే ఇశ్రాయేలు సైన్యాధిపతీ నేరు కుమారుడూ+ అయిన అబ్నేరును,+ యూదా సైన్యాధిపతీ యెతెరు కుమారుడూ+ అయిన అమాశాను+ నా తండ్రి దావీదుకు తెలియకుండా కత్తితో చంపాడు. 33 వాళ్ల రక్తం విషయంలో యోవాబు, అతని వంశస్థులు ఎల్లప్పుడూ బాధ్యులుగా ఉండాలి;*+ కానీ యెహోవా ఇచ్చే శాంతి నిరంతరం దావీదుతో, అతని వంశస్థులతో, అతని రాజవంశంతో, అతని సింహాసనంతో ఉండాలి.” 34 అప్పుడు యెహోయాదా కుమారుడైన బెనాయా వెళ్లి, యోవాబు మీద దాడిచేసి అతన్ని చంపాడు, అతన్ని ఎడారిలోని* అతని ఇంట్లో పాతిపెట్టారు. 35 తర్వాత రాజు, యోవాబు స్థానంలో యెహోయాదా కుమారుడైన బెనాయాను+ సైన్యాధిపతిగా, అబ్యాతారు స్థానంలో సాదోకును+ యాజకునిగా నియమించాడు.
36 తర్వాత రాజు షిమీని+ పిలిపించి ఇలా చెప్పాడు: “యెరూషలేములో ఒక ఇల్లు కట్టుకొని అక్కడే నివసించు; అక్కడి నుండి వేరే ఏ ప్రాంతానికీ వెళ్లొద్దు. 37 నువ్వు ఏ రోజైతే బయటికి వెళ్లి కిద్రోను లోయ+ దాటుతావో, ఆ రోజే ఖచ్చితంగా చనిపోతావు. నీ చావుకు* నువ్వే బాధ్యుడివి అవుతావు.” 38 అందుకు షిమీ రాజుతో, “నా ప్రభువైన రాజా, నువ్వు చెప్పింది బాగానే ఉంది, నువ్వు చెప్పినట్టే నీ సేవకుడు చేస్తాడు” అన్నాడు. కాబట్టి షిమీ చాలారోజుల పాటు యెరూషలేములోనే ఉన్నాడు.
39 కానీ మూడు సంవత్సరాల చివర్లో, షిమీకి చెందిన ఇద్దరు దాసులు పారిపోయి, గాతు రాజైన మయకా కుమారుడు ఆకీషు+ దగ్గరికి వెళ్లారు. “ఇదిగో! నీ దాసులు గాతులో ఉన్నారు” అని ఎవరో షిమీకి చెప్పినప్పుడు, 40 షిమీ వెంటనే తన గాడిద మీద జీను* వేసుకుని, తన దాసుల్ని వెదకడానికి గాతులోని ఆకీషు దగ్గరికి వెళ్లాడు. షిమీ తన దాసులతో పాటు గాతు నుండి తిరిగొచ్చినప్పుడు, 41 సొలొమోనుకు, “షిమీ యెరూషలేము నుండి గాతుకు వెళ్లి, తిరిగొచ్చాడు” అని వార్త అందింది. 42 అప్పుడు రాజు షిమీని పిలిపించి ఇలా అన్నాడు: “ ‘ఏ రోజైతే నువ్వు ఇక్కడి నుండి వేరే ప్రాంతానికి వెళ్తావో, ఆ రోజే ఖచ్చితంగా చనిపోతావు’ అని నేను నిన్ను హెచ్చరించి, యెహోవా పేరున నీతో ఒట్టు వేయించాను కదా? నువ్వు అప్పుడు, ‘నువ్వు చెప్పింది బాగానే ఉంది, నేను అలాగే చేస్తాను’ అని అన్నావు కదా?+ 43 మరైతే, నువ్వు యెహోవా ముందు వేసిన ఒట్టును, నేను నీకు ఇచ్చిన ఆజ్ఞను ఎందుకు మీరావు?” 44 రాజు షిమీతో ఇంకా ఇలా అన్నాడు: “నువ్వు నా తండ్రైన దావీదుకు చేసిన హాని అంతటి గురించి నీకు బాగా తెలుసు,+ యెహోవా ఆ హానిని నీ తల మీదికే తిరిగి రప్పిస్తాడు.+ 45 కానీ యెహోవా సొలొమోను రాజును ఆశీర్వదించి,+ దావీదు సింహాసనాన్ని నిరంతరం స్థిరపరుస్తాడు.” 46 అప్పుడు రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు ఆజ్ఞ ఇవ్వడంతో అతను వెళ్లి షిమీ మీద దాడిచేసి అతన్ని చంపాడు.+
ఆ విధంగా సొలొమోను పరిపాలనలో రాజ్యం స్థిరపడింది.+