హెబ్రీయులు
5 మనుషుల్లో నుండి తీసుకోబడిన ప్రతీ ప్రధానయాజకుడు దేవునికి సంబంధించిన విషయాల్లో ప్రజల తరఫున సేవచేయడానికి నియమించబడతాడు;+ అతను కానుకల్ని, పాపాల కోసం బలుల్ని అర్పిస్తాడు.+ 2 అతనికి కూడా బలహీనతలు ఉంటాయి కాబట్టి, తెలియక తప్పుచేసే* వాళ్లతో అతను సున్నితంగా* వ్యవహరించగలుగుతాడు. 3 అతనికీ బలహీనతలు ఉంటాయి కాబట్టి ఇతరుల పాపాల కోసం బలులు అర్పించినట్టే తన పాపాల కోసం కూడా అతను బలులు అర్పించాలి.+
4 ఒక వ్యక్తి తనంతట తానే ప్రధానయాజకుడు అవ్వలేడు. బదులుగా, అహరోనును నియమించినట్టు దేవుడే అతన్ని ఆ స్థానంలో నియమించాలి.+ 5 అలాగే క్రీస్తు కూడా తనంతట తానే ప్రధానయాజకుడు అవ్వలేదు, తనను తానే మహిమపర్చుకోలేదు.+ కానీ ఆయనతో, “నువ్వు నా కుమారుడివి; ఈ రోజు నేను నీకు తండ్రిని అయ్యాను” అని అన్న దేవుడే+ ఆయన్ని మహిమపర్చాడు. 6 దేవుడు మరోచోట ఇలా కూడా అన్నాడు: “నువ్వు మెల్కీసెదెకు లాంటి యాజకుడివి, నువ్వు ఎప్పటికీ యాజకుడిగా ఉంటావు.”+
7 క్రీస్తు భూమ్మీద ఉన్నప్పుడు, తనను మరణం నుండి కాపాడగల దేవునికి కన్నీళ్లతో బిగ్గరగా అభ్యర్థనలు, విన్నపాలు చేశాడు;+ ఆయనకున్న దైవభయం వల్ల దేవుడు ఆయన ప్రార్థనలు విన్నాడు. 8 ఆయన దేవుని కుమారుడే అయినా, తాను పడిన బాధల వల్ల విధేయత నేర్చుకున్నాడు.+ 9 ఆయన పూర్తిగా అర్హుడయ్యాక,*+ తనకు లోబడే వాళ్లందరికీ శాశ్వత రక్షణను+ ఇచ్చే బాధ్యత ఆయనకు అప్పగించబడింది. 10 ఎందుకంటే దేవుడు ఆయన్ని మెల్కీసెదెకు లాంటి ప్రధానయాజకునిగా నియమించాడు.+
11 ఆయన* గురించి చెప్పాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ అర్థంచేసుకునే మీ సామర్థ్యం మందగించింది కాబట్టి మీకు వివరించడం కష్టం. 12 ఈపాటికి* మీరు బోధకులుగా ఉండాల్సినవాళ్లు. కానీ దేవుని సందేశాల గురించిన ప్రాథమిక బోధల్ని ఇంకొకరు మళ్లీ మొదటినుండి మీకు నేర్పించాల్సి వస్తోంది;+ మీరు మళ్లీ పాలు తాగే స్థితికి వచ్చారు, గట్టి ఆహారం తినే స్థితిలో లేరు. 13 ఎప్పటికీ పాలే తాగేవాళ్లకు నీతి వాక్యం తెలీదు, ఎందుకంటే వాళ్లు ఇంకా పసిపిల్లలే.+ 14 అయితే గట్టి ఆహారం పరిణతిగల వాళ్ల కోసం. అలాంటివాళ్లు తమ వివేచనా సామర్థ్యాల్ని ఉపయోగిస్తూ వాటికి శిక్షణ ఇచ్చుకున్నారు. దానివల్ల వాళ్లు తప్పొప్పులను గుర్తించగలుగుతారు.