11 దొంగ త్రాసు యెహోవాకు అసహ్యం,
సరైన తూకంరాళ్లను చూసి ఆయన సంతోషిస్తాడు.+
2 అహంకారం వెనకే అవమానం వస్తుంది,+
అయితే అణకువ గలవాళ్ల దగ్గర తెలివి ఉంటుంది.+
3 నిజాయితీపరుల యథార్థత వాళ్లను నడిపిస్తుంది,+
మోసగాళ్ల కపటం వాళ్లను నాశనం చేస్తుంది.+
4 ఉగ్రత రోజున ఆస్తి ఎందుకూ పనికిరాదు,+
అయితే నీతి మరణం నుండి కాపాడుతుంది.+
5 నిందలేనివాళ్ల నీతి వాళ్ల మార్గాన్ని తిన్నగా చేస్తుంది,
కానీ దుష్టులు తమ దుష్టత్వం వల్ల పడిపోతారు.+
6 నిజాయితీపరుల నీతి వాళ్లను కాపాడుతుంది,+
మోసగాళ్లు తమ కోరికల్లో తామే చిక్కుకుపోతారు.+
7 దుష్టుడు చనిపోయినప్పుడు అతని ఆశ నశించిపోతుంది;
అతని శక్తిని నమ్ముకొని పెట్టుకున్న ఆశలు కూడా నశించిపోతాయి.+
8 నీతిమంతుడు కష్టాల నుండి తప్పించబడతాడు,
దుష్టుడు అతని స్థానంలోకి వస్తాడు.+
9 భక్తిహీనుడు తన నోటితో పొరుగువాణ్ణి నాశనం చేస్తాడు,
కానీ నీతిమంతుడు జ్ఞానం వల్ల తప్పించుకుంటాడు.+
10 నీతిమంతుల మంచితనం వల్ల నగరం సంతోషిస్తుంది,
దుష్టులు నాశనమైనప్పుడు ప్రజలు సంతోషంతో కేకలు వేస్తారు.+
11 నిజాయితీపరుల దీవెన వల్ల నగరం గొప్పదౌతుంది,+
అయితే దుష్టుల నోరు దాన్ని కూలగొడుతుంది.+
12 వివేచన లేనివాడు తన పొరుగువాణ్ణి నీచంగా చూస్తాడు,
నిజమైన వివేచన ఉన్నవాడు మౌనంగా ఉంటాడు.+
13 లేనిపోనివి కల్పించి చెప్పేవాడు రహస్యాలు బయటపెడుతుంటాడు,+
కానీ నమ్మదగినవాడు రహస్యాలు దాచిపెడతాడు.
14 తెలివిగల నిర్దేశం లేనప్పుడు ప్రజలు నాశనమౌతారు,
సలహాదారులు ఎక్కువమంది ఉంటే విజయం లభిస్తుంది.+
15 పరిచయం లేనివాడి అప్పుకు హామీగా ఉండే వ్యక్తి ఖచ్చితంగా నష్టపోతాడు,+
అయితే ఒప్పందం చేసుకోని వ్యక్తి సురక్షితంగా ఉంటాడు.
16 దయగల స్త్రీ ఘనత పొందుతుంది;+
కానీ దయలేనివాళ్లు సంపదల్ని దోచుకుంటారు.
17 దయగలవాడు తన ప్రాణానికి మేలు చేసుకుంటాడు,+
క్రూరుడు తన మీదికి తానే హాని తెచ్చుకుంటాడు.+
18 దుష్టుడి సంపాదన మోసకరమైనది,+
కానీ నీతిని విత్తేవాడు నిజమైన ప్రతిఫలం పొందుతాడు.+
19 నీతి పక్షాన స్థిరంగా నిలబడేవాడు జీవం పొందుతాడు,+
చెడు వెనక పరుగెత్తేవాడు మరణం పొందుతాడు.
20 కపట హృదయం గలవాళ్లు యెహోవాకు అసహ్యం,+
నిందలేకుండా నడుచుకునేవాళ్లను చూసి ఆయన సంతోషిస్తాడు.+
21 ఈ మాట మీద నమ్మకం ఉంచు: చెడ్డవాళ్లకు తప్పకుండా శిక్షపడుతుంది,+
అయితే నీతిమంతుల పిల్లలు తప్పించుకుంటారు.
22 వివేచన లేకుండా నడుచుకునే అందమైన స్త్రీ
పంది ముక్కుకు ఉన్న బంగారు పోగు లాంటిది.
23 నీతిమంతుల కోరిక మంచికి దారితీస్తుంది,+
కానీ దుష్టుల ఆశ ఉగ్రతకు నడిపిస్తుంది.
24 ఒక వ్యక్తి ఉదారంగా ఇస్తాడు, అయినా వృద్ధి పొందుతాడు;+
ఇంకో వ్యక్తి ఇవ్వాల్సింది కూడా ఇవ్వడు, అయినా పేదవాడౌతాడు.+
25 ఉదారంగా ఇచ్చేవాళ్లు వర్ధిల్లుతారు,+
ఇతరుల్ని సేదదీర్చే వాళ్లు తాము కూడా సేదదీర్పు పొందుతారు.+
26 ధాన్యం బిగబట్టేవాణ్ణి ప్రజలు శపిస్తారు,
ధాన్యం అమ్మేవాణ్ణి వాళ్లు దీవిస్తారు.
27 మంచి చేయడానికి శ్రద్ధగా ప్రయత్నించేవాడు దయ పొందడానికి ప్రయత్నిస్తున్నాడు,
చెడు చేయాలని చూసేవాడికి ఖచ్చితంగా చెడే జరుగుతుంది.+
28 సంపదల్ని నమ్ముకునేవాడు నాశనమౌతాడు,+
నీతిమంతుడు చిగురాకులా వర్ధిల్లుతాడు.+
29 ఇంట్లోవాళ్లకు సమస్యలు తెచ్చేవాడు గాలిని సంపాదించుకుంటాడు,+
తెలివిలేనివాడు తెలివిగలవాడికి సేవకుడౌతాడు.
30 నీతిమంతుల ఫలం జీవవృక్షం,+
ఇతరుల్ని గెలుచుకునేవాడు తెలివిగలవాడు.+
31 భూమ్మీద నీతిమంతుడే ప్రతిఫలం పొందితే,
దుష్టుడు, పాపి ఇంకెంతగా ప్రతిఫలం పొందుతారో కదా!+