రెండో యోహాను
1 దేవుడు ఎంచుకున్న సహోదరికి,* ఆమె పిల్లలకు వృద్ధుడు* రాస్తున్న ఉత్తరం. నేను మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాను. నేనే కాదు, సత్యం తెలుసుకున్న వాళ్లంతా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. 2 ఇప్పుడు మనలో ఉన్న, ఎప్పుడూ మనతో ఉండే సత్యం వల్లే మేము మిమ్మల్ని ప్రేమించగలుగుతున్నాం. 3 తండ్రైన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు చూపించే అపారదయ, కరుణ, శాంతితో పాటు సత్యం, ప్రేమ మనకు తోడుంటాయి.
4 తండ్రి మనకు ఆజ్ఞాపించినట్టే, నీ పిల్లల్లో కొందరు సత్యంలో నడుస్తున్నారని తెలుసుకుని నేను చాలా సంతోషిస్తున్నాను.+ 5 కాబట్టి సహోదరీ, నేను కోరేదేమిటంటే, మనం ఒకరినొకరం ప్రేమించుకోవాలి. (నేను నీకు రాస్తున్న ఈ ఆజ్ఞ కొత్తదేమీ కాదు, మొదటి నుండీ ఉన్నదే.)+ 6 మనం తండ్రి ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ ఉండడమే ప్రేమించడం.+ మీరు మొదటి నుండి విన్నది ఈ ఆజ్ఞనే, ఈ ఆజ్ఞ ప్రకారమే మీరు నడుచుకుంటూ ఉండాలి. 7 ఎందుకంటే, లోకంలో చాలామంది మోసగాళ్లు బయల్దేరారు,+ వాళ్లు యేసుక్రీస్తు మనిషిగా వచ్చాడని ఒప్పుకోరు.+ అలా ఒప్పుకోని వ్యక్తే మోసగాడు, క్రీస్తువిరోధి.+
8 మేము కష్టపడి సాధించినవాటిని మీరు పోగొట్టుకోకుండా ఉండేలా, పూర్తి బహుమతి పొందేలా జాగ్రత్తగా ఉండండి.+ 9 ఎవరైనా క్రీస్తు బోధల్ని అనుసరించకుండా వేరేలా బోధిస్తే, అతనికి దేవుని ఆమోదం ఉండదు.+ కానీ ఎవరైతే క్రీస్తు బోధల్ని అనుసరిస్తూ ఉంటారో అతనికి తండ్రి ఆమోదం, కుమారుడి ఆమోదం ఉంటాయి.+ 10 ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఆ బోధలకు అనుగుణంగా బోధించకపోతే, అతన్ని మీ ఇంట్లోకి రానివ్వకండి,+ అతన్ని పలకరించకండి. 11 ఎందుకంటే, అతన్ని పలకరించే వ్యక్తి అతని చెడ్డపనులకు మద్దతు ఇచ్చినట్టే.
12 నేను మీకు రాయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ ఇలా కాగితం మీద సిరాతో రాయాలని అనుకోవట్లేదు. అయితే మీ సంతోషం ఎక్కువయ్యేలా మీ దగ్గరికి వచ్చి ముఖాముఖిగా మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను.
13 దేవుడు ఎంచుకున్న నీ సహోదరి పిల్లలు నీకు శుభాకాంక్షలు చెప్తున్నారు.