రాజ్య ప్రచారకుల నివేదిక
డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో యౌవనస్థులు దేవుడ్ని స్తుతిస్తున్నారు
శతాబ్దాల క్రితం, నిత్యత్వం యొక్క రాజును స్తుతించేందుకు కీర్తన రచయిత యౌవనస్థులను వాత్సల్యపూర్వకంగా ఆహ్వానిస్తూ ఇలా అన్నాడు: “యౌవనులు కన్యలు వృద్ధులు బాలురు . . . యెహోవా నామమును స్తుతించుదురు గాక. ఆయన నామము మహోన్నతమైన నామము.” (కీర్తన 148:12, 13) డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని ఈ క్రింది అనుభవాలు ఈ అసమానమైన ఆధిక్యతను ఉన్నతపరుస్తాయి.
• ఒక ప్రత్యేక పయినీర్ ఉండే ఇంటి యజమాని యెహోవాసాక్షుల సత్ప్రవర్తనను చూసినప్పుడు ఆయనకు చాలా మంచి అభిప్రాయం కలిగింది. అలా ఆయన తన ఐదేళ్ళ కూతురు ఫీఫీతో బైబిలు పఠించేందుకు సాక్షులను అనుమతించాడు. నా బైబిలు కథల పుస్తకముa పఠించాక ఫీఫీ సాధించిన పురోగతిని గమనించిన తర్వాత రాజ్య మందిరంలో కూటాలకు హాజరయ్యేందుకు ఆమె తండ్రి ఆమెను అనుమతించాడు. అక్కడ, చిన్నారి ఫీఫీ సాక్షుల పాటలపుస్తకం నుండి రాజ్య గీతాలను నేర్చుకుంది. ముఖ్యంగా, “పరదైసును గూర్చిన దేవుని వాగ్దానం” అనే శీర్షిక ఉన్న నాల్గవ పాటను తాను ఎక్కువ ఇష్టపడింది.
ఒక రోజు ఫీఫీ తండ్రి ఆమెను తమ చర్చికి తీసుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. చర్చిలో ఫీఫీ చర్చి పాటలను పాడడానికి నిరాకరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకు నిరాకరించింది? ఎందుకంటే, తన తండ్రి వెళ్ళే చర్చిలోని పాటలు తాను బైబిలు పఠనం నుండి నేర్చుకున్న వాటికి అనుగుణ్యంగా లేవని ఆమె భావించింది. ఆమె ధైర్యంగా చర్చి పాటలకు బదులు తనకిష్టమైన రాజ్య గీతాన్ని పాడింది.
ఆమె మనస్సు మార్చేందుకు అనేక విఫల ప్రయత్నాలు చేసిన తర్వాత, ఐదేండ్ల ఫీఫీని బహిష్కరించాలని చర్చి నాయకులు నిర్ణయించుకున్నారు! వాళ్ళు అంత నీచంగా వ్యవహరించినప్పటికీ, ఆమె తండ్రి మౌనం పాటించాడు. ఫీఫీ తాను నమ్మిన విషయంలో దృఢంగా నిలబడడం వల్ల ఆయన గర్వించాడు. ఫీఫీ యెహోవాసాక్షులతో సహవసించడంలో కొనసాగాలని ఆమె తల్లిదండ్రులిరువురూ కోరుకున్నారు.
• కౌమార ప్రాయంలో ఉన్న లుకోడి అనే అబ్బాయి యెహోవాసాక్షులతో బైబిలు పఠించాలని నిర్ణయించుకున్నాడు. ఆయన తండ్రి చాలా వ్యతిరేకించాడు. లుకోడి రాజ్య మందిరంలో కూటానికి హాజరయ్యేందుకు సిద్ధమౌతున్న ఒక సందర్భంలో వాళ్ళ నాన్న అతనిని కత్తి చూపించి బెదిరించాడు. మరో సందర్భంలో, లుకోడి తండ్రి అతనిని కర్రతో కొట్టి, అతని వీపు మీద లోతైన గాయం కలిగించాడు. తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ, యెహోవాసాక్షుల్లో ఒకరు కావాలన్న తన తీర్మానంలో లుకోడి దృఢంగా ఉన్నాడు. అతడు పురోగతిని సాధించాడు. ఆ తర్వాత బాప్తిస్మం పొందాడు. ఆయన ఇప్పుడు క్రమ పయినీర్‌గా సేవ చేస్తున్నాడు.
లుకోడి చెల్లెలు సోనా తన అన్న నిలుకడగా ఉండడాన్ని చూసి ఎంతో ముగ్ధురాలై, తను కూడా యెహోవాసాక్షులతో బైబిలు పఠనాన్ని ఆరంభించింది. అయితే సోనా పఠనాన్ని ఆపేందుకు ఆమె తండ్రి ఆమెను సాక్షులు లేని మరో గ్రామంలోని పాఠశాలలో చేర్చాడు. అయితే, తాను నేర్చుకున్న విషయాలను గురించి ఇతరులతో మాట్లాడడాన్ని సోనా అలవాటు చేసుకుంది. దాని ఫలితంగా, వాళ్ళ పిన్ని కూతురు కూడా ఆసక్తి చూపింది.
పొరుగు గ్రామంలోని సాక్షులు సోనా ప్రకటనా పనిని గురించి విన్నప్పుడు, వాళ్ళు ఆమెను సందర్శించి, ఆమె కోసం క్రమమైన ఒక గృహ బైబిలు పఠనాన్ని ఏర్పాటు చేశారు. ఆమె పురోగతి సాధిస్తూ వచ్చింది. త్వరలోనే సమర్పించుకున్న, బాప్తిస్మం తీసుకున్న యెహోవాసాక్షిగా తన అన్నతో కలిసింది. అంతేకాక, వాళ్ళ పిన్ని కూతురు ఇప్పుడు బాప్తిస్మం పొందని ప్రచారకురాలైంది. ఆ గ్రామంలో పుస్తక పఠనం కూడా నిర్వహించబడుతోంది.
యౌవనస్థులు యెహోవా నామాన్ని స్తుతించడంలో చేరడం ఎంతో ఆశ్చర్యకరంగాను, నూతన ఉత్సాహాన్ని కలిగించేదిగాను ఉంటుంది!
[అధస్సూచీలు]
a వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ప్రచురించినది.