కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w08 1/15 పేజీ 29-పేజీ 31 పేరా 5
  • మత్తయి పుస్తకంలోని ముఖ్యాంశాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మత్తయి పుస్తకంలోని ముఖ్యాంశాలు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “పరలోకరాజ్యము సమీపించియున్నది”
  • (మత్త. 1:1-20:34)
  • ‘మనుష్యకుమారుడు అప్పగింపబడును’
  • (మత్త. 21:1-28:20)
  • “గడియ వచ్చియున్నది!”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2000
  • మార్కు పుస్తకం నుండి ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • యోహాను సువార్తలోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • లూకా సువార్తలోని ముఖ్యాంశాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
w08 1/15 పేజీ 29-పేజీ 31 పేరా 5

యెహోవా వాక్యము సజీవమైనది

మత్తయి పుస్తకంలోని ముఖ్యాంశాలు

యేసు జీవితం, పరిచర్య గురించిన ఉత్తేజకరమైన వృత్తాంతాన్ని మొదటిగా రాసింది మత్తయే. ఆయన యేసుక్రీస్తుకు సన్నిహితుడు. ఆయన ఒకప్పుడు సుంకరిగా పనిచేశాడు. ముందుగా హెబ్రీలో రాయబడి ఆ తర్వాత గ్రీకులోకి అనువదించబడిన మత్తయి సువార్త దాదాపు సా.శ. 41లో పూర్తి చేయబడింది. అది హెబ్రీ లేఖనాలకు, గ్రీకు లేఖనాలకు మధ్య వారధిలా పనిచేస్తుంది.

ప్రాముఖ్యంగా యూదులను ఉద్దేశించి రాయబడిన ఈ సువార్త హృదయాలను కదిలించేవిధంగా, అర్థవంతంగా రాయబడింది. ఇది యేసును వాగ్దాత్త మెస్సీయగా, దేవుని కుమారునిగా వర్ణిస్తోంది. దీనిలోని సందేశాన్ని శ్రద్ధగా చదవడం ద్వారా సత్యదేవునిపై, ఆయన కుమారునిపై, ఆయన వాగ్దానాలపై మనకున్న విశ్వాసం బలపడుతుంది.​—హెబ్రీ. 4:12.

“పరలోకరాజ్యము సమీపించియున్నది”

(మత్త. 1:1-20:34)

మత్తయి సంఘటనల్ని ఖచ్చితంగా కాలక్రమానుసారంగా రాయలేకపోయినా రాజ్యాన్ని, యేసు బోధలను నొక్కిచెప్పాడు. ఉదాహరణకు, యేసు తన పరిచర్య మొదలుపెట్టి దాదాపు సంవత్సరమైన తర్వాతే కొండమీది ప్రసంగాన్నిచ్చినా అది సువార్త ప్రారంభంలోనే కనిపిస్తుంది.

యేసు గలిలయలో పరిచర్య చేస్తుండగా అద్భుతాలను చేశాడు, 12 మంది అపొస్తలులకు పరిచర్య గురించి ఆదేశాలిచ్చాడు, పరిసయ్యుల దుష్టత్వాన్ని బహిరంగంగా ఖండించాడు, రాజ్యానికి సంబంధించిన వివిధ అంశాలను నొక్కిచెప్పే ఉపమానాలను చెప్పాడు. ఆ తర్వాత ఆయన గలిలయ నుండి “యొర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతములకు” వచ్చాడు. (మత్త. 19:1) దారిలో యేసు తన శిష్యులతో, ‘మనం యెరూషలేమునకు వెళ్లుచున్నాము, అక్కడ మనుష్యకుమారునికి మరణశిక్ష విధిస్తారు, మూడవ దినమున ఆయన మరల లేస్తాడు’ అని చెప్పాడు.​—మత్త. 20:18, 19.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

3:16​—యేసు బాప్తిస్మం తీసుకునే సమయంలో ‘ఆకాశము’ ఏ భావంలో ‘తెరవబడింది’? యేసు పరలోకంలోని తన మానవపూర్వ జీవితాన్ని గుర్తుచేసుకున్నాడు అనడానికి అది సూచనగా ఉండవచ్చు.

5:21, 22​—కోపాన్ని మనసులో ఉంచుకోవడంకన్నా దానిని వెళ్లగ్రక్కడం మరింత గంభీరమైందా? తన సహోదరునిపై కోపాన్ని మనసులో ఉంచుకునే వ్యక్తి ఘోరమైన పాపం చేస్తున్నాడని యేసు హెచ్చరించాడు. అయితే, అవమానకరంగా మాట్లాడడం ద్వారా కోపాన్ని వెళ్లగ్రక్కడం మరింత గంభీరమైనది. అలా కోపాన్ని వెళ్లగ్రక్కే వ్యక్తి స్థానిక న్యాయసభలో కాక మరింత ఉన్నతమైన మహాసభలో లెక్క అప్పజెప్పుకోవాల్సి వస్తుంది.

5:48​—“[మన] పరలోకపు తండ్రి పరిపూర్ణుడు” అయినట్లే మనం కూడా “పరిపూర్ణులుగా” ఉండడం నిజంగా సాధ్యమేనా? పరిమితంగా అది సాధ్యమే. యేసు ఈ సందర్భంలో ప్రేమ గురించి మాట్లాడుతూ తన శ్రోతలు ప్రేమించడంలో దేవుణ్ణి అనుకరించాలని చెప్పాడు. దేవునిలాగే వారు కూడా పరిపూర్ణమైన, సమగ్రమైన ప్రేమను చూపించాలి. (మత్త. 5:43-47) ఎలా? తమ శత్రువులను కూడా ప్రేమించడం ద్వారా.

7:16​—ఎలాంటి “ఫలములు” సత్యమైన మతాన్ని సూచిస్తాయి? ఈ ఫలాల్లో మన ప్రవర్తన మాత్రమేకాక మన నమ్మకాలు, మనం అనుసరించే బోధలు కూడా ఉన్నాయి.

10:34-38​—కుటుంబంలో విభేదాలకు లేఖనాధారిత సందేశమే కారణమా? ముమ్మాటికీ కాదు. బదులుగా, అవిశ్వాసులైన కుటుంబ సభ్యుల అభిప్రాయాల కారణంగానే విభేదాలు ఏర్పడతాయి. వారు క్రైస్తవత్వాన్ని తృణీకరించాలనో లేదా వ్యతిరేకించాలనో నిర్ణయించుకుని కుటుంబం విభేదాలకు కారణమౌతారు.​—లూకా 12:51-53.

11:2-6​—దేవుడు ఆమోదిస్తూ పలికిన మాటలను విన్న యోహానుకు యేసే మెస్సీయ అని ముందే తెలిసుంటే, మరి “రాబోవు వాడవు నీవేనా” అని ఆయన యేసును ఎందుకు అడిగాడు? యేసు నుండే స్వయంగా ధృవీకరించుకునేందుకు యోహాను బహుశా ఆ ప్రశ్న అడిగివుండవచ్చు. అంతేకాక, ‘మరి యొకరు’ రాజ్యాధికారంతో వచ్చి యూదులు ఆశలన్నింటినీ తీరుస్తాడేమో యోహాను తెలుసుకోవాలనుకున్నాడు. యేసు ఇచ్చిన సమాధానం నుండి మరింకెవరూ రాబోవడం లేదని తెలిసింది.

19:28​—తీర్పుతీర్చబడే “ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములు” ఎవరిని సూచిస్తున్నాయి? అవి ఆధ్యాత్మిక ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలను సూచించడం లేదు. (గల. 6:16; ప్రక. 7:4-8) యేసు మాట్లాడుతున్న అపొస్తలులు ఆ ఆధ్యాత్మిక ఇశ్రాయేలులో భాగంగా ఉండబోతున్నారు, అంతేకానీ దాని సభ్యులకు న్యాయధిపతులుగా కాదు. యేసు వారికి ‘రాజ్యాన్ని నియమించాడు,’ వారు ‘దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను’ ఉంటారు. (లూకా 22:28-30; ప్రక. 5:9, 10) ఆధ్యాత్మిక ఇశ్రాయేలుకు చెందినవారు ‘లోకానికి తీర్పు తీరుస్తారు.’ (1 కొరిం. 6:2) కాబట్టి పరలోక సింహాసనాలపై కూర్చున్నవారు తీర్పుతీర్చే “ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములు” రాజరిక, యాజక వర్గానికి చెందినవారు కాదు. ప్రాయశ్చిత్తార్థ దినాన సమకూడే 12 గోత్రాలవారు ఎలా యాజక వర్గానికి చెందినవారు కాదో అలాగే వీరు కూడా దానికి చెందినవారు కాదు.​—లేవీ. 16వ అధ్యాయం.

మనకు పాఠాలు:

4:1-10. సాతాను దుష్టగుణం కాదుగానీ, ఒక నిజమైన వ్యక్తి అని ఈ వృత్తాంతం మనకు బోధిస్తోంది. మనల్ని శోధించేందుకు అతడు “శరీరాశయు నేత్రాశయు జీవపుడంబమును” ఉపయోగిస్తాడు. అయితే లేఖనాధారిత సూత్రాలను అన్వయించుకోవడం, మనం దేవునిపట్ల నమ్మకంగా నిలిచివుండడానికి సహాయం చేస్తుంది.​—1 యోహా. 2:16.

5:1-7:29. దేవునితో మంచి సంబంధం కలిగివుండాల్సిన అవసరతను గుర్తించండి. సమాధానపరులుగా ఉండండి. అనైతిక ఆలోచనలను మదిలోకి రానీయకండి. మీ మాట నిలబెట్టుకోండి. ప్రార్థిస్తున్నప్పుడు భౌతిక విషయాలకన్నా ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యతనివ్వండి. దేవునిపట్ల ధనవంతులుగా ఉండండి. దేవుని రాజ్యానికి, ఆయన నీతికి మొదటిస్థానమివ్వండి. ఇతరులను విమర్శించేవారిగా ఉండకండి. దేవుని చిత్తాన్ని చేయండి. కొండమీది ప్రసంగంలో ఎంతటి ఆచరణాత్మకమైన పాఠాలు ఉన్నాయో కదా!

9:37, 38. “కోతకు పనివారిని పంపుమని” మనం యజమానికి చేసిన విన్నపానికి అనుగుణంగా పనిచేస్తూ శిష్యులను చేసే పనిలో చురుగ్గా పాల్గొనాలి.​—మత్త. 28:19, 20.

10:32, 33. మన నమ్మకాల గురించి ఇతరులతో మాట్లాడడానికి ఎప్పుడూ భయపడకూడదు.

13:51, 52. రాజ్య సత్యాలు అర్థం చేసుకున్న తర్వాత ఆ ప్రాముఖ్యమైన సత్యాలను ఇతరులకు బోధిస్తూ, వాటిని గ్రహించేలా వారికి సహాయంచేసే బాధ్యత మనపై ఉంటుంది.

14:12, 13, 23. ఉపయోగకరమైన విషయాలను ధ్యానించడానికి ఏకాంతంగా ఉండడం ప్రాముఖ్యం.​—మార్కు 6:46; లూకా 6:12.

17:20. మన ఆధ్యాత్మిక ప్రగతిని అడ్డుకునే కొండల్లాంటి అడ్డంకులను అధిగమించడానికి, కష్టాలను తాళుకునేందుకు మనకు విశ్వాసం అవసరం. యెహోవాపై, ఆయన వాగ్దానాలపై మన విశ్వాసాన్ని పెంచుకుని, బలపర్చుకునే విషయాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు.​—మార్కు 11:23; లూకా 17:6.

18:1-4; 20:20-28. మానవ అపరిపూర్ణతవల్ల, హోదాకు ప్రాధాన్యతనిచ్చే మతానికి చెందినవారు కావడంవల్ల యేసు శిష్యులు గొప్పహోదా గురించి అతిగా చింతించారు. పాపభరిత ఆలోచనలకు తావివ్వకుండా ఉండడానికి, సంఘంలో మనకున్న సేవా అవకాశాలు, ప్రత్యేక బాధ్యతల విషయంలో సరైన దృక్కోణాన్ని కాపాడుకునేందుకు మనం వినయాన్ని అలవర్చుకోవాలి.

‘మనుష్యకుమారుడు అప్పగింపబడును’

(మత్త. 21:1-28:20)

యేసు సా.శ. 33, నీసాను 9వ తేదీన “గాడిదను ఎక్కి” యెరూషలేములోకి వెళతాడు. (మత్త. 21:5) మరుసటి రోజు ఆయన దేవాలయంలో ప్రవేశించి అక్కడ క్రయవిక్రయం చేస్తున్నవారిని వెళ్లగొడతాడు. నీసాను 11న ఆయన దేవాలయంలో బోధించి, శాస్త్రులను పరిసయ్యులను ఖండిస్తాడు. ఆ తర్వాత ఆయన తన శిష్యులకు ‘[తన] రాకడకును యుగసమాప్తికిని సూచనలను’ ఇచ్చాడు. (మత్త. 24:3) మరుసటి రోజు ఆయన వారితో, “రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్యకుమారుడు సిలువవేయబడుటకై అప్పగింపబడుననియు” చెప్పాడు.​—మత్త. 26:1, 2.

అది నీసాను నెల 14వ రోజు. యేసు తాను ఎదుర్కోబోయే మరణానికి సంబంధించిన జ్ఞాపకార్థ ఆచరణను ప్రారంభించిన తర్వాత, ఆయన అప్పగించబడి, బంధించబడి, న్యాయవిచారణ చేయబడి, చంపబడ్డాడు. మూడవరోజున ఆయన మృతుల్లోనుండి లేపబడ్డాడు. పునరుత్థానం చేయబడిన యేసు పరలోకానికి ఆరోహణమయ్యే ముందు తన శిష్యులకు “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అని ఆజ్ఞాపించాడు.​—మత్త. 28:19.

లేఖనాధారిత ప్రశ్నలకు సమాధానాలు:

22:3, 4, 9​—పెండ్లి విందుకు మూడుసార్లు పిలుపులు ఎప్పుడు ఇవ్వబడ్డాయి? యేసు, ఆయన అనుచరులు సా.శ. 29లో ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు పెండ్లి కుమార్తె తరగతివారిని సమకూర్చే మొదటి పిలుపు ఇవ్వబడింది. అది సా.శ. 33 వరకు కొనసాగింది. రెండవ పిలుపు సా.శ. 33లో పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు ఇవ్వబడింది. అది సా.శ. 36 వరకు కొనసాగింది. ఈ రెండుసార్లు కేవలం యూదులకు, యూదామత ప్రవిష్టులకు, సమరయులకే పిలుపు ఇవ్వబడింది. అయితే, రాజమార్గాల్లో ఉన్న ప్రజలకు అంటే సున్నతిపొందని యూదేతరులకు ఇవ్వబడిన మూడవ పిలుపు, రోమా సైన్యాధిపతి అయిన కొర్నేలీ క్రైస్తవుడైన సంవత్సరం అంటే సా.శ. 36లో మొదలై మన కాలంవరకు కొనసాగింది.

23:15​—పరిసయ్యుల మతప్రవిష్టుడు లేదా మతం మార్చుకున్న వ్యక్తి ఎందుకు పరిసయ్యులకన్నా “రెండంతలు నరక [‘గెహెన్నా,’ NW] పాత్రునిగా” ఉంటాడు? పరిసయ్యుల మతప్రవిష్టులైన కొందరు గతంలో ఘోరమైన పాపాలు చేసివుండవచ్చు. అయితే తీవ్రవాద పరిసయ్యుల మతంలోకి మారడం ద్వారా వారు ఖండించబడిన తమ బోధకులకన్నా మరింత కఠినంగా, నీచంగా తయారైవుండవచ్చు. అలా వారు యూదామత పరిసయ్యులకన్నా రెండింతలు ‘గెహెన్నాపాత్రులుగా’ ఉంటారు.

27:3-5​—యూదా ఏ భావంలో పశ్చాత్తాపపడ్డాడు? యూదాలో నిజమైన పశ్చాత్తాపానికి సంబంధించిన ఏ ఆనవాలు కనిపించలేదు. అతను దేవుణ్ణి క్షమాపణ అడిగే బదులు తన తప్పును ప్రధాన యాజకుల ముందు, పెద్దల ముందు ఒప్పుకున్నాడు. “మరణకరమైన పాపము” చేశాడు కాబట్టి యూదాకు సరిగానే అపరాధ భావన, ఆందోళన కలిగాయి. (1 యోహా. 5:16) అతడు తానుచేసిన పాపం విషయంలో తీవ్రంగా దుఃఖించినందువల్ల కాదుగానీ తాను నిరాశాజనకమైన పరిస్థితుల్లో ఉన్నందునే మనస్సు నొచ్చుకున్నాడు.

మనకు పాఠాలు:

21:28-31. మనం ఆయన చిత్తం చేస్తున్నామనేదే యెహోవాకు ప్రాముఖ్యం. ఉదాహరణకు, మనం రాజ్య ప్రకటనా పనిలో, శిష్యులను చేసే పనిలో చురుగ్గా పాల్గొనాలి.​—మత్త. 24:14; 28:19, 20.

22:37-39. దేవుడు తనను ఆరాధించేవారి నుండి ఏమి కోరుతున్నాడో ఆ రెండు ఆజ్ఞలు ఎంత సంక్షిప్తంగా వివరిస్తున్నాయో కదా!

[31వ పేజీలోని చిత్రం]

మీరు కోతపనిలో చురుగ్గా పాల్గొంటున్నారా?

[చిత్రసౌజన్యం]

© 2003 BiblePlaces.com

[31వ పేజీలోని చిత్రం]

మత్తయి రాజ్యాన్ని నొక్కిచెప్పాడు

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి