ఆత్మీయ సంపదలను ఇతరులతో పంచుకొనుము
1 విశ్వాసియైన మోషేవలెనె ఆత్మీయ సంపదల విలువతో ఐహిక సంపదలు సరిపోలవని ఆధునిక కాలములోని యెహోవాసాక్షులు యెరిగియున్నారు. (హెబ్రీ. 11:26) ఒకవేళ ధనము గృహములను, కారులను, మరి ఇతర ఆస్తులను కొనగలిగినను జీవము, మానసిక శాంతి, లేక యెహోవా దేవుని అంగీకారము మరియు ఆశీర్వాదములను మాత్రము కొనలేదు.
2 దేవుని వాక్యము ఆయన సంకల్పముయొక్క జ్ఞానము, గ్రహింపులు నిజమైన ఆత్మీయ సంపదలైయున్నవి. (కొలొ. 2:3) ఈ అద్వితీయ సంపదలు ప్రస్తుతము నిజమైన ఆనందమును, భవిష్యుత్తు కొరకు స్థిరమైన నిరీక్షణను తేగలవు. అటువంటి ఆత్మీయ సంపదలను కలిగియున్నందుకు మనమెంతటి దయాపాత్రులము!
ఇతరులను ఐశ్వర్యవంతులుగా చేయుట ఎట్లు
3 ఇతరులనెంతో మందిని ది వాచ్‌టవర్ పత్రికకు పరిచయమొనర్చుట ద్వారా వారు ఆత్మీయముగా ధనవంతులగునట్లు సహాయపడగలము. ఎందుకనగా అది వారిని దైవిక జ్ఞానమనే ‘దాచబడిన నిధి’ యొద్దకు నడుపును. (సామె. 2:4) జూన్ మాసములో తగిన ప్రతి అవకాశమందును వాచ్‌టవర్ పత్రికకు మనము చందాలను అందించుము. ది వాచ్‌టవర్ ఎట్లు మన జీవితములను సంపన్నవంతము చేసినదో గుర్తు చేసుకొనిన, ఆ పత్రికను అందించుటకు వెనుదీయక సాధ్యమైనంతమందికి దానినందించు మార్గములను అన్వేషించుదుము. (సామె. 3:27) పత్రికలను, బ్రొషూరులను విడిగా అందించినచోట వారిని విడువక అనుసరించుట, పత్రికలను క్రమముగా అందించుటకు నీ స్వంత మార్గమేర్పరచుకొనుటయను ఉద్దేశ్యముతో వారి చిరునామాలు వ్రాసుకొనుము.
4 ఆత్మీయభావములో, తనకు కలిగిన విలువైన వాటిని విస్తారముగా పంచిన కీర్తన 112 లోని దైవభయముగల వ్యక్తినిపోలి మనమెట్లుండగలము? (కీర్తన 112:1, 3, 9) గొర్రెవంటివారిని వెదకి, వారి ఆత్మీయావసరత తీర్చబడులాగున సహాయము చేయవలసియున్నాము. (మత్త. 5:3) దీనిని నెరవేర్చుటకు మనకెదురయ్యెడి ప్రతి అవకాశమును సాధారణ మరియు తటస్థ సాక్ష్యమిచ్చుటకు వినియోగించుట అవసరమైయున్నది.
5 కొన్ని ప్రాంతములలో సాయంకాలపు సాక్ష్యము ఎక్కువ ఫలవంతమైనదిగా యుండును. ఎందుకనగా ఎక్కువమంది ప్రజలు ఆ సమయములో తమ గృహములలో ఉందురు. మీ సంఘ పుస్తకపఠనమునకు ముందు లేక వారములో ఏదైనా ఒక సాయంత్రము ఒక గంట లేక అంతకు మించి యింటింటి సేవచేయుటకు ప్రయత్నించితివా? ఆ విధముగా చేయుటకు ఖచ్చితమైన ఏర్పాటులెందుకు చేసికొనకూడదు? అది నీకెంతో ప్రతిఫలదాయకం కావచ్చును.
6 నీవు పనిచేయుచోట సాక్ష్యమిచ్చుటకు అనువైన వేళలు కనుగొనెదవా? ఒక సహోదరి తన తోటిపనివారు చూచునట్లుగా పెక్కు పత్రికలను తన బల్లపై ఉంచినది. ఉదయకాలము గడుచు సమయానికి ఆ పత్రికలన్ని అందించబడినవి. ఆమె తోటిపనివారు చాలామంది నిజమైన ఆసక్తిని చూపారు. 18 చందాలను కూడ ఆ సహోదరి పొందగలిగింది.
7 యెహోవా సంస్థనుండియు మన బైబిలు పఠనము నుండియు మనము పొందిన ఆత్మీయజ్ఞానము, గ్రహింపులతో భౌతికసంపదలైన వెండి, బంగారము, ఇతరనిధులు ఏవియును సాటిరావు. నిజమైన సంతోషము, మనోహరమైన మార్గములు, సమాధానము, “దీర్ఘాయువు” చివరకు నిత్యజీవము కూడ అట్టి ఆత్మీయ సంపదలు వెదకువారికి సాధ్యమగును. (సామె. 3:13-18) మన ఆత్మీయ సంపదలను యితరులతో పంచుకొనుట ద్వారా మనము పొందియున్న దానియెడల మెప్పును చూపుదుము. యెహోవా దేవుని యెడతెగని ఆశీర్వాదమును పొందుదుము.—సామె. 19:17.