పురుషులు చేరుకొని, అర్హులగులాగున సహాయపడుట
1 ఈ సంవత్సరం జూలై 9, 10 తారీఖులలో ఇండియాలోని ప్రయాణ కాపరులందరితో ఒక కూటము ఏర్పాటుచేయబడింది. దానికి ఈ సహోదరులు 26 మంది, బేతేలులో సేవా విభాగమందు సేవచేస్తున్న నలుగురు సహోదరులు హాజరయ్యారు. ఇండియా బ్రాంచి కమిటీలో సేవచేస్తున్న మొత్తం ముగ్గురు సహోదరులతోపాటు, ఈ సంవత్సరం మే నుండి జూలై వరకు తాత్కాలికంగా మూడు నెలలు బ్రాంచి కమిటీ కో-ఆర్డినేటర్‌గా పనిచేసిన, ఆస్ట్రేలియా బ్రాంచి కో-ఆర్డినేటర్ సహో. వి. మోరిట్జ్ ఉపదేశకులుగా పనిచేశారు.
2 చర్చించిన అనేక విషయాలలో ఒకటేమనగా, సంఘములోని సహోదరులు గొప్ప బాధ్యతలను చేపట్టుటకు చేరుకుని, అర్హులగునట్లు వారికి సహాయపడవలసిన అవసరత. పౌలు, 1 కొరింథీయులు 3:6లో మానవులు నాటి నీరుపోసిన విత్తనములను దేవుడు వృద్ధిచేయుటను గూర్చి మాట్లాడాడు. ఈ లేఖనము ముఖ్యంగా శిష్యులను తయారుచేయు పనికి అన్వయిస్తున్నను, ఇదే సూత్రము సంఘములోను అన్వయించబడగలదు. గొర్రెలాంటి వ్యక్తులు యెహోవాతో అంగీకృతమైన సంబంధములోకి వచ్చుటకు మానవ సహాయము, మరియు యెహోవా భూసంస్థ సహాయము అవసరము. అలాగే, సంఘములోని సహోదరులు కూడ సేవాధిక్యతలకు అర్హులగునట్లు వారికి సహాయమవసరము.
3 మీరు సహాయపడగల మార్గములయెడల అప్రమత్తంగా ఉండండి: ఒక వ్యక్తి అధ్యక్ష పదవికి చేరుకొనుచున్నట్లయిన, అది “కొనియాడదగిన ఆశయే.” (1 తిమో. 3:1, ఫిలిప్స్) సంఘములో ఇప్పటికే పెద్దలుగా సేవచేస్తున్న వారు సంఘములోని యౌవనులు మరియు క్రొత్తవారి సత్తా తెలుసుకొని, వారు అర్హులగునట్లు ప్రోత్సహిస్తూ సహాయపడాలి. యౌవనులైన సహోదరులు ఏ సహాయము లేకుండానే పురోగమించాలని ఆశిస్తూ, వారలా కనిపెట్టుకొని ఉండుటకు వీల్లేదు. అటువంటి సహోదరులు చేరుకొనునట్లు సహాయపడుటకు మీ సంఘములో మీరింకా ఎక్కువ చేయగలరా?
4 పెద్దల మరియు పరిచారకుల అర్హతలను పేర్కొనిన తరువాత 1 తిమోతి 3:10వ వచనము అర్హత “పరీక్షింపబడిన” వారిని ఎన్నుకొనుటను గూర్చి మాట్లాడుతుంది. అయితే పెద్దలు మౌనంగా “వెనకకూర్చొని” ఇతర సహోదరుల ప్రవర్తనను సూక్ష్మంగా పరిశీలిస్తుండాలని దీని భావము కాదు. మంచి స్థానములో ఉన్న సహోదరులందరికి, ఒక పని అప్పగించి వారు దానిని మనఃపూర్వకంగా చేస్తారో లేదో చూడవచ్చు. తమకైతాము వ్యక్తిగతంగా: బైబిలు పఠనమును నిర్వహించుట, సహాయ లేక క్రమ పయినీర్లుగా చేయుట, బైబిలంతటిని చదువుట మొదలగు గమ్యాలను పెట్టుకొనులాగున సహాయపడవచ్చును. అప్పుడు పెద్దలు వారి పురోగతిని, వారి “అర్హతను” పునఃసమీక్షించ వచ్చును. పెద్దలు, ప్రాంతీయ కాపరితో సమావేశమైనప్పుడు సంఘములో యుక్తవయస్కులైన ప్రతిపురుషుని పరిగణలోనికి తీసుకొని ఆధిక్యతలకు అతడు అర్హుడౌతాడా, లేనియెడల, అలాచేయుటకు అతనికెలా సహాయ పడవచ్చునో పరిశీలించాలి.
5 సహోదరులు అభివృద్ధి చెందే కొలది, వారు బహిరంగ ప్రసంగీకులుగా, పరిచారకులుగా లేక పెద్దలుగా అయ్యే ఆధిక్యతలనుండి అనవసరంగా వెనకకు నెట్టివేయబడకుండునట్లు జాగ్రత్తపడాలి. పెద్దలు వారి అర్హతలను పునఃసమీక్షించునప్పుడు పరిపూర్ణత కొరకు చూచునట్లు ఉండకూడదు. నిజానికి మనలో ఎవరము పరిపూర్ణులము కాము. (కీర్త. 130:3) వారు చూడవలసిన దేమంటే మొత్తము మీద సహోదరుని జీవిత విధానము లేఖనములకు అనుగుణ్యముగా ఉండి, కావలసినంత మట్టుకు సామర్థ్యములను, అర్హతలను మరియు తనను ఎన్నుకొనబోవు ఆధిక్యతకు అవసరమైన అనుభవాన్ని కలిగియున్నాడా యనేదే. అయితే, ఏదోరీతిలో లేఖన సంబంధమైన అర్హతలను దాటవెయ్యాలని మాత్రం కాదు.
6 దాదాపు ముప్పయి ఏళ్లకు సమీపిస్తూ, కొన్ని సంవత్సరాలనుండి పరిచారకులుగా సేవచేస్తున్న సహోదరులను పెద్దలుగా సిఫారసు చేయుటకు అనవసరంగా వెనుకాడకూడదు. కొన్నిసార్లు ఒక సహోదరుడు పరిచారకునిగా, లేక ప్రత్యామ్నాయ పెద్దగా అనేక సంవత్సరములు నమ్మకముగా సేవచేసినను, ఆయనను ఎన్నటికి పెద్దగా సిఫారసు చేయకపోవడాన్ని మనము చూస్తున్నాము. అటువంటి వ్యక్తులు ఎదగటం చూడాలని మేము అపేక్షిస్తున్నాము. వారు ఎదుగునట్లు సహాయపడండి. వారి బాధ్యతలను విస్తృత పరచండి, ఒకవేళ వారు వాటిని తగినంతమట్టుకు బాగా నెరవేర్చినట్లయిన, వారిని ఇతర ఆధిక్యతల కొరకు సిఫారసు చేయవచ్చును. సంఘములలో అనేకమంది అర్హులైన వారు సేవచేయుట ప్రయోజనములను చేకూర్చి, అభివృద్ధిని కలుగజేస్తుంది. మరోప్రక్క అది యెహోవా నామమునకు మహిమ తెస్తుంది.—కీర్త. 107:32.