మన సంఘ పుస్తక పఠన నిర్వాహకునితో సహకరించుట
1 సువార్త పరిచారకులుగా మన సామర్థ్యాలను వృద్ధిచేయడంలో సంఘ పుస్తక పఠనం ప్రముఖ పాత్ర వహిస్తుంది. బైబిలును, సొసైటి ప్రచురణలలో నొకదానిని పఠించడానికి స్నేహపూర్వకమైన, కుటుంబంవంటి వాతావరణాన్ని సృష్టించేందుకే ఉద్దేశపూర్వకంగా గ్రూపులు చిన్నవిగా ఏర్పాటుచేయబడ్డాయి. ఈ చిన్న గుంపులు మనలను ప్రాంతీయ పరిచర్యలో ఫలవంతులముగా ఉండేలా శిక్షణనిచ్చుటకు అనుకూలంగా ఉంటాయి. ఈ పుస్తక పఠన ఏర్పాటు ద్వారా వ్యక్తిగత ప్రోత్సాహము అవధానము అందుబాటులో ఉంటాయి. దీని నిర్వాహకునితో మనము సహకరించి ఈ మంచి ఏర్పాటునుండి ఎలా ప్రయోజనము పొందగలము?
2 ప్రాంతీయ పరిచర్యలో ఆసక్తితోకూడిన వంతు: పుస్తక పఠన నిర్వాహకుని బాధ్యతలలో ప్రాముఖ్యమైనదొకటేమనగా ఆ గుంపులోని ప్రతి సభ్యుడు పరిచర్యలో ఆసక్తితో పాల్గొనునట్లు సహాయం చేయడం. ఈ విషయంలో అవర్ మినిస్ట్రీ పుస్తకము 44వ పేజి మనకు గుర్తుచేసేదేమంటే, “ప్రాంతీయ పనియందు ఆయనయొక్క క్రమబద్ధత, ఆసక్తి, ఉత్సాహము ప్రచారకులలో ప్రతిబింబిస్తుంది.” కొన్నిసార్లు నిర్వాహకుడు తన స్వంత కుటుంబ సభ్యులతో కలిసి సేవలో పనిచేస్తాడు. అయితే తన పరిస్థితులు అనుమతించే కొలది పరిచర్యయొక్క వివిధ రంగాలలో ఇతరులతోను కలిసి పనిచేయుటకు ఆయన సంతోషిస్తాడు. ప్రాంతీయ సేవ కొరకైన కూటములకు మీరు క్రమంగా మద్దతివ్వగలరా? మీరు అలాచేయడం మీ పుస్తక పఠన నిర్వాహకునివలన, ఇతర ప్రచారకుల వలన ఎంతగానో మెచ్చుకొనబడుతుంది.
3 ప్రకటన పనిలో అందరూ ఆసక్తితో పాల్గొనేలా చేసేందుకు, ప్రాంతీయసేవకొరకైన కూటములు అనుకూలమైన స్థలాలలో ఏర్పాటు చేయబడతాయి. ప్రతి గ్రూపు స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని పరిచర్యను సాధ్యమైనంత ముందుగా ప్రారంభించడానికి ప్రయత్నిస్తుంది. అనేకమంది ప్రచారకులు మరియు పయినీర్లు వారాంతాలలో మధ్యాహ్నము దాటిన తరువాత కూడా పనిలో కొనసాగడంవలన మంచి విజయాన్ని పొందారు.
4 పరిచర్యలోని ఏదొక రంగములో మీకు సహాయం కావాలని కోరుతున్నారా? బహుశా మీ పుస్తక పఠన నిర్వాహకుడు మీ గుంపులోని ఒక సామర్థ్యముగల ప్రచారకుడు మీతో పనిచేసేలా ఏర్పాటుచేయవచ్చును. నెలాఖరులో తప్పక మీ ప్రాంతీయ సేవా రిపోర్టును సమయానికి ఇవ్వండి. మీ పుస్తక పఠన నిర్వాహకుడు మరియు మీ సంఘ కార్యదర్శి ఈ ప్రాముఖ్యమైన విషయంలో మీ సహకారాన్ని మెచ్చుకుంటారు.—లూకా 16:10 పోల్చుము.
5 సేవాకాపరి మీ గ్రూపును దర్శించునప్పుడు: ప్రాంతీయ పరిచర్యలో అధికంగాను అర్థవంతముగాను పనిచేసేలా ప్రోత్సహించడానికి సేవా కాపరి సాధారణంగా ప్రతి పుస్తక పఠన గ్రూపును నెలకొకసారి దర్శిస్తుంటాడు. పుస్తక పఠన ముగింపులో ఆయనిచ్చే 15-నిమిషముల ప్రసంగాన్ని శ్రద్ధగా అవధానము నిల్పి వినుము. ఎందుకనగా అందులో ప్రకటన పనిలోని వివిధ రంగాలలో గ్రూపు అభివృద్ధిచేసుకోవడానికి సహాయపడే నిర్దిష్టమైన ఉపదేశం ఉంటుంది. సేవాకాపరి కూడ వారాంతములో పుస్తకపఠన గ్రూపులోని వివిధ సభ్యులతో పనిచేయడానికి అపేక్షిస్తాడు. ప్రాంతములో ఆయనకుగల అనుభవము, సామర్థ్యమునుండి నీవు ప్రయోజనము పొందుటకు ఈ ప్రత్యేక ఏర్పాటును సద్వినియోగ పరచుకొనుము.
6 మనము “అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలు” చేయడానికి కృషిచేసేకొలది, సహకరించుటలో మన వ్యక్తిగత మాదిరి, తక్కువ అనుభవముగలవారికి సహాయంచేయడంలో మన సుముఖత సంఘ పుస్తక పఠనములో ఆప్యాయత మరియు స్నేహపూర్వక వాతావరణమును సృష్టించుటకు సహాయపడుతుంది.—గలతీ. 6:10.