ప్రశ్నా భాగము
◼ బాప్తిస్మము తీసుకునేప్పుడు ఒకరు ఏరకమైన దుస్తులు వేసుకోవడం సమంజసం?
వివిధ ప్రాంతాల్లోని దుస్తుల రీతి వేరు వేరుగా వున్నా “తగుమాత్రపు వస్త్రములను” ధరించుకోవాలనే బైబిలు ప్రబోధము మాత్రం ఎక్కడ జీవించేవారైనా క్రైస్తవులందరికీ ఒకటే. (1 తిమోతి 2:9) బాప్తిస్మము తీసుకునే సమయంలో ఏవి సరైన వస్త్రములో పరిశీలించడానికి ఈ సూత్రము అనువర్తించాలి.
బాప్తిస్మము తీసుకునే వ్యక్తికి జూన్ 1, 1985 వాచ్‌టవర్ ఈ సలహాను యిస్తోంది: “స్నానపు దుస్తుల్లోకూడా మర్యాద వుండాలి. ఫాషన్ డిజైనర్లు లైంగికత్వాన్ని వ్యక్తపర్చి, పూర్తి నగ్నతను తీసుకురావాలని ప్రయత్నించే ఈ కాలంలో అది చాలా ప్రాముఖ్యం. మరో గమనార్హ విషయమేమంటే కొన్ని సూట్లు ఎండినప్పుడు కనిపించేంత మర్యాదకరంగా తడిసినప్పుడుండవు. బాప్తిస్మమంతటి గంభీర సంఘటన సమయంలో తాము అవరోధానికి లేక తొట్రుపాటుకు కారణం కావాలని ఎవ్వరూ కోరుకోరు.—ఫిలిప్పీయులు 1:10”
ఈ సలహా కనుగుణ్యంగా, ఈ సందర్భం యొక్క ప్రాముఖ్యతను మనస్సులో వుంచుకొని, బాప్తిస్మము పొందేవారు మర్యాదకరమైన దుస్తులను వేసుకోవాలని కోరుకుంటారు. కాబట్టి, వళ్లు కనిపించేలా వేసుకోవడం లేదా శరీరానికి అంటుకుని వుండే అమర్యాదకర దుస్తులు క్రైస్తవులకు తగవు, కావున వాటిని విసర్జించాలి. అలాగే, వికారంగా లేక మురికిగా కనిపించడంకూడా సమంజసం కాదు. అంతేకాకుండా, లోకోక్తులున్న లేక వాణిజ్య సంబంధిత నినాదాలున్న టి షర్ట్‌లను వేసుకోవడం కూడా సముచితం కాదు.
బాప్తిస్మము తీసుకునే వ్యక్తిని బాప్తిస్మము కొరకు ప్రశ్నలడిగే నియమిత సహోదరులు సరైన దుస్తులను గూర్చి చెప్పడం మంచిది. ఈ విధంగా సందర్భం యొక్క గౌరవం కాపాడబడ్డమే కాకుండా, లోకం నుండి మనం వేరుగా వుండడంలో కొనసాగగలం.—యోహాను 15:19 పోల్చండి.