“సకల జనముల చేత ద్వేషించబడుదురు”
1 ఇటీవల సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా యెహోవా ప్రజలు అనుభవిస్తున్న అద్భుతకరమైన ఆశీర్వాదాలను గూర్చిన ఉత్తేజకరమైన నివేదికలను వినడంలో మనమందరం సంతోషించాం. మలావిలో 26 సంవత్సరాలు క్రూరంగా అణచివేయబడిన తర్వాత పరిచర్యను చట్టబద్ధం చేయడం, మనం ఆనంద బాష్పాలు రాల్చేటట్లు చేసింది. తూర్పు ఐరోపాలో దైవత్వంలేని కమ్యూనిజం కుప్పకూలి, నిజంగా వేలకొలది మన సహోదరులు అణచివేత నుండి విడుదల పొందడానికి దారితీయడం చూసినప్పుడు, మనం హమ్మయ్య అని నిట్టూర్చాం. గ్రీసులో స్వేచ్ఛగా మన ఆరాధన జరుపుకోవడాన్ని కోర్టులో దావా వేసినపుడు దాన్ని మనం ఉత్కంఠతో ఎదురు చూశాం; ఐరోపాలోని ఉన్నత న్యాయస్థానంలో మారుమ్రోగే విజయాన్ని మనం సాధించినపుడు మనం సంతోషించాం. సత్యాన్వేషకులకొరకు పెద్ద ఎత్తున సాహిత్యాలను ఉత్పత్తి చేయడానికి సొసైటీ బ్రాంచీలను విస్తృతం చేయడాన్ని గూర్చిన నివేదికలు వింటున్నప్పుడు మనం చాలా సంతోషించాం. ఉక్రేయిన్‌లోని కీవ్‌లో జరిగిన సమావేశంలో 7,400 కన్నా ఎక్కువ మంది బాప్తిస్మం పొందారని విన్నపుడు మనమెంతో ఆశ్చర్యపోయాం. అవును, రాజ్యపనిలో శీఘ్రగతిలో జరిగే యీ మార్పులు మన ఉత్సాహాన్ని ఎంత అధికం చేశాయో!
2 మనం సంతోషించడానికి పెద్ద కారణమున్నా, మితిమీరి ఉల్లసించకుండా జాగ్రత్తపడాలి. అనుకూలమైన నివేదికల పరంపర, సువార్తకుగల వ్యతిరేకత తగ్గిపోతుందని, యెహోవా ప్రజలు ప్రపంచ నలుమూలల అంగీకారం పొందుతున్నారని మనం నిర్ధారించడానికి కారణమౌతుంది. ఇలాంటి తలంపు మోసపూరితమైనదే. కొన్ని దేశాల్లో మనం సంతృప్తికరమైన కొన్ని విజయాలను సాధించినా, సువార్తకుగల అవరోధాలను కొంతవరకు అధిగమించినా, ప్రాథమికంగా లోకంతో మనకుగల సంబంధం మారలేదని మనం మర్చిపోకూడదు. మనం యేసు అనుచరులుగా ‘లోక సంబంధులం కాము.’ అందువల్లే, మనం ‘సకల జనముల చేత ద్వేషించబడతాము’ అని అనడంలో సందేహం లేదు. (యోహాను 15:19; మత్త. 24:9) ఈ విధానం నిలిచివున్నంతవరకు, “క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదుక నుద్దేశించువారందరు హింసపొందుదురు” అన్న మూల సూత్రానికి మార్పు రాదు.—2 తిమో. 3:12.
3 చరిత్ర పుటలు నమ్మదగిన యీ హెచ్చరికను ధృవీకరిస్తున్నాయి. ప్రతి దినం నిందను సహించి, సదా మరణ భయంలో ఉండి, క్రైస్తవత్వాన్ని స్థాపించిన యేసుక్రీస్తు, శక్తిమంతులైన పరిపాలకులకు, వారి ప్రజలకు అద్భుతకరమైన సాక్ష్యాన్నిచ్చాడు. ఆయన అపొస్తలులు అనేకులు శిష్యులవడానికి సహాయపడినా, క్రైస్తవ గ్రీకు లేఖనాలను వ్రాయడంలో పాలు పంచుకున్నా, పరిశుద్ధాత్మ యిచ్చిన అద్భుతమైన వరాలను కనబరచినా, వారు కూడా అలాగే ద్వేషించబడి హింసించబడ్డారు. క్రైస్తవులు మంచి నడవడిగలవారైనా, పొరుగువారిని ప్రేమించినా, చాలామంది వారిని హేయమైన “తెగగా,” ‘అంతటా ఆక్షేపణ చేశారు.’ (అపొ. 28:22) నేడు యెహోవా తన యిష్టాన్ని నెరవేర్చడానికి, ప్రపంచవ్యాప్త క్రైస్తవ సంఘాన్ని అద్భుతకరంగా ఉపయోగించుకుంటున్నా, యీ దుష్టవిధానంలోని ప్రతి ఒక్కటి దాన్ని వ్యతిరేకిస్తుంది, దూషిస్తుంది. వ్యతిరేకత ఆగిపోతుందని నిరీక్షించడానికి ఏ కారణం లేదు.
4 తొలి శతాబ్దంలో, యేసు శిష్యులను సాతాను అనేక విధాలుగా పీడించాడు. విద్వేషులైన వ్యతిరేకులు పచ్చి అబద్ధాలతో వారిని గూర్చి తప్పుడు అభిప్రాయం కలిగించారు. (అపొ. 14:2) వారిని జడిపించే ప్రయత్నంలో వారిని బెదిరించారు. (అపొ. 4:17, 18) ఉగ్రులైన జనసమూహం వారిని మాట్లాడకుండా చేయాలని ప్రయత్నించారు. (అపొ. 19:29-34) సరైన కారణం లేకుండానే వారు చెరసాలలో వేయబడ్డారు. (అపొ. 12:4, 5) హింసించేవారు, వారిని తరచూ శారీరకంగా బాగా హింసించారు (అపొ. 14:19) కొన్ని సందర్భాల్లో నిరపరాధులు ఉద్దేశపూర్వకంగా చంపబడ్డారు. (అపొ. 7:54-60) అపొస్తలుడైన పౌలు నిజంగా యీ విధాల హింసలన్నింటిని వ్యక్తిగతంగా సహించాడు. (2 కొరిం. 11:23-27) ప్రకటన పనిని ఆపడానికి, యీ నమ్మకస్థులైన పనివారిని బాధించడానికి ఏ అవకాశం దొరికినా, వ్యతిరేకులు, దాన్ని వెంటనే ఉపయోగించుకున్నారు.
5 నేడు సాతాను అలాంటి తంత్రాలనే ఉపయోగిస్తున్నాడు. పచ్చి అబద్ధాలు చెబుతూ, మనది తప్పుదోవ పట్టించే మతవిభాగమని, తీవ్ర దృక్పథంగల తెగయని అబద్ధారోపణలు చేస్తున్నారు. కొన్ని దేశాల్లో, అధికారులు మన సాహిత్యాలను మతబేధాలు పుట్టించేవని నిర్ణయించి, వాటిని నిషేధించారు. రక్తం యొక్క పవిత్రత యెడల మనకుగల గౌరవం బహిరంగంగా హేళన చేయబడుతుంది, సవాలు చేయబడుతుంది. పందొమ్మిది వందల నలభయ్యో పడిలో పతాక-వందనమును గూర్చిన వివాదం భావోద్రేకులైన జనాలకు కోపం రేకెత్తించిగా, వారు సహోదరులపై దాడి చేశారు, వారిని గాయపర్చారు, వారి ఆస్తులను నాశనం చేశారు. తటస్థంగా ఉన్నందుకు వేవేలమంది చెరసాలకు పంపబడ్డారు. నిరంకుశత్వ రాజ్యాల్లో మన సహోదరులు విద్రోహులని అబద్ధంగా ఆరోపించబడ్డారు, తత్ఫలితంగా, వందలమంది క్రూరంగా హింసించబడ్డారు, చెరసాలలోను, కాన్‌సెన్‌ట్రేషన్ క్యాంపుల్లోను చంపబడ్డారు. ఏ కారణం లేకుండానే మనం ద్వేషించబడుతున్నామని, కొనసాగుతున్న వత్తిడి స్పష్టంగా చూపిస్తుంది.—జెహోవాస్ విట్‌నెసెస్—ప్రొక్లైమర్స్ ఆఫ్ గాడ్స్ కింగ్‌డం పుస్తకం, 29 వ అధ్యాయం చూడండి.
6 భవిష్యత్తులో ఏమి జరుగనుంది? యెహోవాసాక్షులు ప్రపంచపు ఒక భాగాన అడ్డంకులను అధిగమిస్తూ, వత్తిళ్ళనుండి ఉపశమనం పొందుతుండగా, మొత్తంమీద పరిస్థితుల్లో మార్పేమీ లేదు. అపవాది 1914 లోని తన పతనాన్నిబట్టి యిప్పటికి కోపంతోనే ఉన్నాడు. తనకు స్వల్ప కాలమే ఉందని అతనికి తెలుసు. మహా శ్రమలు సమీపిస్తుండగా అతని కోపం తీవ్రమౌతూనేవుంది. సింహాసనాసీనుడైన, రాజైన యేసుక్రీస్తుతో పోరాడడానికే అతడు పూర్తిగా సిద్ధపడ్డాడు, చివరి వరకు పోరాడడానికే అతడు తీర్మానించుకున్నాడు. అతడు, అతని దయ్యాలు, “దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు” భూమిమీద నమ్మకస్థులుగా ఉన్న యెహోవా ప్రజలపై మాత్రమే తమ కోపాన్ని చూపించగలరు.—ప్రక. 12:12, 17.
7 కాబట్టి మనం భవిష్యత్తులోకి చూస్తుండగా మనం ఎదురు చూసేవాటి విషయమై వాస్తవికతను కలిగివుండాలి. అపవాది తన ద్వేషాన్ని పరిత్యజిస్తాడనో, వదిలి పెడతాడనో తలంచడానికి కారణం లేదు. అతడు యీ లోకంలో మన యెడల నింపిన విద్వేషం ఏ క్షణంలోనైనా, ఏ స్థలంలోనైనా ప్రజ్వలించవచ్చు. అనేక దేశాల్లో మనం ప్రకటించే స్వాతంత్ర్యాన్ని దీర్ఘకాల పోరాటం తర్వాతే పొందాం. ఆ స్వాతంత్ర్యం కూడా చాలా పరిమితమే, ప్రస్తుతం సానుభూతిగల పరిపాలకుడున్న చోట, అంతగా తెలియని నియమాలున్న చోట, దాన్ని నిలుపుకోగలం. అరాచకత్వం చెలరేగి, మానవ ప్రాథమిక హక్కులు దుర్వినియోగం చేసే అనుకోని అల్లర్లు అకస్మాత్తుగా జరుగవచ్చు.
8 కొన్ని దేశాల్లో, గతంలో మన సహోదరులు అనుభవించిన అవే అక్రమాలకు వారిని గురిచేస్తూ, ప్రస్తుతం మనం అనుభవిస్తున్న సమృద్ధి, స్వాతంత్ర్యం అకస్మాత్తుగా ఆగిపోవచ్చు. మన శత్రువులు లోబరచుకోబడ్డారనుకుని ఉదాసీనంగాను, అలక్ష్యంగాను ఉండడానికి సాహసించవద్దు. ఈ లోకపు విద్వేషం ఎల్లవేళలా పూర్తిగా కన్పించదు, కాని అది అధికంగానే ఉంటుంది. దేవుని వాక్యంలోని ప్రతిదీ చూపిస్తున్నట్లు, అంతం సమీపిస్తుండగా, లోక వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతుందే తప్ప తగ్గదు. కాబట్టి, మనం “పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై” ఉన్నామని చూపిస్తూ, జాగ్రత్తగా ఉండాలి. (మత్త. 10:16) అంతం వరకు మనకు ‘గట్టి పోరాటం’ ఉందని, తప్పించబడడానికి సహనమే కీలకమని మనం గుర్తించాలి.—యూదా 3; మత్త. 24:13.
9 మనం ప్రపంచంలో ఏ భాగాన జీవించినా, వ్యతిరేకుల గమనార్హమైన ఎట్టి అడ్డంకులు లేకుండా ప్రకటన పని అభివృద్ధి చెందుతూనే ఉండవచ్చు. మనం యీ విషయాన్ని గంభీరంగా తీసుకోవాలా అని సందేహించేవారిగా యిది మనల్ని చేయగలదు. అయినా మెలకువగా ఉండవలసిన అవసరముంది. పరిస్థితులు వెంటనే మారిపోవచ్చు. హెచ్చరించకుండానే, ఏదైనా వివాదాన్ని రేపి వ్యతిరేకులు మనపై దాడి చేయగలరు. మతభ్రష్టులు ఫిర్యాదు చేయడానికి, ఏదో ఒక కారణం కోసం నిరంతరం వెదుకుతూనే ఉంటారు. మన పని వారిని బెదిరిస్తుందని భావించే కోపోద్రేకులైన మత నాయకులు బహిరంగంగానే మనలను దూషించవచ్చు. మన ప్రాంతంలోనే ఒక రాజ్య మందిరాన్ని నిర్మించాలన్న పథకం యిరుగు పొరుగునంతా కలతపరచేంతటి వివాదాన్ని సృష్టించవచ్చు. మనకు కళంకం కలిగించే, బాధాకరమైన వార్తలు పత్రికల్లో ప్రత్యక్షం కావచ్చు. మన ప్రకటన పనిలో పొరుగు వారిని దర్శించినపుడు వారు మనతో విద్వేషంతో మెలిగేలా, మన ప్రాంతంలోని ప్రముఖులైన వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మనపై తప్పుడు ఆరోపణ మోపవచ్చు. మన స్వంత గృహంలో మనకు ప్రియులైనవారు కూడ మనకు వ్యతిరేకులై మనలను పీడించవచ్చు. కాబట్టి, లోక శత్రుత్వం యింకా ఉందని, అది ఎప్పుడైనా విజృంభించవచ్చని గుర్తించి, మెలకువగా ఉండవలసిన అవసరముంది.
10 ఇది మనపై ఎలాంటి ప్రభావాన్ని చూపాలి? ఇదంతా మన తలంపులపై, భవిష్యత్తుకొరకైన నిరీక్షణపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఏ విధంగా? ఇది మనల్ని జడిపిస్తుంది, ఏం సహించాల్సివస్తుందోనని మనం భయపడాలా? మన ప్రాంతంలో కొందరు దానివల్ల కలత చెందినందువల్ల మన ప్రకటన పనిని తగ్గించాలా? మనం అన్యాయంగా దూషించబడినప్పుడు మనం ఆందోళన చెందవలసిన అవసరముందా? మనతో కఠినంగా వ్యవహరించినందుకు యెహోవాను సేవించడంలోని మన సంతోషాన్ని అది దోచుకోవడం అనివార్యమా? కలగబోయే ఫలితాన్ని గురించి అనిశ్చితంగా ఉందా? అలా కానే కాదు! ఎందుకని?
11 మనం చెప్పే సమాచారం మనది కాదని, అది యెహోవాదేనన్న విషయాన్ని ఎన్నటికీ మరవవద్దు. (యిర్మీ. 1:9) “యెహోవాను స్తుతించుడి ఆయన నామమును ప్రకటించుడి . . . భూమియందంతట ఇది తెలియబడును” అన్న ఉద్బోధను మనం అనుసరించవలసిన బాధ్యత మనమీద ఉంది. (యెష. 12:4, 5) ‘భూలోకమంతట ఆయన నామమును ప్రచురం చేయాలన్న’ ఉద్దేశంతోనే తన ప్రజలు హింసను అనుభవించడానికి ఆయన అనుమతించాడు. (నిర్గ. 9:16) యెహోవా ఆజ్ఞాపించిన పనిని మనం చేస్తున్నాం, మనం బెదురు లేకుండా మాట్లాడ్డానికి కావలసిన ధైర్యాన్ని ఆయన యిస్తాడు. (అపొ. 4:29-31) ఈ పాత విధానపు అంత్యదినాల్లో, అతి ప్రాముఖ్యమైన, ప్రయోజనకరమైన, అవశ్యంగా చేయదగిన పని యిదే.
12 ఈ జ్ఞానం, సాతాను మరియు ఈ లోకపు వ్యతిరేకతను ఎదుర్కోవాలనే దృఢ నిశ్చయంతో ఉండడానికి అవసరమైన ధైర్యాన్నిస్తుంది. (1 పేతు. 5:8, 9) యెహోవా మనతోవున్నాడన్న జ్ఞానం మనల్ని ‘ధైర్యంగాను బలంగాను’ ఉంచుతుంది, మనల్ని పీడించేవారి ముందు భయపడే ఏ కారణాలనైనా తొలగిస్తుంది. (ద్వితీ. 31:6; హెబ్రీ. 13:6) వ్యతిరేకులు బెదిరించినప్పుడు మనమన్ని సమయాల్లోను అనునయంగాను, సహేతుకంగాను, వివేచనతోను ఉండడానికి ప్రయత్నించినా, మన ఆరాధన సవాలు చేయబడినప్పుడు ‘మనుష్యులకు కాదు దేవునికే లోబడాలనే’ తీర్మానించుకున్నామని స్పష్టం చేస్తాం. (అపొ. 5:29) సహేతుకంగా ప్రత్యుత్తరమివ్వడానికి అవకాశమున్నప్పుడు మనమలా చేస్తాం. (1 పేతు. 3:15) అయితే, మనల్ని అవమానించాలన్న ఉద్దేశంతోవున్న కఠినులైన వ్యతిరేకులతో వాదిస్తూ మనం సమయాన్ని వృథా చేయం. మనల్ని దూషించినప్పుడు, మనపై అబద్ధారోపణ మోపినపుడు, వాళ్ళతోపాటు కోపించి, వారితో సమానంగా మాట్లాడే ప్రయత్నం చేయడానికి బదులు, ‘వారి జోలికి పోకుండా ఉంటాము.’—మత్త. 15:14.
13 శోధనల్లోని మన సహనం యెహోవాను ప్రీతిపరుస్తుంది. (1 పేతు. 2:19) ఆ అంగీకారం కొరకు మనమే వెలను చెల్లించవలసి ఉంటుంది? మనం ద్వేషించబడి, వ్యతిరేకించబడుతున్నందుకే అసంతోషంతో మనం ఆయనను సేవించడం వదిలిపెడతామా? లేదు! విధేయతకు “సమస్తానందముతోను సమాధానముతోను” ప్రతిఫలమిస్తానని యెహోవా వాగ్దానం చేస్తున్నాడు. (రోమా. 15:13) తీవ్రమైన శ్రమల్లోకూడ యేసు సంతోషంగా ఉండడానికి “తనయెదుట ఉంచబడిన ఆనందము” కారణమైంది. (హెబ్రీ. 12:2) మన విషయంలో కూడ అది నిజమే. మన సహనానికి ప్రతిఫలం చాలా గొప్పది గనుక, మనం తీవ్ర శ్రమలను అనుభవిస్తున్నప్పటికీ, ‘సంతోషించి ఆనందించడానికి’ ప్రేరేపించబడతాం. (మత్త. 5:11, 12) ఆపదలు ముంచుకొచ్చిన సమయంలోను, రాజ్యసువార్తకు మద్దతునిస్తూ యెహోవాకు స్తుతిని మహిమను యివ్వడానికి అట్టి ఆనందమే ఒక కారణమౌతుంది.
14 తుది ఫలితాన్ని గూర్చిన అనిశ్చయత, భయానికి, సందిగ్ధావస్థకు మనకు కారణమిస్తుందా? లేదు, యెహోవా సంస్థకు, సాతాను లోకానికి మధ్యగల పోరాట ఫలితం చాలా కాలం క్రితమే నిర్ణయించబడింది. (1 యోహాను 2:15-17) ఎంత గొప్పగా, తీవ్రంగా వ్యతిరేకత ఉన్నప్పటికీ, యెహోవా మనకు విజయాన్నిస్తాడు. (యెష. 54:17; రోమా. 8:31, 37) మనం పూర్తిగా పరీక్షించబడిననూ, మనం ప్రతిఫలాన్ని అందుకునేందుకు ఏవీ అడ్డురావు. మన విన్నపాలకు ప్రత్యుత్తరంగా యెహోవా మనకు సమాధానమిచ్చాడు కాబట్టి, మనం ‘దేనిని గురించి చింతపడనసరం’ లేదు.—ఫిలి. 4:6, 7.
15 మన సహోదరులు హింసలనుండి విడుదలపొందారని, క్రితం నిషేధించబడిన రాజ్యాల్లో నేడు ప్రకటించే స్వాతంత్ర్యం లభించిందని రిపోర్టులు విన్న ప్రతిసారి యెహోవాకు కృతజ్ఞత చెల్లిస్తాం. మారుతున్న పరిస్థితులు, యథార్థవంతులైన వేలకొలది ప్రజలకు రాజ్యసువార్తతో సంబంధం కలగడానికి క్రొత్త అవకాశాలు లభిస్తున్నప్పుడు మనం సంతోషిస్తాం. విద్వేషులైన వ్యతిరేకులతో వచ్చిన పోరాటాల్లో యెహోవా మనకు విజయం ప్రసాదించడానికి తీర్మానించినందుకు మనం నిజంగా కృతజ్ఞులై ఉంటాం. తన సత్యారాధనాలయాన్ని మహిమపరచడానికి, అన్ని జనములనుండి ‘యిష్టులైనవారు’ దానిలోనికి ప్రవేశించే అవకాశమివ్వడానికి, యెహోవా ఏ విధంగానైనా మన పనిని ఆశీర్వదించి, అభివృద్ధిపరుస్తాడని మనకు తెలుసు.—హగ్గ. 2:7; యెష. 2:2-4.
16 అదే సమయంలో, మన శత్రువైన సాతాను చాలా శక్తిమంతుడని, అంతం వరకు శక్తియుక్తంగా మనల్ని వ్యతిరేకిస్తాడని పోరాడుతాడని మనకు బాగా తెలుసు. అతని దాడులు బహిరంగంగాను, ప్రత్యక్షంగాను ఉండవచ్చు, లేదా కుటిలంగాను, మోసపూరితంగాను ఉండవచ్చు. గతంలో సమాధానకరంగా ఉన్న స్థలాల్లో అకస్మాత్తుగా హింస కలుగవచ్చు. దుష్టులైన వ్యతిరేకులు మనల్ని అన్యాయంగా అణచివేయడానికి అవిరామంగా అవినీతికరంగా ప్రయత్నం చేస్తూనే ఉండవచ్చు. ఇలాంటివారు ‘దేవునితో పోరాడుతున్నారని’ దేవుడు వారిని నిర్మూలం చేస్తాడని వారు తెలుసుకునే తగిన సమయం వస్తుంది. (అపొ. 5:38, 39; 2 థెస్స. 1:6-9) ఈ సమయంలో, మనం ఏం సహించవలసి వచ్చినా, యెహోవాను నమ్మకంగా సేవించడానికి, రాజ్య సువార్తను ప్రకటించడానికి మనం దృఢ నిశ్చయంగలవారమై ఉన్నాము. ‘అంగీకారం పొందినప్పుడు మనం జీవకిరీటం పొందుతామని’ తెలుసుకోడం వల్ల భూమిపైని ప్రజలందరిలోకెల్లా మనమే ఎక్కువ సంతోషంగలవారమౌతాము.—యాకోబు 1:12.