అనర్హులయెడల దయ చూపించకుండా జాగ్రత్తపడండి.
1 యెహోవా ప్రజలు వారి దయకు, ఉదార స్వభావానికి ప్రసిద్ధిగాంచారు. యేసుక్రీస్తు చెప్పిన కరుణారస ఉపమానంలోని పొరుగువాడైన సమరయుని మనం అనుకరించినప్పుడు యిది తరచూ భౌతిక విషయంలోను ప్రదర్శితమౌతుంది. (లూకా 10:29-37) అయినా, భౌతిక సహాయం అవసరం లేని వారు కూడా మన దయవలన ప్రయోజనం పొందడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి, యితరులపట్ల మనకు గల ప్రేమ ‘సరైన అనుభవజ్ఞానం, వివేచనతో’ సమతూకంగా ఉండాలి.—ఫిలి. 1:19.
2 సంఘంలో: ఉదాహరణకు, సహాయం కోరడానికి, ఎవరైనా తనకు ఉద్యోగం లేదనో, లేదా మరితర కారణాలో చెప్పవచ్చు. కొన్నిసార్లు, యీ వ్యక్తులు ఉద్యోగం కొరకు చురుగ్గా ప్రయత్నించకుండా, ఎవరన్నా తమ జీవితావసరాలను తీర్చితే బాగుండునని అభిలషిస్తుండవచ్చు. అలాంటివారిని అపొస్తలుడైన పౌలు యిలా ఆజ్ఞాపిస్తున్నాడు. “ఎవడైనను పనిచేయ నొల్లనియెడల వాడు భోజనము చేయకూడదు.”—2 థెస్స. 3:10.
3 “అదృష్ట వశము చేతనే కాల వశము చేతనే” మనకేదైనా జరగవచ్చు. అలా మనందరికి భౌతికావసరత ఏర్పడినప్పుడు, ‘మనకు అనుదినాహార’ కొరత కలదని మనం అమితంగా చింతించనక్కర లేదు. ఎందుకంటే, తనను ప్రేమించి, తన యిష్టాన్ని నెరవేర్చేవారికి యెహోవా దయ చేస్తాడు కాబట్టి, మనం అమితంగా వ్యాకులపడకూడదు. (ప్రసం. 9:11; మత్త. 6:11, 31, 32) అవసరమున్నవారు పెద్దల్లో ఒకరితో మాట్లాడడం ప్రయోజనకరంగా ఉంటుంది. సహాయం అందించడానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను గూర్చి వారికి తెలిసివుండవచ్చు, వారు అవసరమైన వ్రాత పనులు చేసి సహాయపడగలరు, లేదా యిలాంటి ఏర్పాట్లకు అవసరమైన వాటిని గూర్చి వారు ఎరిగి ఉండవచ్చు. ఏదేమైనా, సహాయమును యాచించే వ్యక్తుల పరిస్థితులను మదింపు చేసి, తామేమి చేయగలరో ఆ పెద్దలు తీర్మానిస్తారు.—1 తిమోతి 5:3-16 పోల్చండి.
4 వంచకులైన ప్రయాణికులు: సంఘంలోని కొందరు వంచకులైన ప్రయాణికుల వలన డబ్బును, వస్తువులను కోల్పోయినట్లు సొసైటీకి నివేదికలు అందుతూనేవున్నాయి. “దుర్జనులును వంచకులును ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోవుదురు” అని లేఖనాలు హెచ్చరిస్తున్నాయి కాబట్టి, మనం దానికి ఆశ్చర్యపడనవసరం లేదు. (2 తిమో. 3:13) తరచూ యీ మోసగాళ్ళు, వారు నిస్సహాయ స్థితిలోవున్నారని, ప్రయాణం చేయడానికి, ఆహారానికి, తిరిగి యింటికి వెళ్ళడానికి డబ్బు అవసరమని అడుగుతారు. వారు నిష్కపటులుగా కన్పించినా, దాదాపు అన్ని కేసుల్లో వారు యెహోవాసాక్షులు కారు కాని, అచ్చం అలాగే నటిస్తారంతే.
5 పరిచయం లేని ఎవరైనా సహాయం చేయమని అడిగితే, ఆ వ్యక్తి మన సహోదరుడు అవునో కాదోనని నిర్ణయించగల సంఘ పెద్దల్లో ఒకరిని సలహా అడగడం జ్ఞానయుక్తమైన పని. సాధారణంగా ఆ వ్యక్తి చెప్పిన సంఘంలోని పెద్దల్లో ఒకరికి ఫోను చేయడంవలన ఆ వ్యక్తి ఎలాంటివాడో తేల్చుకోవచ్చు. అనుకోకుండా అవసరంలో పడ్డ నిజమైన సహోదర సహోదరీలు, యిలాంటి విచారణలు అందరి భద్రత కొరకేనని గ్రహిస్తారు. వారు మోసగాళ్ళయితే, యిలాంటి పరిశోధనల్లో బయటపడతారు. మనకు తెలియని అందరిని అనవసరంగా సందేహించనవసరం లేదు. అయితే దుష్టులను, వంచకులనుబట్టి జాగ్రత్తపడాలి.
6 జ్ఞానియైన సొలొమోను రాజు యిలా సలహా యిచ్చాడు: “మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాని పొందదగినవారికి చేయకుండ వెనుకతియ్యకుము.” (సామె. 3:27) జ్ఞానయుక్తమైన మన వివేచనతో, కరుణాపూర్వకంగా ఉంటూనే అనర్హులయెడల దయచూపించకుండా జాగ్రత్తపడాలి.