ఏప్రిల్ నెలలో యెహోవాకు మీ స్తుతులను విస్తరింప జేయుదురా?
1 యెహోవాకు అంగీకృతమైన రీతిలో స్తుతించడానికి కీర్తనల రచయిత దావీదు హృదయపూర్వకమైన కోరికను కల్గియుండి, యిట్లు ప్రకటించాడు: “నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్యను నేనాయనను స్తుతించెదను.” (కీర్త. 109:30) ప్రాంతీయ సేవయందు మన వంతును విస్తరింపజేయుట ద్వారా ‘మరి ఎక్కువగా ఆయనను స్తుతించుటకు,’ ఏప్రిల్ నెల ఒక మంచి సమయం. (కీర్త. 71:14) సహాయ పయినీర్ శ్రేణిలో చేరుట ద్వారా దీనిని చేసే అనేకులతో ఉండడానికి మీరు పథకం వేసుకొంటున్నారా?
2 ఇప్పుడే పథకం వేసుకోండి: “శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు,” అని సామెతలు 21:5 నందు మనకు గుర్తు చేయబడింది. ఇలా చేసేందుకు విషయాలను ప్రార్థనలో యెహోవా ముందుంచి, ఆయనను మీ పథకాల్లో ముందుంచవలసిన అవసరముంది. (సామెతలు 3:5, 6) తర్వాత, పరిచర్యయందు సగటున రోజుకు రెండు గంటలు వెచ్చించునట్లు అవసరమగు చోట మార్పులు చేసుకొనుటకు మీ తాజా కార్యక్రమ పట్టికను జాగ్రత్తగా పరిశీలించండి. ఇతర కార్యకలాపాలకు వెచ్చించే మీ సమయాన్ని “సద్వినియోగం,” చేసుకోవడంవల్ల మీరు సువార్త పనిలో ఎక్కువ సమయాన్ని గడపడానికి వీలౌతుంది.—ఎఫె. 5:16.
3 సంభాషించి, సహకరించుకోండి: తన పరిచర్యను నెరవేర్చుటలో ఆయనకు ‘ఆదరణ నిచ్చిన’ కొంతమంది వ్యక్తులను గురించి అపొస్తలుడైన పౌలు మాట్లాడాడు. (కొల. 4:11) ఏప్రిల్ నెలలో సహాయ పయినీర్గా చేరడానికి ఇష్టపడే ఇతరులతో మీ ప్రణాళికలను చర్చించండి. వారి మద్దతు సహవాసము పరస్పర ఆత్మీయ లాభాలను తీసుకురాగలదు. సేవా ఏర్పాట్లను గూర్చి లేక పనిచేసే ప్రాంతమును గూర్చి మీరు ప్రశ్నలను కల్గియున్నట్లయితే, సేవాధ్యక్షుడు మీకు సహాయ పడగలడు.
4 కుటుంబ మద్దతు, సహకారము కుటుంబములోని వ్యక్తులు సహాయ పయినీర్ చేయుటకు సహాయపడగలదు. ఇంటిపనులు తాత్కాలికంగా పంచుకోవచ్చును. ఈ పనులు నిర్వహించుట కొరకైన పట్టికలో కూడా మార్పులు అవసరమైయుండవచ్చును. మీ ఉద్దేశాన్ని నెరవేర్చుటలో ఈ అవసరతలను చర్చించుటకొక కుటుంబ సమావేశము సహాయకరంగా ఉండగలదు. మంచి సంభాషణా సహకారాలు విజయానికి కీలకాలు.
5 అనుకూల దృక్పథాన్ని కల్గివుండండి: అననుకూల పరిస్థితులను బట్టి సహాయ పయినీర్ చేయు సాధ్యతను త్రోసివేయడానికి త్వరపడకండి. పాఠశాల యందలి యౌవనులు, ఉద్యోగ విరమణచేసిన ప్రజలు, పిల్లలుగల గృహిణులు, పూర్తికాలం పనిచేస్తున్న కుటుంబ యజమానులు, అందరూ త్యాగంచేసి, ఏప్రిల్ నెలలో సహాయ పయినీర్ చేయడానికి సంతోషిస్తారు. “స్తుతిచేయుట యథార్థవంతులకు శోభస్కరము,” అని చెప్పిన కీర్తనల రచయితతో వారేకీభవిస్తూ, పరిచర్యలో 60 గంటలు వెచ్చించడానికి చేసే అదనపు ప్రయత్నం ఖర్చుతో కూడినదిగా వారు దృష్టించరు. (కీర్త. 33:1) మీరు సహాయ పయినీర్ చేయలేకపోయినట్లైతే, ఒక సంఘ ప్రచారకునిగా మీ సేవను పెంపొందించుకొనే ఆనందాన్నెందుకు పంచుకోకూడదు?
6 అనేకులకు, ఏప్రిల్లో సహాయ పయినీర్ సేవచేయడం, క్రమ పయినీర్ సేవ చేయుటకొక మెట్టుగా పనిచేసింది. తమ సేవను వృద్ధి పర్చుకొన్నవారిగా, క్రమ పయినీర్గా మారుట చాలా సులభమని వారు కనుగొన్నారు.
7 అవును, ఏప్రిల్ నెల వేసవికాలం గనుక దైవపరిపాలనా కార్యక్రమాన్ని అభివృద్ధి చేయడానికి అది అనుకూలమైనది. పగలు ఎక్కువ వ్యవధి కల్గివుండడంవల్ల ఉదయం మరియు పొద్దుగ్రుంకక మునుపు మరింత ఎక్కువ సాక్ష్యమిచ్చుటకు వీలౌతుంది. మన దేవుడైన, యెహోవాను స్తుతించుటకు మనం చేయగలిగినంత చేద్దాం. ఆయన మనయెడల చేసిన కృపాబాహుళ్య క్రియల యెడల మన మెప్పును చూపడానికి ఏప్రిల్ నెలలో సహాయ పయినీర్ చేయుట ఒక శ్రేష్ఠమైన మార్గము.