పునర్దర్శనాలు చేయడం ద్వారా మీకు శ్రద్ధ ఉందని చూపించండి
1 ఇంటింట ఆసక్తిగల వారిని వెదకడం, యితరులకు రాజ్య సందేశాన్ని వినే అవకాశాన్నివ్వాలన్న మీ కోరికను ప్రదర్శిస్తుంది. మీరు జనవరి నెలలో సాహిత్యాలను తీసుకున్న వారి దగ్గరికి తప్పకుండా తిరిగి వెళ్ళండి, ఎందుకంటే, యితరుల యెడల మీకు శ్రద్ధ ఉందని మీరు చూపించడానికి యిది ఒక చక్కని మార్గం.
2 “నిన్ను సంతోషపరచు సువార్త” అనే పుస్తకాన్ని తీసుకున్న వారి దగ్గరికి తిరిగి వెళ్ళినప్పుడు చెప్పేందుకు ఇది మంచి సలహా:
◼ “మనమందరం సువార్తను వినడానికి యిష్టపడతాము. లోకంలో నిజమైన సువార్త దుర్లభమని అనేకులు భావిస్తారు. దాని గురించి మీరెలా భావిస్తున్నారు? [జవాబివ్వనివ్వండి.] సువార్త మనలను సంతోషపరుస్తుంది, మన ప్రాణాలను ఉత్తేజింపజేస్తుందని మనకందరికీ తెలుసు. శ్రేష్ఠమైన వార్త బైబిలులో కనబడుతుంది, భవిష్యత్తును గూర్చిన సమాచారానికి అది మాత్రమే నమ్మదగిన ఆధారము. [పుటలు 7-9 లలో ఉదాహరించబడిన లేఖనాలను చూపించండి.] ఇలాంటి పరిస్థితులు త్వరలో రానున్నాయని మీకు రుజువు చేయడానికి యీ అవకాశాన్ని తీసుకోడానికి మేము యిష్టపడతాము.” ఈ పుస్తకం సహాయంతో బైబిలు పఠించడం యీ వాగ్దానాల్లో విశ్వాసముంచడానికి గృహస్థునికి సహాయపడుతుందని వివరించండి.
3 “నీ రాజ్యం వచ్చుగాక” (ఆంగ్లం) అనే పుస్తకాన్ని యిచ్చినట్లయితే, మీ సంభాషణను యీ విధంగా ఆరంభించగలరు:
◼ “క్రితం మనం దేవుని రాజ్యాన్ని గూర్చి, అది మన కోసం చేసే దానిని గూర్చి మాట్లాడుకున్నాం. ఆ రాజ్యం త్వరలో యీ భూమిని పరదైసుగా మార్చుతుంది. మనమెన్నడూ పరదైసును చూడలేదు గనుక, మనం దానిని ఊహించడం కష్టం కావచ్చు. అది యీ విధంగా ఉండవచ్చు. [పుటలు 4, 5లోని చిత్రములను చూపించండి.] బైబిలులో ఇలాంటి పరదైసు వాగ్దానం చేయబడింది.” కీర్తన 72:7 చదవండి. ఆసక్తి ఉన్నట్లయితే, 175వ పుటను తీసి, 3, 4 పేరాలకు తిప్పి, రానున్న పరదైసులో మనం జీవించాలని కోరుకుంటున్నట్లయితే, మనం ఏమి చేయాలన్నది చూపించండి.
4 “నిజమైన శాంతి భద్రతలు—ఏ మూలం నుండి?” (ఆంగ్లం) అనే పుస్తకాన్ని తీసుకున్న వారి దగ్గరికి యీ విధమైన క్లుప్త సమాచారంతో తిరిగివెళ్ళవచ్చు:
◼ “నేడు లోక నాయకులు శాంతి భద్రతలను తేలేక పోతున్నారు. యెహోవా దేవుడు మాత్రమే అది చేయగలడు. మనమేమి చేయవలసిన అవసరముందో బైబిలు మనకు చూపిస్తుంది. [అధ్యాయం 9 తిప్పి బైబిలు వాగ్దానాల్లో నమ్మకముంచడానికి మనకు గట్టి ఆధారముందని చూపించండి.] ఈ పుస్తకం మీకెలా సహాయపడుతుందో మీకు చూపించడానికి నేను యిష్టపడుతున్నాను.
5 “జీవితమున ఉన్న యావత్తు ఇదేనా?” అనే పుస్తకాన్ని తీసుకున్న వారి దగ్గర యీ సలహాను అన్వర్తించవచ్చు:
◼ “భూమిపై నిత్యజీవ నిరీక్షణనిచ్చే యీ పుస్తకాన్ని మీకు క్రితం యిచ్చి వెళ్ళాను. ఈ పుస్తకాన్ని పునఃసమీక్షించిన తర్వాత, మీరు ఏ నిర్థారణకు వచ్చారు? [జవాబివ్వనివ్వండి.] మరణ భయం లేని క్రొత్త పరదైసు లోకంలో నిత్యం జీవించగలమనే వాగ్దాన భాగాలను చదవడం ద్వారా మీరు ప్రోత్సహించబడి ఉండవచ్చు. [పుస్తకంలో 137వ పుటలోని 16వ అధ్యాయంనందలి ఉపశీర్షికను చూపించండి. యెషయా 25:8 చదవండి.] మీరు, మీ ప్రియమైనవారు అలాంటి లోకంలో జీవించడానికి యిష్టపడతారని నేను కచ్చితంగా అనుకుంటున్నాను. దీనిని గూర్చి పుట 143లోని మొదటి పేరా ఏమి చెబుతుందో గమనించండి.” పేరాను చదవండి, యెహోవాను అన్వేషించడం అంటే ఆయన వాక్యమైన బైబిలును పఠించడం ద్వారా, ఆయనను గూర్చి, ఆయన సంకల్పాలను గూర్చి మరి ఎక్కువగా తెలుసుకోవడమని చూపించండి.
6 తన మందయెడల శ్రద్ధ కనబరచే ప్రేమగల మంద కాపరిగా యెహోవా పరిపూర్ణమైన మాదిరినుంచాడు. (యెహె. 34:11-14) ఆయన ప్రేమపూరిత శ్రద్ధను అనుకరించడానికి మనం యథార్థంగా ప్రయత్నం చేయడం ఆయనను ప్రీతిపరుస్తుంది, మన ప్రేమను ప్రదర్శిస్తుంది, అది యితరులకు ఆశీర్వాదాలను తెస్తుంది.