ప్రకటించడం—గౌరవనీయమైన ఆధిక్యత
1 సువార్త పరిచర్య యెహోవా మనకనుగ్రహించిన ఒక గౌరవనీయమైన ఆధిక్యత. (రోమా. 15:16; 1 తిమో. 1:12) మీరు దానిని ఆ విధంగానే దృష్టిస్తారా? గడుస్తున్న సమయం గాని, ఇతరుల పరిహాసం గాని మన దృష్టిలో దాని ప్రాముఖ్యతను తగ్గించటానికి అనుమతించకూడదు. దేవుని నామాన్ని కలిగివుండడమనేది కొందరికి మాత్రమే ఇవ్వబడిన ఘనత. ఈ ఆధిక్యత యెడల మనకు గల మెప్పుదలను మనమెలా పెంచుకోగలం?
2 రాజ్య వర్తమానాన్ని ప్రకటించడం మనకు లోకంయొక్క అనుగ్రహాన్ని తెచ్చిపెట్టదు. అనేకులు మన పనిని ఉదాసీనతతోను లేదా నిరాసక్తితోను దృష్టిస్తారు. ఇతరులు దాన్ని పరిహసిస్తారు మరియు వ్యతిరేకిస్తారు. అలాంటి వ్యతిరేకత సహోద్యోగుల నుండి, పొరుగువారి నుండి, లేదా కుటుంబ సభ్యులనుండి కూడా రావచ్చు. వారి దృష్టిలో మనం తప్పుద్రోవ పట్టినవారిగాను, అవివేకులుగాను కనిపించవచ్చు. (యోహా 15:19; 1 కొరి. 1:18, 21; 2 తిమో. 3:12) వారి నిరుత్సాహకరమైన వ్యాఖ్యానాలు మన ఆసక్తిని తగ్గించడానికి, మనలను మందకొడిగా చేసేందుకు లేక మన గౌరవనీయమైన ఆధిక్యతను త్యజించేందుకు రూపొందించబడ్డాయి. ‘సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసిన’ సాతాను ప్రతికూల దృక్పథాలను పెంపొందించాడు. (2 కొరి. 4:4) మీరెలా ప్రతిస్పందిస్తారు?
3 నేడు మనలో ఎవరైనా చేయగల్గుతున్న అత్యంత ప్రాముఖ్యమైన పని మనం రాజ్యాన్ని గురించి ప్రకటించడమేనని మనస్సులో ఉంచుకోడం ప్రాముఖ్యము. మరే మాధ్యమం ద్వారా లభ్యం కాని జీవాన్ని రక్షించే వర్తమానం మన దగ్గర ఉంది. (రోమా. 10:13-15) మానవుల అంగీకారం కాదు గాని, దేవుని అంగీకారమే ముఖ్యమైనది. మన ప్రకటన పనిని గూర్చిన లోకము యొక్క ప్రతికూల దృష్టి సువార్తను ధైర్యంగా ప్రకటించడం నుండి మనలను ఆటంకపర్చదు.—అపొ. 4:29.
4 యేసు తన తండ్రి చిత్తాన్ని చేయడమనే తన ఆధిక్యతను ఉన్నతంగా పరిగణించాడు. (యోహా. 4:34) పరిచర్య కొరకు ఆయన తనను తాను పూర్తిగా అర్పించుకుని, అవరోధాలుగాని లేక వ్యతిరేకులుగాని తనను మందకొడిగా చేసేందుకు అనుమతించలేదు. రాజ్యవర్తమానాన్ని ప్రకటించడమే ఆయన జీవితంలో ఎల్లవేళలా ప్రథమ స్థానాన్ని వహించింది. (లూకా 4:43) ఆయన మాదిరిని అనుకరించాలని మనం ఆజ్ఞాపించబడ్డాము. (1 పేతు. 2:21) ఆ విధంగా చేయడంలో మనం ‘దేవుని జత పనివారముగా’ సేవ చేస్తాము. (1 కొరి. 3:9) ఈ ఆధిక్యత నుండి మనం పూర్తి ప్రయోజనాన్ని పొందుతున్నామా? మనం నియతంగాను (ఫార్మల్గాను), అనియతంగాను (ఇన్ఫార్మల్గాను) ఇతరులతో సువార్తను పంచుకొనే సందర్భాలకొరకు అన్వేషిస్తామా? యెహోవాసాక్షులముగా మనం, ఎల్లవేళలా ‘ఆయన నామమును ఒప్పుకొనుటకు’ సిద్ధంగావుండాలి.—హెబ్రీ. 13:15.
5 పరిచర్యలో మనం భాగం వహించడం, మన మనోవైఖరినిబట్టి ఎక్కువగా నిర్ణయింపబడుతుంది. యెహోవా మనకు చేసిన దానంతటి యెడల మనం హృదయపూర్వకంగా మెప్పుదల చూపిస్తామా? ఆయనను సేవించటానికి మనం చేయగలిగినదంతా చేయడానికి పురికొల్పేంతగా యెహోవా యెడల మన హృదయాల్లో ప్రేమను పెంచుకున్నామా? మనమిప్పుడు అనుభవిస్తున్న ఆశీర్వాదాలను, అలాగే, భవిష్యత్తు కొరకు యెహోవా వాగ్దానం చేసిన వాటిని ధ్యానించడం మనం మన సృష్టికర్త యెడల ప్రేమను అధికం చేసుకోడానికి సహాయం చేస్తుంది. అలాంటి ప్రేమ మనలను చర్యను గైకొనడానికి అంటే మన పరిస్థితులు అనుమతించినంత మేరకు రాజ్య ప్రకటన పనిలో స్థిరముగాను, క్రమముగాను ఉండటానికి పురికొల్పుతుంది. మన ఆసక్తి, యెహోవా యెడల, పొరుగువారి యెడల మనకు గల ప్రేమకు రుజువునిస్తుంది.—మార్కు 12:30, 31.
6 మనం ఏదైనా ఒకదాన్ని ఎంత ఉన్నతంగా ఎంచుతామనేది, దానితో మనం ఏం చేస్తాము, దాని గురించి ఏం చెబుతాము అనే వాటిద్వారా చూపిస్తాము. రాజ్యాన్ని గూర్చి ప్రకటించడమనే మన ఆధిక్యతను నిజంగా విలువైనదిగా ఎంచుతామా? మనం మన పరిచర్యను ఘనపరుస్తామా? వ్యతిరేకత ఉన్నప్పటికీ, ఈ ముఖ్యమైన పనిలో స్థిరంగా ఉండాలని మనం నిశ్చయించుకున్నామా? మనం ఈ అద్భుతమైన ఆధిక్యతను ఉన్నతమైనదిగా ఎంచుతున్నట్లయితే, మనం తప్పకుండా ఆసక్తితోను, హృదయపూర్వకంగాను ఉంటాము.—2 కొరిం 4:1, 7.