హ్యాండ్బిల్లులను బాగా ఉపయోగించండి
1 సంఘ హ్యాండ్‌బిల్లులు రాజ్యమందిర చిరునామానూ, కూటాలు జరిగే సమయాలనూ మీ సమాజంలోని ప్రజలకు తెలియజేసేందుకు ఉపయోగపడతాయి. మీరు కలిసే ప్రతి ఒక్కరికీ ఒక్కొక్క హ్యాండ్బిల్ను ఇవ్వడం మంచిది. అందుకుగాను, ప్రతి సంఘం సరిపడినంతగా హ్యాండ్బిల్లుల స్టాకును ఉంచుకోవాలి. ఏదైనా ఒక సంఘం కూటాలు జరిగే స్థలాన్నీ, సమయాన్నీ మార్చుకుంటున్నట్లైతే మార్పులు అమలులోకి రావడానికి దాదాపు మూడు నెలల ముందే క్రొత్త హ్యాండ్బిల్లుల కొరకు ఆర్డరు పంపించాలి, తద్వారా కూటాల క్రొత్త సమయాలు ఉన్న హ్యాండ్బిల్లుల సరఫరా ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఇందుకు హ్యాండ్బిల్ రిక్వెస్ట్ ఫారమ్ ఉపయోగించాలి. హ్యాండ్‌బిల్లులు రూ. 40.00కి 1,000 చొప్పున సరఫరా చేయబడతాయి; వాటిని వేలమీద మాత్రమే ఆర్డరు చేయాలి. మీరు హ్యాండ్బిల్లులను పొందిన తర్వాత, వాటినుండి పూర్తి ప్రయోజనం పొందడానికి వాటిని ఎలా ఉపయోగించవచ్చు?
2 చాలామంది ప్రచారకులు తమను తాము ఒక వ్యక్తికి పరిచయం చేసుకోవడానికీ, సంభాషణలను ప్రారంభించడానికీ ఆయన చేతికి ఒక హ్యాండ్బిల్ను అందించడం ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొన్నారు. కూటాల సమయ పట్టికవైపుకి లేక దాని వెనుకవైపునవున్న సందేశంవైపుకి అవధానాన్ని మళ్లించడం, మన పని గురించీ దాని ఉద్దేశము గురించీ చర్చించడానికి నడిపించవచ్చు. హ్యాండ్బిల్లులను ఇంటియజమానికి తమ పిల్లలు అందించేలా చేయడం ద్వారా తలిదండ్రులు వారు పరిచర్యలో భాగం వహించేలా చేయవచ్చు. ఉత్తరం వ్రాయడం ద్వారా సాక్ష్యమిచ్చే పనిలో పాల్గొనే ప్రచారకులు ఉత్తరంతోపాటు ఒక హ్యాండ్బిల్ను జోడించి, ఆ వ్యక్తిని కూటాలకు హాజరుకామని ఆహ్వానించాలి. ఇంట్లో ఎవరూలేని చోట్ల హ్యాండ్బిల్లులను విడిచిపెట్టవచ్చు, కానీ వాటిని ఎవరి దృష్టికీ అందకుండా తలుపు క్రిందనుండి లోపలికి విడిచిపెట్టేలా జాగ్రత్తపడాలి.
3 యథార్థహృదయులను సత్యంలోనికి నడిపించడంలో హ్యాండ్‌బిల్లులు కీలకంగా పనిచేశాయి. ఒక స్త్రీ హ్యాండ్బిల్ మూలాన, బైబిలును అర్థంచేసుకోవాలన్న చిరకాల కోరికను నెరవేర్చుకోగలిగిందని ఒక అనుభవం చూపిస్తుంది. ఒక రాత్రి ఆమె దేవునికి ప్రార్థించింది, తర్వాత ఉదయంపూట సాక్షుల ఒక జంట ఆమె ఇంటి కాలింగ్ బెల్‌ను నొక్కారు. తలుపు రంధ్రంలోనుండి చూసి, తాను తలుపు తీయలేనని ఆమె చెప్పింది. సాక్షులు హ్యాండ్బిల్ను తలుపు క్రిందినుండి లోపలికి తోశారు. దాని మీద, “మీ బైబిలును తెలుసుకోండి” అని ఉంది. ఆమె దాన్ని చూసి తలుపు తీసింది. వెంటనే ఒక పఠనం ప్రారంభించబడింది, తర్వాత ఆమె బాప్తిస్మం పొందింది. దేవుని పరిశుద్ధాత్మ శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకుండా, మనం మన పరిచర్యను సంపూర్ణంగా నెరవేరుస్తుండగా హ్యాండ్బిల్లులను క్రమంగా బాగా ఉపయోగిద్దాము.—ఫిబ్రవరి 1994 మన రాజ్య పరిచర్య, (ఆంగ్లం) పేజీ 1 కూడా చూడండి.