ఎల్లప్పుడు హాజరుకావడం ఎంత మంచిది!
1 తూర్పు యూరప్‌లో దశాబ్దాలపాటు మన ప్రియ సహోదరులు కూటాలు బహిరంగంగా నిర్వహించుకోవడంపై నిషేధం ఉండేది. ఈ నిషేధాలు ఎత్తివేయబడిన తర్వాత, వారు స్వేచ్ఛగా కూటాలు జరుపుకోగల్గడం వారికి ఎంతటి ఆనందాన్ని కల్గించి ఉంటుందో ఉహించండి!
2 అలాంటి సంఘాల్లో ఒకదాన్ని సందర్శించిన ఒక సర్క్యూట్ పైవిచారణకర్త ఇలా వ్రాస్తున్నాడు: “మంగళవారం సాయంత్రం, సరిగ్గా నా సందర్శనం ప్రారంభంలోనే హాల్లోని హీటింగ్ సిస్టమ్ పాడైపోయింది. హాలు బయట ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలకు కాస్త అటూ ఇటుగా ఉంది, లోపలి ఉష్ణోగ్రత చూస్తే ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్లు మాత్రమే ఉంది. సహోదరులందరూ స్వెట్టర్లు వేసుకుని, స్కార్ఫ్‌లు కట్టుకుని, చేతితొడుగులతో, టోపీలతో, బూట్లతో తమను తాము పూర్తిగా కప్పుకుని కూర్చుని ఉన్నారు. ఎవ్వరూ కూడా బైబిలును తెరిచి లేఖనాలను చూడలేకపోతున్నారు, ఎందుకంటే పేజీలను త్రిప్పడం అన్నది ఆ పరిస్థితుల్లో అసంభవం. నేను ప్లాట్‌ఫారమ్‌పైన సూట్లో పూర్తిగా కొయ్యలా గడ్డకట్టుకునిపోయి ఉన్నాను, నేను మాట్లాడిన ప్రతిసారీ నా ఊపిరిని చూడగల్గుతున్నాను. కానీ నన్ను అబ్బురపర్చింది ఏమిటంటే, ఒక్కరు కూడా ఫిర్యాదు చేయడం నేను వినలేదు. సహోదరులందరూ తాము అక్కడ హాజరై ఉండడం తమకు ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఎంత బాగుందో వ్యక్తం చేశారు!” ఆ సహోదరులు ఆ కూటానికి రాలేకపోవడాన్ని గురించి ఊహించను కూడా ఊహించలేదు!
3 మనం కూడా అలాగే భావిస్తున్నామా? ప్రతివారం స్వేచ్ఛగా కూటాలకు హాజరుకాగల్గడాన్ని అమూల్యమైన అవకాశంగా మనం దృష్టిస్తున్నామా? లేక పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కూటాలను అలక్ష్యం చేస్తామా? కూటాలకు క్రమంగా హాజరుకావడం బహుశ సులభం కాకపోవచ్చు, అంతేగాక కొన్నిసార్లు కూటాలకు రాకపోవడానికి మనకు సరైన కారణమే ఉండవచ్చు. అయితే, ఇది మర్చిపోకండి—మనలో కొందరు సహోదరులు వయసు పైబడుతున్నా, గంభీరమైన ఆరోగ్య సమస్యలు ఉన్నా, అంగవైకల్యతలు ఉన్నా, తీవ్రమైన పని ఒత్తిడి ఉన్నా, మరితర పెద్దపెద్ద బాధ్యతలు ఉన్నా కూటాల ప్రాముఖ్యతను గ్రహించి దాదాపు ప్రతీ కూటానికీ హాజరు అవుతున్నారు. మనం వారి చక్కని మాదిరిని అనుకరించడం ఎంత మంచిది!—లూకా 2:37 పోల్చండి.
4 మన క్రైస్తవ కూటాలన్నింటికీ—చిన్న బుక్ స్టడీ నుండి పెద్ద సమావేశం వరకూ అన్నింటికీ—హాజరు కావడం ద్వారా సత్యారాధనకు మద్దతునివ్వడం మన అలవాటుగా చేసుకుందాము. ఈ సమావేశాలకు హాజరుకావడాన్ని మనం ఎందుకంత గంభీరంగా తీసుకోవాలి? ఎందుకంటే మనం కలిసి సమకూడాలన్నది ఒక దైవిక ఆజ్ఞ. కానీ ఇంకా ఇతర ప్రాముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి. మనకందరికీ దైవిక ఉపదేశంద్వారా లభించే ప్రయోజనాలూ, పరిశుద్ధాత్మ సహాయమూ చాలా అవసరం, ఇవి కూటాల్లో మనకు లభిస్తాయి. (మత్త. 18:20) మన సహోదరులతో సహవసించినప్పుడు పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ప్రోత్సాహం ద్వారా మనం బలపర్చబడతాము.—హెబ్రీ. 10:24, 25.
5 యేసు రూపాంతరము పొందినప్పుడు పేతురు, “ఏలినవాడా, మనమిక్కడ ఉండుట మంచిది” అన్నాడు. (లూకా 9:33) మన క్రైస్తవ కూటాలన్నింటి గురించీ మనమలాగే భావించాలి. నిజంగానే, ప్రతీ కూటానికీ హాజరుకావడం ఎంత మంచిది!