పునర్దర్శనాలు చేయడంలోని సవాలును ఎదుర్కోవడం
1 మనము సువార్త పరిచారకులముగా, శిష్యులను చేయాలని ఆజ్ఞాపించబడ్డాము. (మత్త. 28:19, 20) అందుకు పునర్దర్శనాల కొరకు ప్రణాళిక వేసుకోవడం అవసరం. పునర్దర్శనాలను చేయడంలో నైపుణ్యాన్ని సాధించడం ఉత్తేజకరమైన సవాలుగా ఉండగలదు. రాజ్య నిరీక్షణని ఇతరులతో పంచుకునేందుకుగాను మనం మన స్వంత అనుకూలతను కాస్త ప్రక్కకి పెట్టవలసి రావచ్చు. యథార్థవంతులు తమ ఆధ్యాత్మిక అవసరాలను తీర్చుకునేలా మనం వారికి సహాయం చేసే అవకాశాలను పునర్దర్శనాలు మనకు ఇస్తాయి.
2 ఆసక్తిని కనపర్చిన ప్రతి ఒక్కరి దగ్గరికి తిరిగివెళ్లండి: కొంతమంది మన ప్రచురణలను నిరాకరించవచ్చు, అయినప్పటికీ రాజ్య సందేశంలో ఆసక్తిని కనపర్చినవారి అందరి దగ్గరికి తిరిగివెళ్లాలి. కానీ మీరు ఆసక్తిని ఎలా రేకెత్తించగలరు? ఇందుకు కీలకం దేవుని వాక్యమైన బైబిలును ఉపయోగించడమే. ప్రజలు లేఖనాధార చర్చల్లో భాగం వహించేలా చేయడంద్వారా రాజ్య సందేశంలో ఆసక్తిని ఎలా పెంపొందించవచ్చో యేసూ, ఆయన అపొస్తలులూ చూపించారు.—మార్కు 10:17-21; అపొ. 2:37-41.
3 తిరిగివెళ్లడంలో మన సంకల్పం బైబిలు పఠనాన్ని ప్రారంభించడమే. గృహ బైబిలు పఠనం ఎలా నిర్వహించబడుతుందో గృహస్థుడికి ముందే చూపించే అవకాశం మనకు లభించవచ్చు. యథార్థహృదయుడైన వ్యక్తిని కనుగొని, బోధించగల్గేందుకు సహాయం చెయ్యమన్న మీ ప్రార్థనలకు యెహోవా జవాబిస్తాడని మీరు నిశ్చయతను కలిగివుండవచ్చు. కాబట్టి, పునర్దర్శనాలు చేసేముందు మీ పునర్దర్శనాలు బైబిలు పఠనాలుగా మారేందుకు సహాయపడమని యెహోవాను ఎందుకు కోరకూడదు? మనం పునర్దర్శనం చేసే ప్రతి ఒక్కరూ బైబిలు పఠనానికి ఒప్పుకోరన్నది వాస్తవమే. కానీ ఆసక్తి గల వారి హృదయాలను కదిలించాలని మనం ప్రార్థన ద్వారా యెహోవాను వేడుకోవచ్చు.
4 కరపత్రాలను విస్తృతంగా ఉపయోగించడం: గతంలో ప్రచురణలు స్వీకరించని చోట కూడా పునర్దర్శనాలు చేస్తూ బైబిలు పఠనాన్ని ప్రారంభించేందుకు కరపత్రాలను ప్రభావవంతంగా ఉపయోగించవచ్చు. ముఖ చిత్రాన్ని గూర్చి చర్చించడం ద్వారా చాలా మంది సంభాషణ ప్రారంభించగలిగారు. గృహస్థుడితో పాటు ఒక్కొక్క పేరాను చదవండి. గృహస్థుడు ప్రశ్న అడిగినప్పుడు, మీరు కాస్త ఆగి గృహస్థుడి అభిప్రాయమేమిటో లేదా దృక్కోణమేమిటో చెప్పమని అడగండి. లేఖనాలను తెరచి చదివి అవి ఎలా వర్తిస్తాయో చూపించండి. అటుతర్వాత చర్చను కొనసాగించి, ఏ పుస్తకం నుండైతే స్టడీ చేస్తామో ఆ ప్రచురణ వైపుకు దృష్టి మళ్లించండి.
5 సవాలును విజయవంతంగా ఎదుర్కోవడం: “మీకేమైనా సందేహాలుంటే ఈ ప్రచురణ వెనుకనున్న అడ్రస్‌కు వ్రాయండి” అని అనేకమంది పబ్లిషర్లు గృహస్థులకు తెలియజేస్తున్నట్లు ప్రయాణ పైవిచారణకర్తలు రిపోర్ట్ చేశారు. ఏమైనప్పటికి, పైనున్న సలహాలను, 1997 మార్చి మన రాజ్య పరిచర్యలోని “పునర్దర్శనాలు చేసేందుకు ధైర్యాన్ని కూడగట్టుకోండి” అనే ఇన్సర్ట్ని జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా పునర్దర్శనాలను చేయడంలోని సవాలును ప్రభావవంతంగా ఎదుర్కోగలము.